– తెలంగాణలో ఉన్న ఏపీ వక్ఫ్ బోర్డ్ రికార్డులను తెప్పించండి.
– వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం 50 కోట్లు, మసీదుల మరమ్మత్తులకు 10 కోట్లు మంజూరు చేయండి.
– ఆదాయం లేని 1500 మసీదుల పెండింగ్ దరఖాస్తులను మంజూరు చేయండి.
బారాషహీద్ దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేయండి.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్.
అమరావతి: తెలంగాణ వక్ఫ్ బోర్డ్ నుంచి ఏపీ వక్ఫ్ బోర్డ్ కు రావాల్సిన 50 కోట్ల పెండింగ్ బకాయిలను ఇప్పించాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసి పలు సమస్యల గురించి వివరించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కు చెందిన అన్ని రికార్డులు (డిజిటల్ రికార్డులతో సహా), పత్రాలు తెలంగాణ నుంచి బదిలీ చేయలేదని, ఆస్తులను అప్పగించలేదని తెలిపారు. చాలా వ్యాజ్యాలు / కోర్టు కేసులకు ఆ ఫైల్‌ల నుండి మెటీరియల్ అవసరమని పేర్కొన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు వద్ద రికార్డులు లేని కారణంగా చట్టపరమైన విషయాలలో కౌంటర్లు దాఖలు చేయలేకపోతున్నామని తెలిపారు. త్వరితగతిన ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన రికార్డులు అందేలా చేయాలని కోరారు.
ఆదాయం లేని 1500 మసీదుల పెండింగ్ దరఖాస్తులను, మసీదులు, కాంపౌండ్ గోడలు గ్రేవ్ యార్డ్‌లు, ఈద్గాలు, అషూర్ ఖానాలు, దర్గాలు మొదలైన వాటి నిర్మాణం మరియు మరమ్మతుల కోసం 2024-25 సంవత్సరానికి గాను 10.00 కోట్లు, వక్ఫ్ ఆస్తులను ఆక్రమణల నుండి రక్షించడానికి, సరైన చర్యలు తీసుకోవడానికి, అలాగే ఆస్తులకు ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డ్ ల ఏర్పాటు, తదితర చర్యలకు రూ. 50.00 కోట్లు, హై కోర్టు, A.P. వక్ఫ్ ట్రిబ్యునల్, అపెక్స్ కోర్ట్ మరియు మొదలైన కేసులను వాదించడానికి చట్టపరమైన ఖర్చుల ఖర్చు కోసం 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
AP ఆన్‌లైన్ వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. 2014లో నెల్లూరు లోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ-ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి, ఇతర అనుబంధ అభివృద్ధి కోసం 20 కోట్లు విడుదల చేశారని, దానిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలిపారు.
2024లో రొట్టెల పండుగకు సంబంధించి నెల్లూరు లోని బారా షహీద్ దర్గా అభివృద్ధికి సంబంధించి ప్రకటించిన 5 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ విషయాలలో తమ జోక్యం, తీసుకునే చర్యలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో తన బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, తద్వారా సమాజ సంక్షేమానికి దోహదపడటంలో గొప్పగా సహాయపడుతుందని తెలిపారు.