గౌరవనీయులైన శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి,
అమరావతి,
ఆంధ్రప్రదేశ్.
విషయం : అకాల వర్షాలకు గోదావరి జిల్లాల్లో జరిగిన పంట నష్టంకి రైతులకు పరిహారం చెల్లింపు గురించి..
అయ్యా!
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. అప్పులుచేసి పెట్టుబడులు పెట్టి, ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలకు నీటిపాలై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన వరుస తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయి రైతులు రెండుసార్లు నాట్లు వేసి పంట కోల్పోయారు. మరోసారి పెద్ద ఎత్తున పెరిగిన పెట్టుబడి వ్యయంచేసి పండించిన పంటని అకాలవర్షాలు మింగేశాయి. ఎక్కడ చూసినా వర్షాలకు కుళ్లిన పంటలు, నేలకొరిగిన చేలు, మొలకలెత్తుతున్న ధాన్యమే కనిపిస్తున్నాయి. రైతుల పంటపొలాల్లో నీళ్లు, కళ్లల్లో నీళ్లతో దయనీయంగా ఉంది పరిస్థితి.
ఈ రెండు జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం ఏర్పడింది. చాలాచోట్ల పంట తడిసిపోయి మొలకలు కూడా వస్తున్నాయి. మిర్చి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సరైన నిర్వహణ లేకపోవడంతో డ్రైన్లు పొంగిపొర్లి పొలాలు నీట మునిగాయి. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యమంటూ తక్కువ రేటుకు కొనేందుకు దళారులు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. అధికారులేమో, 33శాతం నష్టం వాటిల్లితేనే పంట నష్టం నమోదు చేస్తామనే నిబంధనలు పెట్టి రైతులను వేధిస్తున్నారు. పంటనష్టం నమోదులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. గోనె సంచులు అందుబాటులో లేవంటూ కొన్నిచోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ఆర్బీకేల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతులకుఅపారనష్టం జరిగినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కూరగాయ పంటలు, పండ్ల తోటలకు, ఆక్వా కల్చర్‌కు కూడా పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. గత ఏడాది మిర్చి పంటకు సరైన ధర లభించక ఇబ్బందులు పడ్డ రైతులకు ఈ ఏడాది వర్షాలు మరింత నష్టాన్ని చేకూర్చాయి. ప్రభుత్వం రైతుకు వరికి హెక్టారుకు రూ.25 వేలు, చెరకు రూ.30 వేలు, పత్తికి రూ.25 వేలు, జొన్నకు రూ.15 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందించాలి. ఎటువంటి షరతులు లేకుండా పూర్తి మొత్తం చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. నామ్‌కే వాస్తేగా ఉన్న రైతుభరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలిచే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. పంటనష్టపరిహారం లెక్కింపు రైతులకి దూరంచేస్తోన్న నిబంధనలను సవరించి, నష్టపోయిన ప్రతీరైతూ-కౌలు రైతుకీ సాయం అందించాలి.
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి