Suryaa.co.in

Andhra Pradesh

అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ సిలబస్

-రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
-పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా శిక్షణా పాలసీ
-వర్చువల్ క్లాస్ రూమ్స్ పూర్తి స్దాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు
-నూతన పాలిటెక్నిక్ లలో భవన నిర్మాణం. సౌకర్యాల కల్పన వేగవంతం
-ప్రతి విద్యార్ధి ఉపాధి పొందేలా చర్యలు తీసుకున్నాం : నాగరాణి

విజయవాడ: జాతీయ, అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యార్ధుల సిలబస్ ను ప్రతి సంవత్సరం అప్ గ్రేడ్ చేయవలసి ఉందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్దాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో బుధ, గురు వారం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్ధపై సురేష్ కుమార్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఆ శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విభిన్న అంశాలపై లోతుగా చర్చించారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ సిలబస్ విషయంలో ఏర్పాటు చేసే కమిటీ ప్రతి సంవత్సరం కాలానుగుణంగా ప్రభుత్వానికి తగిన సూచనలు చేయగలిగేలా ఉండాలని, జాతియ స్దాయి విషయ సంబంధ నిపుణులకు స్ధానం కల్పించాలన్నారు. మైదుకూరు, బేతంచర్ల, గుంతకల్లులలో నూతనంగా మంజూరు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో వసతుల కల్పన, భవన నిర్మాణానికి అవసరమైన మైన కార్యాచరణపై ప్రభుత్వ ఆమౌదం కోసం క్యాబినెట్ నోట్ ను సిద్దం చేయాలన్నారు.

పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా శిక్షణా విధానం సిద్దం చేయాలని సురేష్ కుమార్ అధికారులకు సూచించారు. పరిశ్రమలు వినియోగిస్తున్న ఆధునిక విధానాలపై తొలుత అధ్యాపకులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే అది విద్యార్ధులకు చేరుతుందన్నారు. ట్రైనింగ్ పాలసీలో ప్రతి సంవత్సరం ఎంత మందికి శిక్షణ ఇవ్వాలి, ఎక్కడ శిక్షణ అందించాలి అనే అంశాలను పొందుపరిచి సమగ్రంగా రూపుదిద్దవలసి ఉందన్నారు.

పాలిటెక్నిక్ లలోని వర్చువల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని, వీటి పర్యవేక్షణ కోసం కమీషనరేట్ స్దాయిలో ఒక అధికారిని నియమించి వారంతపు నివేదికలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతినెల సమీక్షలు నిర్వహిస్తామని, అధికారులు అందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.

కమిషనర్ చదలవాడ నాగరాణి విభిన్న అంశాలను వివరిస్తూ పాలిటెక్నిక్ విద్యార్దులకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు, ఏ ఒక్క విద్యార్ధికి ఉపాధి లేకుండా ఉండకూడదన్న లక్ష్యం మేరకు పనిచేసామన్నారు. సిలబస్ మార్పులకు సంబంధించి విభిన్న చర్యలను తీసుకున్నామని, పోటీకి అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE