సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వద్ద మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ వర్గాలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొనియాడారు. శుక్రవారం యూసఫ్ గూడ సమీపంలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.
దేశంలోని అనేకమంది వెనుకబడిన వర్గాలు ప్రధానంగా మహిళలకు సామాజిక న్యాయం జరగాలని జ్యోతిరావు పూలే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ దేశంలో ఆ వర్గాలకు దశా దిశా నిర్దేశం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. పూలే జయంతి సందర్భంగా అందరం స్మరించుకుంటూ వారు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ వారి ఆశయాలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలియజేశారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు పూలే జయంతి సందర్భంగా మరోసారి ఆ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, CDS నిర్వాహకులు మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు.