-తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి
-బి అర్ ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉంది
-కాంగ్రెస్ పార్టీ బీజేపీ కి వంత పాడుతున్నది
-అయినా, వాళ్ళ ను ఎదుర్కొంటూనే, సీఎం కేసీఆర్ ప్రజల బాగోగుల గురించే ఆలోచిస్తున్నారు
-తెలంగాణ ప్రగతి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారు
-పార్టీ పరంగా, ప్రజల పరంగా ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండాలి
-పార్టీని, ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడు కోవాలి
-పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత నాది
-పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావు
-ఎద్దుల బండిపై ఊరేగింపు.. ఘనంగా స్వాగతం
-కార్యకర్తల కోరిక మేరకు వాళ్ళతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు దంపతులు
-పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వావిలాల, ముత్తారం (పాలకుర్తి – పాలకుర్తి నియోజకవర్గం), ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఆరాచక శక్తులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అస్థిర పరచాలని చూస్తున్నాయి. అలాంటి శక్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు పన్నుతున్నాయి. బి అర్ ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కి వంత పాడుతున్నది. అలాంటి కుట్రలను ఛేదిస్తున్న సీఎం కెసిఆర్ మాత్రం ప్రజల బాగోగుల గురించే ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రగతి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారు. పార్టీ పరంగా, ప్రజల పరంగా ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండాలి. అలాంటి కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. సిఎం కెసిఆర్ ను, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అందుకు పార్టీ శ్రేణులు సర్వ సన్నద్ధంగా సిద్ధంగా ఉండాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
వావిలాల, మల్లంపల్లి, భిక్యా నాయక్ పెద్ద తండా, హఠ్యా తండా, నారబోయిన గూడెం గ్రామాలకు కలిపి వావిలాల గ్రామంలో, ముత్తారం, వల్మీడి, సిరిసన్న గూడెం, కంబాలకుంట తండా తదితర గ్రామాలకు కలిపి ముత్తారం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఎద్దుల బండి పై ఊరేగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. కాగా, ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావులు కోలాటం, లంబాడా నృత్యాలు చేశారు. చూపరులను ఆకట్టుకున్నారు. అందరికీ ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన ఈ సమ్మేళనాల్లో ఉషా దయాకర్ రావు సిఎం ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. పార్టీని, కెసిఆర్ ని, ఎర్రబెల్లి దయాకర్ రావుని కాపాడుకోవాలని, అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బలమైన బిఆర్ ఎస్ పార్టీని, నాయకత్వాన్ని బలహీన పరచడానికి కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, కూల్చే కుట్రలకు కూడా తెరలేపారు. వాటన్నింటినీ మన నాయకుడు కెసిఆర్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలోనే మనమంతా పార్టీకి, కెసిఆర్ కి అండగా నిలవాలి. అలాంటి ఆచారక శక్తుల ఆట కట్టించాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిఆర్ ఎస్ పార్టీ, పార్టీ నాయకత్వం బలంగా ఉంది. మన నాయకుడు తెలంగాణ తెచ్చిన తెగువ ఉన్నవాడు. చావు నోట్లో తలపెట్టి, తెలంగాణను తేవడమే కాదు, అద్భుత పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సిఎం కెసిఆర్ దయ వల్ల నేను మంత్రిని అయ్యాను. మీ దయ వల్ల ఎమ్మెల్యేను అయ్యాను. నాకు మీరిచ్చిన, సిఎం గారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పాలకుర్తి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు. మనలో మనకు సమస్యలేమైనా ఉంటే పక్కన పెడదాం. అంతా కలిసి కట్టుగా ఉందాం. మన సీఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం. ఇంకా చేయాల్సిందేమైనా ఉంటే చేసుకుందాం. అంతా ఆత్మీయంగా ఉందామని అన్నారు.
బి ఆర ఎస్ లాంటి పార్టీ దేశంలో లేదు. 80లక్షల మంది బలగం బిఆర్ ఎస్ ది. కార్యకర్త ఏ కారణం చేత చనిపోయినా, వారి పేరున బీమా పార్టీయే కట్టి 2 లక్షల రూపాయలు ఇస్తున్న కన్నతల్లిలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అందుకే కన్న తల్లి లాంటి బిఆర్ ఎస్ పార్టీ ని నమ్మకుని ఉన్న మనందరికీ ఎప్పటికీ మంచే జరుగుతుంది. మన సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు పార్టీకి అండగా ఉన్నంత కాలం మనమంతా బాగుంటం. అయితే, మనలో మనకు చిన్న సమస్యలుంటే పక్కన పెడదాం. అన్నా దమ్ములోలె కలిసికట్టుగా ఉందాం అని మంత్రి తెలిపారు. మీ అందరి దయ వల్ల నేను పాలకుర్తి నుండి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అంతకు ముందు వర్దన్నపేట నుండి 3 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి ఎంపీని, ఓటమి లేకుండా గెలుస్తున్న నన్ను సిఎం గారు మంత్రిని చేశారు. మంచి పోర్టు పోలియో ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అందరికీ నీళ్ళిచ్చే మంత్రిని నేనే, గ్రామాలను అభివృద్ధి చేసే మంత్రిని నేనే, ఉపాధి హామీకి మంత్రిని నేనే, మహిళల మంత్రిని నేనే. ఇన్ని ముఖ్యమైన శాఖలతో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సీఎం కెసిఆర్ గారు ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశాను అన్నారు.
ఒక్కో గ్రామ పంచాయతీలకు కోటిన్నర నుంచి రెండున్నర కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అన్ని గ్రామాలకు అంతర్గత రోడ్లు, గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్లు, ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాను. ప్రతి గ్రామంలో చెరువులను బాగు చేసి, సిఎం కెసిఆర్ గారి దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు అన్ని చెరువులను నింపి నీటిని తెచ్చాను. వద్దంటే నీళ్ళు ఇవ్వాల రెండు పంటలు బాగా పండటానికి కారణం సిఎం గారు అని మంత్రి వివరించారు. అలాగే, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చాం. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చాం. ఉపాధి హామీ పథకం ద్వారా కొత్త జాబ్ కార్డులు ఇచ్చి, కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలను ఆదుకున్న ప్రభుత్వం కెసిఆర్ గారిది అని మంత్రి వివరించారు. ఈ విధంగా చేస్తున్న అభివృద్ధి కారణంగా, సిఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల దేశానికే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అందుకే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని, తాజాగా 13 అవార్డులు వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా వచ్చిన ఈ అవార్డులే మన ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
స్థానిక సంస్థల చరిత్రలో ఈసారి వచ్చినన్ని నిధులు ఎప్పుడూ రాలేదు
సీఎం కెసిఆర్ దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందాయి. అతి తక్కువ జనాభా ఉన్న గ్రామానికి కూడా రూ.5లక్షలకు తగ్గకుండా నిధులు అందాయి. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో పనులు జరిగాయి. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, మొక్కలు నాటి 7.7శాతానికి పెంచిన గ్రీనరీ, కల్లాలు, రైతు వేదికలు వచ్చాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ లు అందాయి. దీంతో ఇవ్వాళ పల్లెలు కేంద్రం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా, రాష్ట్రానికే అవార్డులు వస్తున్నాయి. అని మంత్రి దయాకర్ రావు తెలిపారు. మరోవైపు సంక్షేమ పథకాల్లోనూ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. గీత, చేనేత కార్మికులకు, ఎయిడ్స్, బోదకాలు, డయాలిసిస్ పేషంట్లు, ఒంటరి మహిళలకు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఇక గ్రామాల్లో మహిళలు యువత కోసం, వారి అభివృద్ధి కోసం పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మహిళలకు ఉచిత ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరికే విధంగా కుట్టు మిషన్ల శిక్షణ, మిషన్ల పంపిణీని చేపట్టాను. పాలకుర్తి నియోజకవర్గవంలో 10వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం. వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం నా విధిగా పని చేస్తున్నానని మంత్రి తెలిపారు. వరంగల్ లోని టెక్స్‌టైల్ పార్క్ ద్వారా బస్సులు ఏర్పాటు చేసి, నియోజకవర్గ మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామన్నారు. అలాగే, నిరుద్యోగ యువత కోసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా, వారికి ఉచిత శిక్షణ, జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఆత్మీయ సమ్మేళనాలలో గ్రామాలకు అభివృద్ధి వరాలు
ఆత్మీయ సమ్మేళనాలల్లో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి నిధులను మంత్రి మంజూరు చేశారు. మంగళవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో దుర్గమ్మ గుడి కి, మహిళా భవనం కి, గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్గత రోడ్లు, గ్రామాల మధ్య రోడ్లను వేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల్లో 10 వ తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పటించి, కుట్టు మిషన్లు పంపిణీకి హామీ ఇచ్చారు. ఆత్మీయ సభలకు బి అర్ ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ మంకెన కోటి రెడ్డి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ గారి మార్గ నిర్దేశనం లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. రైతాంగాన్ని ఆదుకున్న ఒకే ఒక్కడు సీఎం కెసిఆర్. తెలంగాణ రాక ముందు కంటే అన్ని పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అనూహ్య అభివృద్ధి జరిగింది. సంక్షేమం లోనూ తెలంగాణ నెంబర్ వన్ గా మారింది. తెలంగాణ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. సీఎం కెసిఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశంలో లేడు. సీఎం కెసిఆర్ గారిని మనమంతా కాపాడుకోవాలి. తెలంగాణ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయాలి. విస్తృత ప్రచారం కల్పించాలి. ఇంకా చేయాల్సిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. సీఎం కెసిఆర్ గారి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అదృష్ట వంతులు. ఎర్రబెల్లి దయాకర్ రావు రూపంలో మీకు మంచి ఎమ్మెల్యే దొరికారు. నిరంతరం మీ గురించి మీ ప్రాంత అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. సిఎం గారి దగ్గర కొట్టాడి నిధులు తెస్తారని వివరించారు.
మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు వడ్డిస్తూ, వారితో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, వారితో తమ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు. ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.