Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు

  • ఆరోగ్య శ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో ఆందోళన
  • ఆయుష్మాన్ కింద ఇచ్చేది రూ.5 లక్షలే
  • జగన్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా అందించారు
  • ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం 60 లక్షల మందికే వర్తిస్తుంది
  • 1 కోటి 42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులున్నారు
  • ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోంది
  • అధికార పార్టీని నిలదీసిన మాజీ మంత్రి విడదల రజిని

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో పెద్ద ఆందోళన నెలకొందన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని నోట్లోంచివచ్చిన మాటలు, చంద్రబాబు ఆలోచనలేనని రజిని తేల్చి చెప్పారు.

కేంద్ర మంత్రి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలేం కాబట్టి.. అందరూ ఆయుష్మాన్భారతి కార్డులు తీసుకోవాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనసులో ఉన్న మాటలను తన మంత్రుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

ఆరోగ్యరంగం తమకు అంత ప్రాధాన్యత ఉన్న రంగం కాదని… ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు.గతంలో కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని వైయస్.జగన్మోహన్ రెడ్డి… పేదవాడికి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో ఏకంగా రూ.25 లక్షలు వరకు పెంచి అమలు చేశారన్నారు.

ఇవాళ ఆయుష్మాన్ భారతి పరిధి కేవలం రూ.5 లక్షలు వరకేఉందన్న విషయాన్ని మరోసారు గుర్తుచేశారు.ఆయుష్మాన్ భారతి బడ్జెట్ ఏడాదికి కేవలం రూ.౩౦౦ కోట్లు కాగా, ఆరోగ్యశ్రీలో ఏడాదికి మొత్తం దాదాపుగా రూ.4,100 కోట్లు ఖర్చు చేశామన్నారు. దీన్ని ఎవరు భరించాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాథ్యత తీసుకోవాల్సిందే ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశమంతా కోవిడ్ వంటి పాండమిక్ వల్ల ఇబ్బందులు పడుతుంటే… మన రాష్ట్రంలో ప్రజలను జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు.

ఆయుష్మాన్ భారత్ కార్డు ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మందికి వర్తిస్తుండగా.. ఆరోగ్యశ్రీ కార్డు 1 కోటి 42 లక్షల మంది కుటుంబాలకు అంటే ఏపీలో 90 శాతం మంది ప్రజలకు వర్తిస్తుందని తెలిపారు. ఈ నేపధ్యంలో కేవలం 60 లక్షల మందికే వర్తించే ఆయుష్మాన్ భారతి కార్డులను అందరూ తీసుకుని వాడుకోవాలంటే… మిగిలిన పరిస్థితి ఏంటని నిలదీశారు. వారికి ఆరోగ్యసమస్యలు వస్తే ఏం చేయాలన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు చేసి, ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్లింది, మాకు బాధలున్నాయన్న కూటమి మంత్రి వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో చెల్లించాల్సిన రూ.632 కోట్లును ఏమాత్రం సాకులు చెప్పకుండా వైయస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

అలాంటిది ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీ బకాయిలు చెల్లింపునకు చెబుతున్న సాకులు చూస్తుంటే… అధికార పార్టీ తన బాధ్యతలు నుంచి వైదొలుగుతున్నారేమోనన్న సందేహం ప్రజలకు కలుగుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత జనవరి వరకు ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించామని… ఆ తర్వాత పిబ్రవరి, మార్చి వరకు అప్లోడ్ అయిన బిల్లులు వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులను కూటమి ప్రభుత్వం క్లియర్ చేయడంతో పాటు అంతరాయం లేకుండా పేదలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు.

ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాకులు చెబుతోందన్నారు. ఫలితంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేసే పరిస్థితిని తీసుకువస్తోందని మండిపడ్డారు. వీటి ద్వారా ప్రజలను ఆందోళనకు గురిచేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.

ఏ రాష్ట్రంలోనై ఆరోగ్యరంగానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తారని.. అందులో భాగంగానే 2019 నుంచి 2024 వరకు వైయస్.జగన్ నాయకత్వంలో ఆనాడు కాంప్రహెన్షివ్ హెల్త్ కేర్ అందరికీ అందించడం, పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ఇంటివద్దకే అందించాలన్న ఆలోచన చేసి అమలు చేశామన్నారు.

ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని దివంగత మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి 2007లోఅమలు చేశారని, రాష్ట్రంలో ఏ పేద ప్రజలైనా వాళ్ల పేదరికం కారణంగా చికిత్స చేసుకోలేని స్ధితిలో ఉన్నప్పుడు ఆ పేదవాళ్లు పడే బాథను ప్రభుత్వ బాధ్యతగా భావించి వారికోసం ఆరోగ్యశ్రీపథకాన్ని తీసుకొచ్చారని.. ఈ పథకం వైయస్సార్ మానసపుత్రిక అని అన్నారు. ఇది దేశం మొత్తం గుర్తించుకునే పథకమని.. ప్రతి తెలుగువాడు గర్వంగా ఈ పథకం గురించి చెప్పుకుంటారన్నారు.

దివంగత వైయస్సార్ హయాంలో మొదలైన ఈ పథకాన్ని వైయస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో మరింత పటిష్టంగా అమలు చేశామన్నారు. అలాంటి పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలనూ చూశామన్నారు. గత ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని అమలు చేసిన విధానం చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీలో 1059 ఉన్న ప్రొసీజర్స్ ను జగన్మోహన్ రెడ్డి హయాంలో 3257 వరకు పెంచి అమలు చేశామన్నారు. ఏడాదికి రూ.1000 కోట్లు టీడీపీ హయాంలో ఖర్చు చేస్తే… వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరాకు కలిపి సుమారు రూ.4,100 ఖర్చు చేశామని రజని తెలిపారు.

ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు గత ప్రభుత్వాల హయాంలో 1000 కంటే తక్కువ ఉంటే.. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి స్నేహపూర్వక పరిస్థితులు కల్పించడంతో పాటు వాటి సంఖ్యను కూడా 2300 పైగా పెంచి ఆరోగ్యశ్రీని విస్తరించారని తెలిపారు.

ఆరోగ్యశ్రీలో వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ అందుబాటులో ఉండగా… కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారతిలో కేవలం 1949 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని… మిగిలిన ప్రొసీజర్స్ కు సంబంధించి ఆరోగ్యసమస్యలు వస్తే చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.

ఆరోగ్యశ్రీలో మరో బృహత్తర పథకం ఆరోగ్య ఆసరా అని.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న తర్వాత రికవరీ పీరియడ్లో సదరు బాధితుడు ఎలాంటి పనులు చేయలేని నేపధ్యంలో వారికి ఆర్ధికంగా సాయం చేసేందుకు రోజుకు రూ.225 చొప్పున నెలకి రూ.5వేలు వరకు అందించామన్నారు. ఏడాదికి దీనికోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ పధకం ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుందని.. ఈ నేపధ్యంలో ఆరోగ్య ఆసరా పథకం ఏం చేద్దామనుకుంటున్నారు? దీనిపై మీ విధానం ఏంటని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

పేదవాడి ఆరోగ్యరక్షణ బాధ్యతగా తీసుకుని.. ఎక్కడా రాజీలేని విధంగా ఆరోగ్యశ్రీ సేవలను వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇలాంటి నేపధ్యంలో ఆరోగ్యశ్రీ పథకం పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు నాణ్యమైన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆవసరం రాకూడన్న ఆలోచనతో వైద్య ఆరోగ్య రంగంలో వైయస్.జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోనే వైద్య విద్యను మరింత పటిష్టం చేయాలన్న ఆలోచనలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఏపీలో రూ.8,500 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

కేవలం ఒక రోజులో ఇదంతా సాధ్యం కాలేదని.. దీనికోసం పక్కా ప్రణాళికతో మూడు దశలలో ఈ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటనేది కూటమి ప్రభుత్వంలో ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే ఆ మంచిపేరు జగన్మోహన్ రెడ్డికి వస్తుందన్నఆలోచన అధికారపార్టీకి ఉన్నట్టు అనిపిస్తుందన్నారు.

ముందుచూపు, రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంచి ప్రయత్నం చేసారని.. మరి ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఎందుకు ఆ పనిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో అధికార పార్టీనేతల ఆలోచన, కార్యాచరణ ప్రణాళిన ఏంటనేది స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారని.. వీటిపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలని రజిని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెలకు, గిరిజన ప్రాంతాల్లోనూ పేదవాడి ఇంటి ముంగిటకే మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్ధేశ్యంతో గతంలో వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రివెంటివ్ కేర్లో భాగంగా గ్రామంలోనే వైద్య సేవలు అందించే కార్యక్రమంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను అమలు చేశామన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంపై ప్రభుత్వ విధానమేంటో చెప్పాలని రజిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కొనసాగుతుందా? లేదా? అని నిలదీశారు. ఆరోగ్యసురక్ష కార్యక్రమంపైనా స్పష్టత ఇవ్వాలన్నారు.

వీటికి తోడు గ్రామీణ, పట్టణ, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులను మరింత మెరుగ్గా అభివృద్ది చేయడంతో పాటు కొత్త ఆసుపత్రుల ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రూ.17వేల కోట్లతో చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంపైనా ప్రభుత్వం తన విధానమేంటో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంపైనా మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది స్పష్టత ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖపై ప్రభుత్వ విధానమేంటన్నది కూటమి ప్రభుత్వం కచ్చితంగా స్పష్టత ఇవ్వాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు

LEAVE A RESPONSE