దళితులపై సాగిస్తున్న దమనకాండను మీరు మౌనంగా చూస్తు ఉండటం దుర్మార్గం
పాము తన పిల్లలను తనే మింగినట్లుగా మీరు వ్యవహరించొద్దని కోరుతున్నా
వైసీపీ దళిత శాసనసభ, శాసన మండలి సభ్యులకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బహిరంగ లేఖ
బహిరంగ లేఖ
తేది : 15.10.2023.
గౌరనవనీయులైన
వైసీపీ దళిత శాసనసభ, శాసన మండలి సభ్యులకు
నమస్కారం….
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ రెడ్డి దళితులను అడుగడుగునా ఆర్దికంగా, రాజకీయంగా సామాజికంగా అణిచివేస్తున్నారు. రాజ్యంగబద్దంగా రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించి దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు. దళిత వ్యతిరేక విధానాలను, దళితులపై సాగిస్తున్న దమనకాండను మీరు మౌనంగా చూస్తు ఉండటం దుర్మార్గం.
దళిత వ్యతిరేక ప్రభుత్వ విధానాలను వైసీపీ నేతల దమనకాండను ప్రశ్నిస్తున్న దళిత నాయకుల పై దాడి చేసి అక్రమ కేసులు పెడుతున్నా మీరు నోరు విప్పకుండా మౌనంగా ఉంటూ ద్రోహులుగా నిలిచిపోతున్నారు. పాము తన పిల్లలను తనే మింగినట్లుగా మీరు వ్యవహరించొద్దని కోరుతున్నాను.
దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనంతబాబును మళ్లీ ఎందుకు పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. బెయిల్ పై వచ్చిన అనంతబాబు తమను బెదిరిస్తున్నాడని హత్యకు గురైన సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు వాపోతున్నా వారికి కనీస రక్షణ కల్పించకపోవటంతో వారు వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. కానీ అనంతబాబు మాత్రం బహిరంగంగా ఊరేగుతున్నాడు. వైసీపీ సభలు, సమావేశాల్లో అనంతబాబుకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడాన్ని యావత్ దళితజాతి జీర్ణించుకోలేకపోతోంది. దళిత యువకుడిని బహిరంగంగా హత్య చేసిన అనంతబాబును ముఖ్యమంత్రి ఎందుకు భుజాలపై మోస్తున్నారు. దీని ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు? ఇది యావత్ దళిత జాతిని అవమానించడమే?
దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన్నే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విదేశీ విద్య, ఎన్టీయార్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవలబుల్ స్కూల్స్ వంటివాటిని రద్దు చేసి దళితులు విద్యా పరంగా ఎదగకుండా అడ్డుకున్నారు. మరో వైపు సంక్షేమ పథకాలను నిలిపేసి వారిని ద్రోహం చేశారు. సెంటు పట్టా భూమితో దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారు. వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు.
కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేశారు. 15 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి చనిపోయినవారిలో 12 మంది దళితులే. ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యుల నియామకంలో దళితులకు అన్యాయం చేశారు. సలహాదారులుగా దళితులు పనికిరారంటూ అసెంబ్లీ సాక్షిగా దళిత జాతిని జగన్ అవమానించారు.
మరోవైపు దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు నిత్యకృత్యమయ్యాయి. కరోనాలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని మానసికంగా వేధించి చంపారు. కడపలో డాక్టర్ అచ్చెన్నను కులం పేరుతో వేధించి హతమార్చారు. చీరాలలో మాస్క్ పెట్టుకోనందుకు కిరణ్ ను పోలీసులు కొట్టి చంపారు. రాజమండ్రిలో వైసీపీ నేతల ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కు శిరో ముండనం చేశారు. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలోనే దళిత మహిళ నాగమ్మ పై అత్యాచారం చేసి హత్య చేసినా చర్యలు లేవు.
తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలో అసలు నిందితుడు వెంకట్ రెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదు.
వైసీపీ నాలుగేళ్ల పాలనలో దళితులకు ప్రతిరోజు అన్యాయాలు, అవమానాలు, వేధింపులు ఎదురౌతున్నా వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడంలేదు. ఈ అన్యాయాలు మీ కళ్లకు కనిపించడంలేదా? మీ జాతి ప్రయోజనాల కంటే మీ పదవులే ముఖ్యమా? ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఎన్నాళ్ళిలా జగన్ కు భజన చేస్తూ మీ పదవులకై ప్రాకులాడుతారు? మీకు మీ జాతి ప్రయోజనాలు కావాలన్నా, ఆత్మ గౌరవంతో బతకాలన్నా వెంటనే వైసీపీకి రాజీనామా చేయాలి.
Sd/-
(నక్కా ఆనందబాబు)
మాజీ మంత్రివర్యులు