Suryaa.co.in

Andhra Pradesh

వలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు

– ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడటం దారుణం
– ప్రభుత్వ జీవోలతోనే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు
– ప్రభుత్వం నుంచే వారికి చెల్లింపులు
– గత ప్రభుత్వం జారీ చేసిన జీఓలే దానికి నిదర్శనం
– వైయ‌స్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

తాడేపల్లి: వలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్‌ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైయ‌స్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిపడ్డారు.

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీఓల ఆధారంగానే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. ప్రభుత్వం నుంచే వలంటీర్లకు చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. ఇప్పుడు వలంటీర్ల నియామకం, వారికి జీతాల చెల్లింపులతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే…

రాష్ట్రంలో ప్రభుత్వ విధివిధానాలు, ఉత్తర్వులతోనే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. దానికి సంబంధించి వైయస్సార్సీపీ ప్రభుత్వంలో జారీ చేసిన జీఓలు, బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ వలంటీర్ల కోసం చేసిన కేటాయింపుల అధికారిక ఉత్తర్వులను ఈ మీడియా సమావేశంలో ప్రజలందరికీ చూపిస్తున్నాము. వాటిని తప్పు అని కూటమి ప్రభుత్వం చెప్పగలదా?

ఇవ్వన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవే. వీటి గురించి ఏ మాత్రం అవగాహన లేనట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అబద్దాలపైన అబద్దాలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిన వైనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గోడు వెళ్ళబోసుకోవడానికి వెళ్ళిన వలంటీర్ల పట్ల ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. వలంటీర్లు ఎవరో తెలియనట్లుగా పవన్ మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆయన శాఖ పరిధిలో పనిచేసిన వారి గురించి ఏ మాత్రం తెలియనట్లుగా వ్యవహరించడం చూస్తే నమ్మించి ఇంత దారుణంగా వంచిస్తారా అని ఆశ్చర్యం కలుగుతోంది.

ప్రభుత్వం జీఓ ద్వారా వలంటీర్లను నియమించింది. నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కల్పిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. దీనికి గానూ రెవెన్యూశాఖ బడ్జెట్‌లో వారి కోసం కేటాయింపులు కూడా చేసింది. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. వీటిని గమనించకుండా వలంటీర్లకు ప్రభుత్వంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రిగా పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయంలో అబద్దాలు చెప్పడం సరికాదు.

ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హమీలను కూటమి సర్కార్ నెరవేర్చడం లేదు. గతంలో ఉన్న పీఆర్సీ కమిషన్‌ను రద్దు చేశారు. కొత్త కమిషన్‌ను ఇప్పటి వరకు నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామంటూ ప్రకటించారు. పదినెలలుగా దాని ఊసే లేదు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఉద్యోగులు పెట్టుకున్న జీపీఎఫ్, సరెండర్ లీవులను ఇవ్వడం లేదు.

ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారో కనీసం చెప్పడం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. జాబ్‌చార్ట్ విడుదల చేస్తామని చెప్పారు. ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దీనిపైన ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టత లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

బడ్జెట్‌లో ఎక్కడా దానికి సంబంధించిన కేటాయింపులు లేవు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ గురించి పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ వాటాను కలిపి ఇన్సూరెన్స్ సంస్థకు చేయాల్సిన చెల్లింపులను కూడా చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

LEAVE A RESPONSE