– అప్పులు చేసి చికిత్స పొందుతున్నారు
-డిప్యూటీ సియంతో టీయూడబ్ల్యూజే
– సానుకూలంగా స్పందించిన భట్టి
హైదరాబాద్: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకాక పోవడంతో, అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక ఇప్పటికే పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం వాపోయింది.
గురువారం అసెంబ్లీ లాబిలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం కలిసి జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళింది.
గత ప్రభుత్వం 2015లో ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు అందించిన హెల్త్ కార్డులు కొంతకాలం ఎంతో ప్రయోజనం చేకూర్చాయని, గడిచిన ఐదేళ్లుగా ఆసుపత్రుల్లో అవి చెల్లకపోవడంతో, అనారోగ్యలకు గురవుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పడరాని తిప్పలు పడుతున్నట్లు విరాహత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపర్చడంతో జర్నలిస్టులు ఎంతో సంతోషపడ్డారాని ఆయన గుర్తుచేశారు. అయితే ఇంకా అది అమలుకాక పోవడంతో జర్నలిస్టులు నిరాశ చెందుతున్నట్లు ఆయన తెలిపారు.
వెంటనే ఆరోగ్య పథకాన్ని అమలు పరిచి, జర్నలిస్టుల అకాల మరణాలను ఆపేందుకు చర్యలు చేపట్టాలని విరాహత్ అలీ కోరారు. అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులు తమ విధులను సజావుగా నిర్వహించేందుకు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు అనేక జీవోలు తెచ్చి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయని, రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు నిర్వీర్యమై పోయినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వేజ్ బోర్డు సిఫార్సుల అమలును పర్యవేక్షించే త్రైపాక్షిక కమిటీ, వర్కింగ్ జర్నలిస్ట్స్ వేల్ఫేర్ ఫండ్ కమిటీ, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీతో పాటు ఇతర కమిటీలను పునరుద్దరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందించారు. టీయూడబ్ల్యూజే వినతిపై డిప్యూటీ సియం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. యూనియన్ ప్రతినిధి బృందంతో త్వరలో సమావేశమై సమస్యలపై కులంకుశంగా చర్చిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. డిప్యూటీ సియంను కలిసిన ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు, జర్నలిస్ట్స్ హెల్త్ కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రజనీకాంత్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.