జాతికి పతాకం ఇచ్చిన నీకు.. తీరని శోకం

నీ జెండా జాతికి అజెండా
నీకు మాత్రం అన్నం పెట్టలేదు కడుపునిండా!

ఆకాశం నిండా
మువ్వన్నెల జెండా..
అదే అదే పింగళి అజెండా..
జాతీయ పతాక రూపకర్త
ఈ గొప్ప దేశానికి
ఓ అద్భుత జెండా
ఉండాలంటూ నినదించి
ప్రవచించిన కృతిభర్త..
కాంగ్రెస్ సిసలైన కార్యకర్త..
అసువులు బాసినాడట
ఆకలితో మగ్గిమగ్గి..
ఆనాడే మన
ఆదర్శాలు బుగ్గిబుగ్గి!

రాజకీయం ఉపాధిగా
మారిన నేటి తరం..
పింగళి కి తెలిసిందొకటే
వందేమాతరం..
సర్పంచులే దర్పంచులుగా
విరాజిల్లుతున్న
వర్తమానం..
పింగళి ఆదర్శాలు అయ్యేనా
స్వచ్ఛ రాజకీయాలకు కొలమానం..!

సైనికుడై సమరం..
ప్రేరకుడై సంగ్రామం
అలుపెరుగక చేసిన వెంకయ్య
చివరి దశలో
ఆకలితో కూడా
చేశాడంట యుద్ధం..
దరిద్రం బంధువై..
మొహం చాటేసిన
ప్రతి నాయకుడు రాబందువై
ఘనమైన గతం..
ప్రభుత్వాల అవగతం..
పాలకుల బాగోతం..
అన్నీ దిగమింగి..
తానుగా కృంగి..
ఊపిరి వదిలిన పింగళి..
నిన్ను మర్చిపోవడమేనా
నవయుగ పాలకులు
నీకిచ్చిన నివాళి..
జెండా ఊంచా
రహే హమారా అంటున్న
మన స్వరాజ్య జమానా
ఆ జెండా రూపకర్త
వెంకయ్యకు ఇచ్చింది
దుర్భర దారిద్య్రమే నజరానా!
తాజ్ మహల్ అద్భుతమే
రాళ్ళెత్తిన కూలీల
చెమట తడి తెలిసేనా?

పింగళి సృష్టించిన
జెండా చిరంజీవి..
ఆయన ఇప్పుడు అమరజీవి..
బతికుండగా మాత్రం
దుర్భర జీవి..!
అంతటి మహనీయుడి జయంతి,వర్ధంతి ప్రభుత్వాలకు పట్టని సంగతి
ఈ విషయంలో
ప్రతి పాలకుడూ
ఓ ఆషాఢభూతి!

జాతీయపతాాక రూపకర్త
పింగళి వెంకయ్య జయంతి
(02.08.1876)
సందర్భంగా ప్రణామాలు..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply