Suryaa.co.in

Andhra Pradesh

తెదేపా, జనసేనపార్టీలది ప్రజలు కోరుకున్న పొత్తు

-ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పొత్తు ఓకేనన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
-ప్రజల మధ్య రావడానికి భయపడే వ్యక్తి సింహమా?
-దేనికి సిద్దమో అర్థం కాలేదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ పొత్తును చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకోలేదని ప్రజలే కోరుకున్నారని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంఘటితంగా గౌరవించడం ముదాహమని పేర్కొన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల కోసం కలిసి ఉండాలని ఇరు పార్టీల అగ్ర నేతలు నిర్ణయించారు.

వ్యక్తిగత బలాబలాల ఆధారంగా కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడ్డారు. వారిద్దరూ కలిసిన తరువాత ఎవరు ఎటువంటి లేఖలు రాసిన వాటి ప్రభావం పెద్దగా ఉండదు. నేను లేఖ రాసిన, మరొకరు లేఖ రాసిన అది తమ మనసులోని మాట చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ప్రజలే ఈ కలయికను కోరుకున్నప్పుడు, కచ్చితంగా ఓటు బదిలీ అవుతుందన్న రఘు రామ కృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాతే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయాలని కోరుకున్నా రన్నారు . ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేసిన రెండు పార్టీల మధ్య నూటికి నూరు శాతం ఓటు బదిలీ జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఎంత ఖాయమో, జగన్మోహన్ రెడ్డి అంతే దారుణంగా ఓడిపోవడం కూడా అంతే ఖాయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు .

షర్మిల కాంగ్రెస్ లో చేరిక వల్ల ప్రతిపక్షాలకు వచ్చిన నష్టమేమి లేదు
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల, ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన నష్టమేమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక, పాలకపక్షానికే పెద్ద బొక్కగా ఆయన అభివర్ణించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికల కోడ్ వస్తుందని, మార్చి నెలాఖరులోగా ఎన్నికలు జరుగుతాయని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మార్చి నెలాఖరు లోగా, ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలంటే ఇంకా పెద్దగా సమయం ఏమీ లేదు. మరో 60 నుంచి 70 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఇకపై ప్రజలు బాహాటంగానే ముందుకు వస్తారు. పోలీసులు కూడా పాలకపక్షానికి పెద్దగా సహకరించడం లేదు. దీనితో సర్వే ఫలితాలు మరింత ఆసక్తికరంగా వెలువడే అవకాశాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న సౌభాగ్యమ్మ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్యమ్మ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా?? అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెదేపా, జనసేన మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయాలని సాక్షి దినపత్రిక చేయని ప్రయత్నం అంటూ లేదు. తెదేపాతో పొత్తు లో భాగంగా సీట్ల వ్యవహారంపై సీనియర్ నాయకులు చేగొండి హరి రామ జోగయ్య, పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ సారాంశాన్ని సాక్షి దిన పత్రిక మొదటి పేజీలో ప్రచురించి తన అత్యుత్సాహాన్ని చాటుకుంది.

పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వార్తలను లోపలి పేజీలో వేసే సాక్షి దినపత్రిక యాజమాన్యం, హరి రామ జోగయ్య రాసిన లేఖ సారాంశాన్ని మాత్రం ఫస్ట్ పేజీలో ముద్రించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రజలందరికీ తెలుసు. సాక్షి దినపత్రిక ఎన్ని విభేదాలను సృష్టించాలని భావించిన ప్రజల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఇరువురు సఖ్యత గానే ఉంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రజల మధ్య రావడానికి భయపడే వ్యక్తి సింహమా?
సింహాన్ని చూసి ప్రజలే భయపడతారయితే, ప్రజల మధ్యకు రావడానికి భయపడే వ్యక్తి నిజంగానే సింహమా?, మరొక సింహమా? అని ప్రజలు భావిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనని తాను సింహం గా చెప్పుకునే వ్యక్తి, ప్రజల మధ్యకు రావాలంటే పరదాల చాటు ఎందుకన్నారు. జగన్మోహన్ రెడ్డి నీచ, నికృష్ట స్వభావం మరోసారి తేటతెల్లమయింది. ఇసుక సంచులకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి గా ఫోటోలను పెట్టి, వాటిపై బలంగా పంచ్ లు విసరడానికి గ్లౌజులు కూడా ఇచ్చినట్లు ఉంది.

ఢిల్లీలో బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకునే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో పై పంచ్ లను గుప్పిస్తున్నాడు. ఫోటోలపై సభకు హాజరైన వారు పంచ్ లు గుప్పించేదానికి తింగరి సాక్షి అధిక పబ్లిసిటీ ఇచ్చింది. ప్రజలు ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలపై పంచ్ ఇస్తున్నారని ప్రచారం చేసినప్పటికీ, పంచ్ ఇచ్చేవారు నవ్వుతూ కనిపించడం సాక్షి మీడియా డొల్ల ప్రచారాన్ని తెలియజేసింది.

గతంలో నాపై దిక్కుమాలిన కేసులు పెట్టి, చిత్రహింసలకు గురి చేసినప్పుడు తీసిన వీడియోను చూసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఆనందించి ఉంటారు. అందుకే ఆయనకు చంద్రబాబు నాయుడు, సైకో అని పేరు పెట్టారు. ప్రతి బహిరంగ సభ ముగింపు సందర్భంగా ప్రజల చేత సైకో పోవాలి… సైకిల్ రావాలి అనే నినాదాలను ఇప్పిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

దేనికి సిద్దమో అర్థం కాలేదు
భీమిలి నియోజకవర్గం సంగి వలసలో సిద్ధం పేరిట నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్పింది ఏమీ లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సిద్ధమని చెప్పారు… దేనికి సిద్ధమో అర్థం కాలేదు. మళ్లీ చెత్త మద్యం తీసుకువస్తాం… మీరు సిద్ధమా? అని ప్రశ్నించినట్లు ఉంది. అధిక పన్నులు వేసి దోచుకోవడానికి సిద్ధం, అయినా సిగ్గు లేకుండా మీరు ఓటు వేయడానికి సిద్ధమా అని ప్రజలను అడిగినట్లు అనిపించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజులు ఆలస్యంగా జీతాలను ఇస్తున్నాం. ఇకపై రెండు నెలలైనా జీతాలను ఇవ్వం… అయినా బుద్ధి లేకుండా ఓట్లు వేయడానికి సిద్ధమా అని ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించినట్టు ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవు… అయినా బుద్ధి లేకుండా ఓట్లు వేయడానికి సిద్ధమా అని ప్రశ్నించినట్లు ఉంది తప్ప అసలు సిద్ధమంటే ఏమిటో అర్థం కాలేదన్నారు.

వైకాపా నిర్వహించిన ఎన్నికల సభకు అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సుల చార్జీల ఖాతాను ప్రభుత్వ అకౌంట్లో రాశారా?, పార్టీ అకౌంట్ లో రాశారా? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ లేదు కాబట్టి ప్రభుత్వం నెత్తిని రుద్ది ఉంటారన్నారు. ఎవరిదో ఈ ఖర్చు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో విధ్వంసం చేశారు. విశాఖ వాసులు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతారు. ఇదే విషయాన్ని నిన్న కూడా రచ్చబండ కార్యక్రమంలో చర్చించుకున్నాం. బహిరంగ సభకు మూడు లక్షల మంది జనం హాజరవుతారని అంచనా వేసుకున్నారు. అందులో మూడవ వంతు కూడా హాజరు కాక పోవడం తో ఈ పార్టీ ఎత్తి పోయో పార్టీ అని విశాఖవాసులు డిసైడ్ అయిపోయారన్నారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా అదే ప్రాంతంలో 40 ఎకరాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తే, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను 12 నుంచి 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించగా 60% ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజు రెండు బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. పీలేరులో నిర్వహించిన బహిరంగ సభ ఎంత సక్సెస్ అయ్యిందో, ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభ కూడా అంతే సక్సెస్ అయ్యింది. జనంతో చంద్రబాబు నాయుడు బాగా ఇంటరాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు జనం ముక్తకంఠంతో స్పందించారు. అదే పెయిడ్ ఆర్టిస్టులు అయితే స్పందించరు. వారు పెయిడ్, జూనియర్ ఆర్టిస్టులు కాదని స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలన్నారు.

ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి
ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వకుండా దేవత సినిమాలో మోహన్ బాబు ఆస్తి నాకు… పాస్తి బామ్మది అని డైలాగు చెప్పినట్లుగా, ఈడీ జప్తు చేసిన ఆస్తులు షర్మిలకు , సిమెంట్ ఫ్యాక్టరీలు తనకు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని వదిలేసి, చెల్లి ఏం చేస్తుంది లే అని ఆస్తిలో వాటా ఇవ్వలేదు. తల్లి చెప్పిన వినలేదు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దయ వల్ల మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం జరిగింది. తండ్రి ఆస్తిలో షర్మిల భాగాన్ని అడిగారు. అది తండ్రి ఆస్తి కాదు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి సంపాదించారు.

తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన ఆస్తులను కూడబెట్టారు. న్యాయంగానా, అన్యాయంగానా ఆయన ఎలా ఆస్తులు సంపాదించారన్నది సిబిఐ కేసుల ద్వారా తేలనుంది. షర్మిలకు సగం ఆస్తులు కాకపోయినా, సగంలో సగం అయినా ఇవ్వాలి కదా… చెల్లి ఆస్తిలో వాటా అడిగిందని మెడ పట్టుకొని గోడకు వేసి తలను గుద్దినట్లు చెల్లె స్వయంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి సైకోను తలపిస్తుందని చెల్లి తడుముకోకుండా చెప్పిన తరువాత ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థమవుతుంది.

చెల్లి నిజాలను ఒకటి తర్వాత ఒకటి చెబుతుంటే వైకాపా సోషల్ మీడియా కాలకేయులు తల్లి చెల్లి, తన మన అనే భేదం లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య అయిన విజయమ్మను కూడా విడిచిపెట్టకుండా దుర్భాషలాడడం దారుణం. చివరకు ఎమ్మెల్యేలు కూడా షర్మిలను వైయస్సార్ కూతురే కాదని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. షర్మిల వైఎస్ఆర్ కూతురు కాకపోతే మరి ఎవరని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కదా అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి సింహమో కాదో తెలియదు కానీ షర్మిల శివంగే
జగన్మోహన్ రెడ్డి సింహమో కాదో తెలియదు కానీ షర్మిల మాత్రం శివంగేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ మూర్ఖులు మాట్లాడే మాటలకు ఆమె బెదిరిపోతుందా ? అని ప్రశ్నించారు. షర్మిల టకాటక నిజాలు అని చెబుతుంటే, జగన్మోహన్ రెడ్డి భయపడి అమ్మ ఒడిని ఆశ్రయించారు. ఇన్నాళ్లు తల్లిని దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆమె దీవెనలు కావాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. తల్లిని నాతో ఉంటావా?, ఉండవా?? అని దాదాపుగా బెదిరించినంత పని చేసినట్లు సమాచారం. తల్లి తనతో ఉండకపోతే క్రైస్తవుల ఓట్లు ఎక్కడ చేజారి పోతాయని బెంబేలెత్తిపోతున్నారు.

ఆమె చేత బైబిల్ పట్టించి ప్రచారం చేయించిన, జగన్మోహన్ రెడ్డి పంచె కట్టుకొని బొట్టు పెట్టుకుని తిరిగినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. తల్లి చెల్లిని అవమానించి బయటకు పంపించిన నాడే మహిళా లోకమంతా మిమ్మల్ని వదిలేసుకుంది. ఇప్పుడు ఎన్ని టక్కు టమారా, గజ కరుణ గోకర్ణ విద్యలను ప్రదర్శించిన ప్రయోజనం సున్నా. మనసు చంపుకొని మీ తల్లి మీతో వచ్చినా, భయపెడితేనే వచ్చినట్లుగానే ప్రజలు భావిస్తారు. మీ పట్ల ఆమెకు ఏమీ మమకారం లేదని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. నెల రోజుల క్రితం టిడిపి, జనసేన కూటమి ఓటింగు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండగా, వైకాపా ఓటింగ్ క్షీణించి, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెరిగింది.

ప్రస్తుతం ఐదు నుంచి ఆరు శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో 10 నుంచి 12 శాతానికి పెరిగితే, రానున్న ఎన్నికల్లో వైకాపా సింగల్ డిజిట్ కే పరిమితం కావలసి వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా విజ యమ్మను చేరదీసే ప్రయత్నాలను చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మూడు లక్షల మందిని అంచనా వేస్తే… 30 వేల మంది కూడా హాజరు కాలేదు
భీమిలి నియోజకవర్గం సంగి వలస లో నిర్వహించిన సిద్ధం సభకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి మూడు లక్షల మంది ప్రజలు హాజరవుతారని వైకాపా నాయకత్వం అంచనా వేయగా, 30 వేల మంది కూడా హాజరు కాలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. శనివారం నాడు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ పీలేరులో నిర్వహించిన రా కదిలిరా సభకు 50 నుంచి 70 వేల మందికి పైగా హాజరవుతారని ఆశించగా, లక్ష మందికి పైగా హాజరయ్యారు. వైకాపా నిర్వహించిన సిద్ధం సభకు 1100 బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టి, ప్రభుత్వ పథకాలు అందవని ప్రజలను బెదిరించి, బిర్యానీ ప్యాకెట్లు, మందు సరఫరా చేస్తామని చెప్పినా ఎవరు కూడా వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన బస్సులలో ఎక్కలేదు.

సభా వేదిక వద్ద శిలువ ఆకారంలో ర్యాంపు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి కుర్చీలను వేశారు. అయినా ఎక్కడికక్కడ ఖాళీ కుర్చీలే కనిపించాయి. ర్యాంపు పై జగన్మోహన్ రెడ్డి చిలిపి నవ్వులు, దొంగ నవ్వులు నవ్వుతూ… ఇన్నాళ్లు ప్రజల మధ్యకు రాని వ్యక్తి, ప్రజల మధ్యకు వస్తున్నాడు అంటే… ఏమో ఎలా వస్తున్నాడో చూద్దామని అనుకుంటే, రెండు అంచుల భద్రత వ్యవస్థ మధ్య బారి కేడ్ల నడుమ ఆ మూల నుంచి ఈ మూలకు నడుచుకుంటు వచ్చి, ప్రజల మధ్యకు నడిచి వచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. గుళ్లోకి వెళ్లకుండా, ప్రజాధనంతో గుడిసెట్ వేసినట్లుగా… ప్రజల మధ్యకు వెళ్లకుండా ప్రజల మధ్య నడిచిన విధానాన్ని చూసి, ఈ వ్యక్తిని సింహం అని అంటారా అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు .

నరసాపురం నుంచి వైకాపా అభ్యర్థిగా శ్వేతా వర్మనైన అధికారికంగా ప్రకటిస్తారా?
నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి నాపై ఫొటీ చేయడానికి వైకాపా కు అభ్యర్థులు దొరకడం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. అభ్యర్థుల దొరకక చివరకు మా బావగారిని నాపై పోటీకి దింపాలని చూశారు. ఆయన ససేమిరా అనడంతో, ఇతర రాజు, కాపు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఎవరు కూడా పోటీ చేయడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు.

దీనితో గతంలో సాక్షి మీడియాలో యాంకర్ గా పనిచేసిన, సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితురాలు అయిన శ్వేతా వర్మను బరిలోకి దించాలని చూస్తున్నట్లు తెలిసింది. దుబాయిలో స్థిరపడిన శ్వేతా వర్మను ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనక్కి రావాలని కోరిన వైకాపా నాయకత్వం, చివరకు ఆమెనైనా అధికారికంగా అభ్యర్థిగా ప్రకటిస్తుందా? లేదా? అన్నది చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE