Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ను గద్దె దించేందుకు జనం సిద్ధం

– 217 జిఓతో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు
– ‘మత్స్యకార హోరు’ దీక్షలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

నెల్లూరు, మార్చి 19: అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్న జిఓ 217కు వ్యతిరేకంగా ఏపీ మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు నెల్లూరు నగరంలో ‘మత్స్యకార హోరు’ పేరిట దీక్ష శిబిరం నిర్వహించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మూడు జిల్లాల మత్స్యకార జెఎసి ప్రతినిధులతో కలిసి దీక్ష పాటించారు. టిడిపి పొలిట్ బ్యూరో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కావలి టిడిపి ఇంఛార్జి ఎం. సుబ్బానాయుడు, కోవూరు టిడిపి ఇంఛార్జి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగుమహిళ నాయకురాలు టి.అనూరాధ, అఖిలపక్ష నాయకులు బి.రాధాకృష్ణ తదితరులు ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

శనివారం సాయంత్రం దీక్ష ముగింపు సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్దాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ పాలనలో అప్రజాస్వామిక విధానాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయని, పన్నుల భారంతో ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. గ్రామాలలో ఉండే చెరువులపై ఉపాధి పొందే మత్స్యకారుల పొట్టకొట్టేందుకు, మత్స్యకార సొసైటీల ఆర్ధిక స్థితిని దెబ్బ తీసేందుకు జగన్ ప్రభుత్వం జిఓ217 తీసుకు వచ్చిందని ఆయన ఆరోపించారు.

ఈ జిఓను ప్రభుత్వం రద్దు చేసే వరకూ మత్స్యకార జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని రవీంద్ర ప్రకటించారు. వైసీపీ పాలనలో మత్స్యకార సంక్షేమం కొండెక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదరణ పథకం కింద మత్స్యకారులకు బోట్లు, వలలు, వేటకు వెళ్లే బోట్లకు సబ్సిడీపై డీజిల్ ఇచ్చామని, మత్స్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక మార్కెట్లు పెట్టామని, మోపెడ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 వేల నుండి రూ.4 వేలకు పెంచామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం రూ.10 వేలు పరిహారం ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ అరకొరగానే ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 15 లక్షల మంది మత్స్యకారులుంటే లక్ష మందికి కూడా ఈ పరిహారం అందడం లేదని రవీంద్ర ఆరోపించారు. ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారులను ఆదుకునే ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తూ నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని రవీంద్ర మండిపడ్డారు. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్స్ అంటూ జగన్ బ్రాండ్లను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. ఈ మద్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేయలేని పేదలకు వైసీపీ నాయకులే నాటుసారా అమ్మకాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

వైసీపీ వాళ్ళు తయారు చేసిన నాటుసారా తాగి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని రవీంద్ర గుర్తు చేశారు. నాటుసారాకు ప్రజలు బలయిపోతే ఆ కుటుంబాలను జగన్ ప్రభుత్వం ఆదుకోకపోగా అవి సహజ మరణాలంటూ ప్రకటించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమించాలని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని రవీంద్ర స్పష్టం చేశారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 217 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టేలా ఉన్న 217 జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

తడ నుండి ఇఛ్ఛాపురం వరకు ఉన్న మత్స్యకారులు ఏకత్రాటిపైకి వచ్చి ఈ జిఓకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మత్స్యకార జెఎసి పోరాటానికి అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) మాట్లాడుతూ మత్స్యకారుల పొట్టకొట్టేందుకే జగన్ ప్రభుత్వం జిఓ 217 తెచ్చిందని, ఈ జిఓను తిప్పికొట్టేందుకే తమ పోరాటమని చెప్పారు. మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎ. సత్యనారాయణ, ఆప్ కాప్ మాజీ ఛైర్మన్ కె.పాల్ శెట్టి, జెఎసి చిత్తూరు జిల్లా కన్వీనర్ మడితం రమణ, వైస్ కన్వీనర్ బి.విజయభాస్కర్, రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షులు బర్రే ప్రసాద్, తిరుపతి పార్లమెంట్ జెఎసి అధ్యక్షులు ఎ.మునిరత్నం, నెల్లూరు పార్లమెంట్ జెఎసి అధ్యక్షుడు పావంజి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE