ఉద్యమమే మనిషైతే

నిబద్ధత నిజరూపం దాలిస్తే..
ఆదర్శం వెల్లువై ఎదుటనిలిస్తే..
పోరాటమే మానవాకృతితో
రణభూమిలో దిగితే
అది పుచ్చలపల్లి..!
గాఢాంధకారంలో దారి చూపే
నిండు జాబిల్లి..!!

ఎదుట ఉన్నది తెల్లోడే కానీ..
నిజామే అవనీ…
స్వయానా భారత సర్కారే
తప్పు చెయ్యనీ
దాడికి తెగబడితే..
తుపాకీకి ఎదురెళ్లి తిరగబడితే
అది పుచ్చలపల్లి…!
స్వేచ్ఛాభావాలు విరజిమ్మే
ఎర్ర జాజిమల్లి!!

ఉద్యమాలకు..పోరాటాలకు
ప్రతిబంధకం అవుతారని
పిల్లలే వద్దనుకునే
త్యాగం తనదైతే..
వారసత్వంగా వచ్చిన ఆస్తులే తృణప్రాయమని తలచి ధారపోసిన
గుణమే తన సొంతమైతే
అది పుచ్చలపల్లి..!
ఎన్నో ఇళ్లలో
దీపం వెలిగించిన..
దీపమై నిలిచిన
పేదింటి కల్పవల్లి..!!

సమసమాజమే ధ్యేయమై..
కులమే లేని నామధేయమై..
అమ్మానాన్న పెట్టిన పేరులో
చివర రెడ్డి మాయమై..
కమ్యూనిస్టు ఉద్యమానికి
తానే తొలి గేయమై..
దుష్టపాలకుల హృదిలో మానని గాయమై…
వెలుగొందిన వీరుడైతే
అది పుచ్చలపల్లి…!
అలాంటి బిడ్డను గని
మురిసిపోలేదా
భూమి తల్లి..!

వందలాది ఎకరాల_ భూమిని
దానం చేసిన
త్యాగధనుడు..
కమ్యూనిస్టు పోరాటయోధుడు..
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ ఆద్యుడు..
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు
లాల్ సలాం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply