* రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత
* జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతికి ఎంతో మేలు
* రాష్ట్ర ఖజానాపై రూ.8 కోట్ల భారం
* అయినా, సంస్కరణల స్వాగతించిన సీఎం చంద్రబాబు
* పెనుకొండ పట్టణంలో విస్తృతంగా అభివృద్ధి పనులు : మంత్రి సవిత
* పెనుకొండలో జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమం
* పాల్గొన్న మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి :జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని, ధరల తగ్గులపై ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ఖజానాపై రూ.8 వేల కోట్ల మేర భారం పడినా పేదలకు మేలు కలుగుతోందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సంస్కరణలను స్వాగతించారన్నారు. పెనుకొండ పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని వజ్రాలపేట నుంచి నారాయణమ్మ కాలనీ వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు దుకాణాలను సందర్శించారు. నిత్యావసర, ఇతర వస్తువుల ధరల తగ్గుదలపై వినియోగదారులతోనూ ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గుదలపై మంత్రి సవిత అవగాహన కల్పించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు.
ముఖ్యంగా నిత్యావసరాలు, ఇన్స్యూరెన్స్, మెడికల్, దుస్తులు వంటి ప్రధాన వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఆర్థికంగా ఎంతో లబ్ధి కలుగుతోందన్నారు. రూ.5 వేల విలువ చేసే నిత్యావసరాలపై రూ.1200ల వరకూ ధరలు తగ్గాయన్నారు. రూ.100ల విలువ చేసే టూత్ పేస్ట్ పై రూ.9లు తగ్గిందన్నారు. ధరల తగ్గుదలపై పేదలు, మధ్య తరగతి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు.
రాష్ట్రంపై రూ.8 వేల కోట్ల భారం
జీఎస్టీ 2.0 సంస్కరణలతో రాష్ట్ర ఖజానాపై రూ.8 వేల కోట్లు భారం పడుతోందని మంత్రి సవిత తెలిపారు. పేదలకు మేలు కలుగుతోందన్న ఉద్దేశంతో దేశంలో అందరి కంటే ముందు సీఎం చంద్రబాబు జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ది జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. ఒక వైపు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం -2, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం, ఆటో డ్రైవర్ల సేవలో…; నూతన రేషన్ కార్డులు, స్మార్టు రేషన్ కార్డుల అందజేత సహా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
ఉచిత ఇసుక అందజేయడంతో భవన నిర్మానం ఊపందుకుందన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.5 వేలు ఉండేదని, ప్రస్తుతం రూ.1500లకే లభ్యమవుతోందని అన్నారు. జాతీయ ఉపాధి పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపులకు తావులేకుండా ప్రజాపాలన సాగుతోందని మంత్రి సవిత తెలిపారు.
అభివృద్ధి దిశగా పెనుకొండ
పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ – కోనాపురం రహదారిని రూ.80 లక్షలత్ నిర్మిస్తున్నామన్నారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.
నారాయణమ్మ కాలనీలో రూ.20 లక్షలతో సీసీ కాలువలు నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఇటీవలే భూమి పూజ చేశామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.