సచివాలయ ఉద్యోగులతో ఇళ్ల దగ్గరే పింఛన్లు ఇవ్వాలి

 -వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు
-మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

వైసీపీ నేతల ప్రోద్బలంతో వాలంటీర్లు నేరుగా ఓటర్లను ప్రభావితం చేయడం, ప్రచారంలో పాల్గొనడం జరిగాయని, వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుందని మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం కసుమూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ రోజు వైసీసీ నాయకుల కారణంగా వాలంటీర్లు బలయ్యే పరిస్థితి వచ్చిందని, వాలంటీర్లకు మంచి భవిష్యత్‌ కల్పిస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయినా వైసీపీ నేతల అత్యుత్సాహం చూపి వలంటీర్లను ప్రచారంలో భాగస్వాములను చేసి ఈసీ స్పందించే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రతి సచివాలయంలో కనీసం 12 మంది ఉద్యోగులు ఉన్నారు… ఒక గ్రామంలో 200 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్‌ పంపిణీ చేయలేరా అని ప్రశ్నించారు. సరిగ్గా రెండు గంటల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయవచ్చని అన్నారు.

ఇవన్నీ చేయకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వాలంటీర్లను దూరంగా పెట్టారనే దుష్ప్రచారం మొదలుపెట్టి పింఛన్ల పంపిణీలో జరుగు తున్న ఆలస్యానికి టీడీపీనే కారణమనే కుట్రపూరిత ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. కలెక్టర్‌ స్పందించి జిల్లాలో సాయంత్రానికి పింఛన్‌ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్లను పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేస్తుంటే ఎన్నికల కమిషన్‌ చూస్తూ ఊరుకుంటుందా అని హితవుపలికారు. 2019 ఎన్నికల్లో సీఎస్‌, డీజీపీని బలవంతంగా బదిలీ చేసినప్పుడు వైసీపీ నేతలకు నొప్పి తెలియలేదా అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ నాలుగో విడత నిధులు రూ.4 వేల కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే సమయంలో అడ్డుకున్న చరిత్ర వైసీపీ నాయకులదని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply