Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గౌతమ్‌రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది: జగన్
మంత్రి గౌతమ్ రెడ్డి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

ఓ మంచి స్నేహితుడ్ని, అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు.

చాలా బాధాకరం: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గౌతమ్‌రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు: మంత్రి వెల్లంపల్లి
మృదు స్వభావి, ఎంతో మంచి మనిషి అయిన మేకంపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

మృదు స్వభావి కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కలచివేసిందని.. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమన్నారు. మంత్రివర్గంలో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

సహచరు లేడని కుంగిపోతున్నా: మంత్రి జయరాం
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. సహచర మంత్రి వర్గ సభ్యుడు ఇక లేరు అని తెలిసి కుంగిపోతున్న.. మంత్రి గౌతమ్ రెడ్డి కి నా కన్నీటి నివాళి అంటూ మంత్రి జయరాం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కలిసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నా: మంత్రి శంకర్ నారాయణ
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరంపై వైసీపీ నేతల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోటి మంత్రి, మృదు స్వభావిని కోల్పోవడం చాలా బాధగా ఉందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఆయనతో పని చేయడం చాలా మంచి అనుభూతి అన్న శంకర్ నారాయణ.. కలిసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే వాళ్లమన్నారు.

నిన్నటి వరకు ఆయనతోనే ప్రయాణం చేశా: గోవిందరెడ్డి
నిన్నటి వరకు ఆయనతోనే ప్రయాణం చేశా.. ఈలోపే ఇంత దారుణం జరిగిందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు. దుబాయ్ తో ఆయన కలసి వారం రోజుల పాటు పని చేశానని, ఎంతో గౌరవంగా మాట్లాడే వారన్నారు. అన్న అని సంబోధిస్తూ ఆప్యాయత చూపించే వారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు చివరి వరకు కష్టపడ్డారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవని గోవిందరెడ్డి తెలిపారు.

ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు: ఎంపీ మాధవ్
ఆయన లేకపోవడం పార్టీకే కాకుండా, రాష్ట్రానికి కూడా తీరని లోటని పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య అన్నారు. ఆయన గంభీరంగా కనిపించే మృదు స్వాభావి.. ఎప్పుడు కలిసిన ఆప్యాయంగా మాట్లాడే వారన్నారు. మంచి మిత్రున్ని కోల్పోయాం.. ఆయన రాష్ట్రానికి ఇంకా సేవలందిస్తారని అనుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి
యువనేత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఒక క్రమపద్ధతిలో చేస్తూ గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి ప్రజలకు తీరని లోటు అన్నారు. తనకు ఆయనతో ఎంతో ఆత్మీయత ఉందని, వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

LEAVE A RESPONSE