ఎన్టీఆర్ కుమార్తెగా ఉండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చొరబడటం ఆమెకు అలవాటు
బాబుకు చర్మ వ్యాధి కొత్తగా ఇప్పుడే వచ్చిందా?
ఏసీ కావాలంటే కోర్టులో పిటిషన్ వేయకుండా 35 రోజుల నుంచి ఏం చేస్తున్నారు?
నేను పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత కోర్టులో పిటిషన్ వేశారు
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులే అసత్య ప్రచారం
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబుకి ప్రాణాపాయం ఉందని.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే నోటికొచ్చిన అబద్దాలు చెప్పారు. దురుద్దేశంతో క్రూరంగా చంద్రబాబు ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే.
దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని విషపూరిత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు. టీడీపీలో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఇంకా తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని యనమల అంటారు. చంద్రబాబు జైలులోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఇప్పుడు 67 కేజీలు బరువు ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు బరువు తగ్గితే 61 కేజీలు ఉండాలి గానీ .. ఇప్పుడు 67 కేజీలు ఎలా ఉన్నారు..?
సుమారు 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, మొదట తన ఇంట్లోనే శిక్ష అనుభవించేలా హౌస్ కస్టడీ కి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దాన్ని కూడా కోర్టు తిరస్కరించి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. హై ప్రొఫైల్డ్ పర్సనాలిటీ కాబట్టి బయట నుంచి మందులు, ఆహారం కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. దానికి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబుకు అనుకూలంగా ఏ న్యాయస్థానంలోనూ రిలీఫ్ రాలేదు. స్కామ్ ల డబ్బు కూడా వచ్చి టీడీపీ ఖాతాల్లో పడ్డాయి అని ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. తన పలుకుబడితో సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. చంద్రబాబు సలహా మేరకు పీఏ శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. అందుకే, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటానికి ఈరోజు వరకు కోర్టుల నుంచి సుముఖత వ్యక్తం కాలేదు.
ఏసీ కోసం కోర్టులో పిటీషన్ వేసుకుంటే సరిపోతుందిగా..ఇన్ని డ్రామాలెందుకు..?
చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో పోలీసులకు ఏ మాత్రం సంబంధం లేదు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావాలి. చంద్రబాబుకు చల్లటి వాతావరణం కావాలని అంటున్నారు. దీనికి లోకేశ్ జైలు సూపరిటెండెంట్‌ను అడిగితే.. ఆయన ఏసీ పెడితే జైలు అధికారుల ఉద్యోగం పోతుంది. కోర్టు ఆదేశిస్తేనే ఏసీ పెట్టాలి.
చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు. చంద్రబాబుకు ఏమైనా జైలుకు వచ్చిన తర్వాత చర్మవ్యాధి వచ్చిందా.. అంతకు ముందే ఉందా?.. ఈ ప్రశ్నలు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ వారిని నేను అడుగుతున్నా. చంద్రబాబుకు చాలా ఏళ్ల నుంచి చర్మ సమస్యలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఆ వ్యాధికి ఆయన మందులు వాడుతున్నారు.
చల్లటి వాతావారణం కావాలని మొదట్లోనే కోర్టును ఎందుకు అడగలేదు. రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. దీనికి చంద్రబాబు కుటుంబం సమాధానం చెప్పాలి. దీనిపై నేను ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానంలో పిటిషన్ వేసిన తర్వాత ఏసీ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు.
కార్పోరేట్ ఆసుపత్రి తరలించాలనే ప్లాన్.. దానికోసమే ఈ గందరగోళం
ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారు. దీనికి టీడీపీ ఇంత గందరగోళం ఎందుకు చేసింది. చంద్రబాబును ఏదో ఒక రకంగా హైదరాబాద్ కార్పోరేట్ హాస్పటల్‌కు తరలించాలనే తాపత్రం తప్ప ఇంకేమీ లేదు.
స్టెరాయిడ్స్ వాడుతున్నారని, బరువు తగ్గారని మాట్లాడిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఎందుకు స్పందించటం లేదు. చంద్రబాబు 66 కేజీల నుంచి 67 కేజీలకు పెరిగారు. బరువు పెరిగితే.. తగ్గారని ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు..? నిజాలు చెప్పకుండా బురదజల్లడం కట్టిపెట్టాలి.
తప్పు చేశాడు కాబట్టే జైళ్లో ఉన్నాడు
స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉండటంతో అరెస్టు చేశారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపింది.
జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక ఆహారం, మందులు తీసుకునే అవకాశం ఇచ్చారు.. 17a ప్రకారం చంద్రబాబుపై కేసు కొట్టేయాలని చేసిన డిమాండ్ ను కోర్టులు తిరస్కరించాయి.. తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాలను తారు మారు చేస్తాడనే ఉద్దేశంతో కోర్టులు ఇప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారు.
అదిగో తోడేలు.. అన్నట్లు టీడీపీ నాయకుల తీరుంది
ఈ సందర్భంగా తోడేలు కథ చెప్పిన అంబటి రాంబాబు. తోడేలు వస్తోందని ఒక వ్యక్తి అరిచాడట. అలా.. పదేపదే అరుస్తుంటే.. అతను అలాగే అరుస్తాడని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాగే ఏమీ జరగకపోయినా చంద్రబాబుకు ప్రాణాపాయం ఉందని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు కోసం పెద్దపెద్ద లాయర్లు
చంద్రబాబుకు ఇప్పటికీ బెయిల్ రాలేదు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ, ప్రదీప్ దూబే వంటి పెద్దపెద్ద లాయర్లను చంద్రబాబు తరుపున వాదనల కోసం పెట్టుకున్నారు. భారతదేశంలో ఎవరైతే అద్భుతంగా వాదించగలుగుతారో అలాంటి అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పెట్టారు. ఒక్క ఏసీ పిటిషన్ తప్ప వారికి సానుకూలంగా ఏమీ రాలేదు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుందని స్పష్టమవుతోంది.
చంద్రబాబే కాదు.. తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే
కేవలం చంద్రబాబునే కాదు.. మధు కోడా, శిబు సోరేన్, జయలలిత, యడ్యూరప్ప, ఓం ప్రకాశ్ చౌతాలా, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది. చంద్రబాబు విషయంలోనూ అంతే. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే చట్టం అరెస్ట్ చేసింది. ఎవరి మీదా కక్ష సాధించాలి అన్న ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్న టీడీపీ నాయకులు అది గుర్తు పెట్టుకోవాలి.
ఏ న్యాయస్థానంలోనూ టీడీపీకి రిలీఫ్ ఇవ్వలేదు
రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంది. ప్రత్యర్థిని అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడితే ప్రజాస్వామ్యంలో ప్రజలు సహించరు. వాస్తవాలు ఉంటేనే సహిస్తారు. ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా న్యాయస్థానాలు చంద్రబాబుకు రిలీఫ్ ఇవ్వట్లేదు.
అవినీతి చేసి చంద్రబాబు అరెస్టు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తున్నారు.ఈరోజు రాత్రికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతామంటున్నారు. బాబు అవినీతి చేస్తే.. మిగతావాళ్ళు ఎందుకు సంకెళ్లు వేసుకుంటారు?. బాబుకు సంకెళ్లు పడ్డాయని అందరూ వేసుకుంటారా?
పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలు…?
పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలో చెప్పాలి.. ఎన్టీఆర్ కుమార్తెగా ఉండి, అధికారం ఉన్న పార్టీలలో చొరబడడం, చంద్రబాబును కాపాడటం ఆమెకు అలవాటు అయిపోయింది. ఇది బీజేపీకి కూడా మంచిది కాదు. కేంద్ర హోంమంత్రి దగ్గరకు లోకేశ్‌ను తీసుకెళ్లారు. నిజాలు తెలుసుకునే కేంద్రం కూడా మౌనంగా ఉండిపోయింది. ఇదే కేసులో ఈడీ నలుగురిని అరెస్టు చేసింది. ఈ విషయం పురంధేశ్వరి తెలుసుకోవాలి.
ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం
చంద్రబాబును నిన్న ములాఖత్‌లో టీడీపీ నాయకులు నారా లోకేశ్, జ్ఞానేశ్వర్, భువనేశ్వరి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎందుకు అంటే.. మీడియాకు అబద్ధాలు అయినా నిజాలైనా చెప్పాల్సి వస్తుందని వెళ్లిపోయారు. చంద్రబాబుకు చాలా కాలం నుంచే చర్మ సంబంధ వ్యాధి ఉంది. ఏసీ పెడితే అది కూడా సర్దుకుంటుంది. కోర్టుల్లో ప్లీడర్ల మీద టీడీపీ వారు దౌర్జన్యం చేస్తున్నారు. న్యాయవాదులు వాదించాలి కానీ.. ఫ్రస్టేషన్‌తో న్యాయవాదులపై దాడులు చేయటం ఏమిటి?
-ఇకనైనా క్షుద్ర రాజకీయాలు మానండి అని అంబటి రాంబాబు హితవు చెప్పారు.