Suryaa.co.in

Andhra Pradesh

ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు సిద్ధం

– మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా పార్టీ పటిష్టం
– త్వరలో పెద్దఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
– వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన అనుబంధ విభాగాల ఇన్ చార్జీ, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని అభివృధ్ది – సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ర్టంలో అమలు జరగడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్త జగన్ మోహన్ రెడ్డిగారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేసిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని కల్పించారని తెలియచేశారు.
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు పార్టీ అనుబంధ విభాగాల సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్దాపించిన నాటినుంచి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో.. అన్ని వర్గాలకు సముచితమైన పదవులు కేటాయించామన్నారు. రాష్ర్టంలో బిసిల కోసం ఏర్పాటు చేసిన 56 కార్పోరేషన్లే కాక, ఆయా వర్గాలకు సంబంధించిన వందకు పైగా కార్పోరేషన్లలో ఛైర్మన్లు ,డైరక్టర్లుగా నియమించడం జరిగిందన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకే భయపడేవని, వాటినన్నింటినీ వరుసగా ఒకేసారి నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు.

స్థానిక ఎన్నికల్లోనూ అత్యధికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారని, తద్వారా పార్టీ నేతలకు వేలల్లో పదవులు లభించాయని అన్నారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యూహాలతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నతీరే ఈ ఘన విజయాలకు కారణం అని వివరించారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మరింత ఉత్తేజపరుస్తూ, ఎక్కడైనా, ఎవరిలో అయినా నిర్లిప్త భావం ఉంటే.. దానిని కూడా పోగొట్టి పార్టీని పటిష్టం పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రాబోయే మూడు మూడు దశాబ్దాలపాటు రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా… పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఇందులో కార్యకర్తల పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని అన్నారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బూత్ స్థాయి కమిటీలు కీలక పాత్ర వహించాయని, వాటిని మరింత శక్తివంతం చేయాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుతుందన్నారు.

పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టడం జరుగుతుందని, ప్రజలలో పార్టీకి ఉన్న ఆదరణ పార్టీ సభ్యత్వంలో ప్రతిఫలించాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అలానే ప్రపంచంలోని ఏ దేశంలో తెలుగువారు నివసిస్తున్నా వారి వివరాలు అన్నీ కూడా ఏపి ఎన్ ఆర్ టిఎస్ వద్ద ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి అందేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ఎంఎల్ ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి(వైయస్సార్ సేవాదళ్), ఎంఎల్ ఏ తెల్లం బాలరాజు(ఎస్టీ విభాగం), ఎంఎల్ఏ జక్కంపూడి రాజా(యూత్ విభాగం), విజయ శారదారెడ్డి (డ్వాక్రా విభాగం), ఖాదర్ భాషా (మైనారిటీ విభాగం),డి.సూర్యనారాయణరాజు(పంచాయితీరాజ్ విభాగం), గుర్రంపాటి దేవేంద్రరెడ్డి(సోషల్ మీడియా కో ఆర్డినేటర్), టిఎస్ విజయచందర్(పబ్లిసిటి విభాగం కోఆర్డినేటర్), వంగపండు ఉష (సాంస్కృతిక విభాగం), కుప్పం ప్రసాద్(వాణిజ్య విభాగం), టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE