– ‘నాఫెడ్’ కు లేఖ రాసిన సీఎం మిర్చి రైతులను వంచించారు
– గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరగలేదు
– చిత్తశుద్ధి ఉంటే ఎంఐఎస్ ద్వారా ఆదుకోవాలని కోరేవారు
– అసలు మిర్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం సీఎంకు లేదు
– ఉద్యాన శాఖ అధికారులిచ్చిన రిపోర్టును పట్టించుకోలేదు
– నెల్లూరులోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు, మరోసారి రైతులను దారుణంగా వంచించారని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
మిర్చి రైతులపై సీఎం చంద్రబాబుకు నిజంఆ చిత్తశుద్ధి ఉంటే, మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం (ఎంఐఎస్)లో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదు కాబట్టే, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన, జగన్ పర్యటనలను అడ్డుకునే ఉద్దేశంతోనే, గుంటూరు మిర్చి యార్డు సందర్శనలో ఏ మాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. జగన్ పర్యటనతోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం మొదలైందని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.
టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులకు నా ఓపెన్ ఛాలెంజ్. మీరు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యల గురించి అడిగి రాగలరా?గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయడం జరగలేదు. మరి అలాంటప్పుడు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, నాఫెడ్‌కు చంద్రబాబు లేఖలు రాయడం మిర్చి రైతులను మోసం చేయడం కాదా?.
మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులిచ్చిన నివేదికలో, క్వింటాలుకు రూ.11,600 చొప్పున మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద ఇస్తూ కనీసం 25 శాతం పంటను కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించడానికి ఇష్టపడని సీఎం చంద్రబాబు, ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద కాకుండా మార్కెట్ ప్రైస్ సపోర్ట్ కింద నాఫెడ్ తరఫున కొనుగోలు చేయాలని లేఖ రాయడం చేతులు దులిపేసుకోవమే. చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రకారం చూసినా గత మా ప్రభుత్వంలో రైతుకు రూ.20 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించింది. ఒకవేళ గతం కంటే ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేసి ఉంటే, దావోస్‌లో మాట్లాడి నేనే చేయించానని చంద్రబాబు ప్రచారం చేసుకునే వాడు.ఈ–క్రాప్ గాలికొదిలేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఎత్తివేశారు.
గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం మిర్చి పంటకే కాదు.. పసుపు, పత్తి, అరటి, ఉల్లి, పెసర, మినుము పంటలకు మద్దతు ధర కల్పించాం. కానీ నేడు చంద్రబాబు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కూడా లేకుండా చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.