6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

-సీఎం కేసీఆర్ ఆధేశాలతో చురుగ్గా కొనసాగుతున్న ప్రక్రియ
-గతేడాది ఇదే సమయం కన్నా 8 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా సేకరణ
-ధాన్యం కొనుగోళ్ల వివరాలు వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధేశాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
గతేడాది ఇదే సమయం కన్నా దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, కోతలు జరుగుతున్న ప్రాంతాల వారీగా 6129 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే కాకుండా 35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి మూసేసామన్నారు.

రాష్ట్రంలోని 4 లక్షల 16వేల మందికి పైగా రైతుల వద్దనుండి దాదాపు 26 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని ఈ ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు చేరవేస్తున్నామన్నారు.
మిల్లర్లు గుర్తించిన విలువ 2390 కోట్లకు గానూ 2154 కోట్లను రైతుల ఖాతాల్లో వేసామన్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు, గన్నీలు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు తదితరాలు అన్ని సమకూర్చామని, ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు.