– న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి: రాష్ట్రంలో ని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ప్రణాళికాబద్ధమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతి లోని సచివాలయంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ లో మంత్రి ఫరూక్ ను వక్ఫ్ బోర్డు సభ్యులు డాక్టర్ ఆఫీయా, షేక్ ఖాజా తో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
వక్ఫ్ బోర్డు కు సంబంధించిన పలు అంశాలు, వక్ఫ్ బోర్డు ద్వారా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి బోర్డు సభ్యులతో మంత్రి చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూములను పరిరక్షించుకోవడం పై ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ సిద్ధం చేసి మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో చర్యలు చేపట్టడం జరుగుతున్నదని మంత్రి అన్నారు.అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ప్రభుత్వం బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.