Suryaa.co.in

National

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ!

గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో ప్రతిపాదిత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో, దాదాపు 8,914 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుండి ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి ప్రధాని మోడీ బుధవారం స్వయంగా ట్వీట్ చేశారు. రేపు నవంబర్ 25 భారతదేశం.. ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ముఖ్యమైన రోజు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాని మధ్యాహ్నం 1 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వాణిజ్యం, కనెక్టివిటీ పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ఇక ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరిస్తుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. ఢిల్లీ, జెవార్ కాకుండా, మూడవ విమానాశ్రయం ఘజియాబాద్ కు చెందిన హిండన్ విమానాశ్రయం. ఇక్కడ నుంచి దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తాయి.
ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు, ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా, నోయిడా పోలీసులు పార్కింగ్‌కు సంబంధించి సూచనలు ఇచ్చారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఈ విషయంపై సమాచారం ఇస్తూ, ట్రాఫిక్ సలహాతో పాటు జేవార్ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన వేదికకు చేరుకునే వాహనాల క్రమబద్ధమైన పార్కింగ్ కోసం ఇచ్చిన మ్యాప్‌ను తమ ట్వీట్ ను జత చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సూచనలను పాటించాలని అభ్యర్థించారు.
ప్రధానమంత్రి కార్యక్రమానికి సంబంధించి గౌతమ్‌బుద్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఒక సలహా జారీ చేస్తూ.. గురువారం జేవార్‌-బులంద్‌షహర్‌ రోడ్డులో జరిగే బహిరంగ సభ దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో నిలిపేందుకు వివిధ చోట్ల పార్కింగ్‌ చేశారు.
నాలుగు దశల్లో నిర్మాణం..
ప్రారంభంలో, జెవార్ విమానాశ్రయంలో రెండు ఎయిర్‌స్ట్రిప్‌లు పనిచేస్తాయి. ఈ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టును జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు. మొత్తం నాలుగు దశలు పూర్తయిన తర్వాత, ఈ సామర్థ్యం 70 మిలియన్ల ప్రయాణికులకు పెరుగుతుంది. ఈ విమానాశ్రయాన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) అభివృద్ధి చేస్తుంది. ఇందులో జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ 100% వాటాను కలిగి ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో జెవార్ విమానాశ్రయం రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. ఇది సిద్ధమైతే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రస్తుతం ఉన్న ప్రయాణీకుల భారం తగ్గనుంది.
ఇది కాకుండా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, అలీగఢ్, ఆగ్రా, ఫరీదాబాద్, ఇతర పరిసర జిల్లాల నివాసితులు కూడా జేవార్ విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు ప్రయోజనం పొందుతారు. జెవార్ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి ప్రవేశ ద్వారంగా మారుతుందని, ఉత్తరప్రదేశ్ రూపురేఖలను మారుస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
జేవార్ విమానాశ్రయం నిర్మాణం ఇలా..
జేవార్ విమానాశ్రయం 5845 హెక్టార్ల భూమిలో నిర్మిస్తారు. అయితే మొదటి దశలో 1334 హెక్టార్ల స్థలంలో దీన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో ఇక్కడ రెండు ప్యాసింజర్ టెర్మినళ్లు, రెండు రన్‌వేలు నిర్మించనున్నారు. తర్వాత ఇక్కడ మొత్తం ఐదు రన్‌వేలను నిర్మించనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరిగేకొద్దీ, మరిన్ని రన్‌వేలను నిర్మించవచ్చు. విమానాశ్రయం ప్రస్తుతం ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 2050 నాటికి 200 మిలియన్లకు పెరుగుతుందని అంచనా.
జేవార్ ఎయిర్‌పోర్ట్‌లో మొదటి సంవత్సరంలో 40 లక్షల మంది రాకపోకలు..
అంచనాల ప్రకారం ఈ విమానాశ్రయానికి మొదటి సంవత్సరంలో దాదాపు 40 లక్షల మంది ప్రయాణీకులు ఉంటారు. 2025-26లో ప్రయాణికుల సంఖ్య 70 లక్షల వరకు ఉండవచ్చు. మొదటి ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుందని అంచనా.2044 నాటికి ప్రయాణికుల సంఖ్య దాదాపు 80మిలియన్లుగా ఉంటుందని అంచనా.
మొదటి సంవత్సరంలో జెవార్ విమానాశ్రయం నుండి 9 విమానాలు(8 దేశీయ..1 అంతర్జాతీయ) విమానాలు ప్రారంభిస్తారు. అయితే సామర్థ్యం పూర్తయిన తర్వాత 27-27 దేశీయ-అంతర్జాతీయ విమానాలు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఎగురతాయి. ఈ విమానాశ్రయం కనీసం 2030 నాటికి ఢిల్లీలా అంతర్జాతీయ రూపాన్ని సంతరించుకోగలదు.

LEAVE A RESPONSE