– కృష్ణా జలాలపై 500 టీ.ఎం.సీ. లకు తగ్గేదేలే
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి
హైదరాబాద్: సారవంతమైన నేల, సాగుకు అవసరమయ్యే నీరు, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించినట్లయితే వారు బంగారు పంటలు పండిస్తారని, అందుకోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సహకారంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో కృషి జరుగుతుందన్నారు.
తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేంద్ర సంఘం ఆద్వర్యంలో శుక్రవారం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో 2025 అగ్రికల్చర్ డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వెబ్సైట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఆధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం రూ.54వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలను తిరిగి పునః ప్రారంభించడానికి ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నారన్నారు.
డ్రిప్ ఇరిగేషన్, పనిముట్లపై సబ్సిడీలు, పంటల భీమా పథకం లాంటి అనేక పథకాలను తిరిగి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలలో వరి సాగు చేసి దేశంలోనే ఎక్కువ వరి ఉత్పత్తులను పండించిన రాష్ట్రంగా తెలం గాణ ప్రసిద్ధికెక్కిందన్నారు. 50 లక్షల ఎకరాల పత్తి సాగు చేయడం కూడా తెలంగాణ కే దక్కిం దన్నారు. వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, వ్యవసాయ అధికారులకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరుగతుందన్నారు.
జిల్లాల వారీగా గతంలో ఆత్మ ప్రాజెక్టులలో ఉండే పోస్టులను తిరిగి నియమించేటట్లు ముఖ్యమం త్రి. వ్యవసాయశాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళతానన్నారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు జరగడం లేదని అంటున్నారని, అలా కాకుండ రైతుకు అవసరమయ్యే భూసార పరీక్షలు, సాగుకు అవసరమయ్యే నీరు. నాణ్యమైన విత్తనాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంగా ఉందన్నారు. భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీకి పశువుల పెంటను వాడుకునే విదంగా రైతులను చైతన్యం చేస్తామన్నారు. తెలంగాణ కు రావాల్సిన క్రిష్ణా జలాల సాధన కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారన్నారు.
ప్రస్తుతం 299 టీఎంసీ ల క్రిష్ణా జలాలను మాత్రమే తెలంగాణకు ఇస్తున్నారని, 500 టీఎంసీ ల సాగు నీరు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీటన్నింటిలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేసిన సూచనలు, సలహాలను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బి. కృపాకర్ రెడ్డి , అద్యక్షులు డాక్టర్ డి.వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్ రెడ్డి , కోశాధికారి ఎన్.రవీందర్, సత్యనారాయణ, రం గారెడ్డి, కాంతారావు, కె.అనురాధ, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేందర్ రెడ్డి, మాజీ డీన్ విష్ణువర్థన్ రెడ్డి, తెలంగాణ అగ్రికల్చరల్ సైంటీస్ట్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బొక్క విద్యాసాగర్ పాల్గొన్నారు.