Suryaa.co.in

Andhra Pradesh

పాత సీసాలో పాత సారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో

-తల్లి, చెల్లి, ఏ గల్లీ లేని సిల్లీ జగన్మోహన్ రెడ్డి
-బ్యాండేడ్ బాయ్ ఐదేళ్ల తర్వాత పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదం
-కూటమికి ఓటు వేస్తేనే మహిళల మాంగల్యాలు పదిలం
-నరసాపురం ఎంపీ , ఉండి టిడిపి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పాత సీసాలో పాత సారా లాగా ఉందని నర్సాపురం ఎంపీ, ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే మహిళల ఆదరణ చూరగొన్నాయని తెలిపారు . మహిళలకిచ్చిన గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు వారి జీవనాన్ని మరింత మెరుగుపరచనున్నాయని అన్నారు .

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నాసిరకమైన, చెత్త మద్యాన్ని కట్టడి చేయడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి ఖర్చు చేసే నిధుల బర్డెన్ కూడా తగ్గుతుందన్నారు. మహిళల మాంగల్యాలు నిలబడుతాయని, మహిళల ప్యాకెట్ మనీని వారి భర్తలు లాక్కుని అవకాశం ఉండదన్నారు.

జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఉత్పత్తి చేస్తున్న మద్యంలో మాదకద్రవ్యాలను కలుపుతున్నారేమో, ఆ మద్యం సేవించిన వారు, తీవ్రంగా మద్యానికి బానిసలైపోతున్నారన్నారు.. గతంలో మాదిరిగానే నాలుగు కాలాలపాటు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన నాణ్యమైన మద్యం, తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు..

అంతా మంచే జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి
రాష్ట్రానికిఅంతా మంచే జరగాలంటే అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు . అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, ఉరేసుకోవాలంటే ఫ్యానుకు ఉరేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 30 నుంచి 35 శాతం మంది ఫ్యానుకు ఉరేసుకోవాలనుకుంటున్నారని, 55 శాతం మంది సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధపడ్డారన్నారు. కూటమిలో ప్రధాన పార్టీగా టిడిపి మెజారిటీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజుకింత పడిపోతుందని, ఆయన గ్రాఫ్ తుస్సు మంటోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి తన నుదుటికి ఉన్న ప్లాస్టర్ తీసి ఆయన అభిమానులకు ఊరటను కలిగించారని ఎద్దేవా చేశారు. ఇక కొద్ది గంటల తర్వాత మీడియా ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజాలనే మాట్లాడుతారని, చేయగలిగింది చెబుతారంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని మరోసారి స్పష్టమైంది. సంక్షేమం చేయగలిగే సత్తా ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం ఉన్న నాయకుడు మా పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నన్నది ప్రజలకు మరోసారి అర్థమయిందని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు .

దశల వారీగా వృద్ధాప్య పింఛన్లు పెంపు అంటూ 2028 లో పెంచుతారట…
దశలవారీగా వృద్ధాప్య పింఛన్లను పెంచుతామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి, వెంటనే వృద్ధాప్య పింఛన్లను పెంచకుండా 2028 లో పెంచుతారట అని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. ఎందుకంటే 2029లో మళ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి 2028లో, 2029 లో దశలవారీగా వృద్ధాప్య పింఛన్లను పెంచుతామని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన వృద్ధాప్య పింఛన్లను జూలై మాసం లో మూడు నెలలది కలిపి ఒకేసారి ఇవ్వనున్నట్లు కూటమి నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారని గుర్తు చేశారు. మనసున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 3000 అయితే, చంద్రబాబు నాయుడు ఇచ్చేది 7వేల రూపాయలను గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంది… మానవత్వం ఉంది, కల్మషం లేదనే తీపి మాటలను చెబుతూ, మోసపు ప్రకటనలు చేశారని ధ్వజమెత్తారు. చిన్నపిల్లలు అంటే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో ఉంటారని పేర్కొంటూ, అమ్మ ఒడిని గతంలో 15000 ఇచ్చామని, మరో రెండు వేలు పెంచి 17వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారన్నారు. గత ఐదేళ్లలో అమ్మ ఒడి పథకాన్ని, ఒక ఏడాది లబ్ధిదారులకు ఎగవేశారని గుర్తు చేశారు. అందులో నుంచి 2000 రూపాయలు కోత విధించి, కేవలం 13 వేల రూపాయలను మాత్రమే తల్లుల అకౌంట్లో జమ చేశారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలలో సగం మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలలను సగం మంది విద్యార్థులు చదువుతున్నారన్న రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను తనిఖీ చేసే అధికారాన్ని విద్యార్థుల తల్లులకు కట్టబెట్టారన్నారు. ప్రైవేటు పాఠశాలలలో మాత్రం ఈ అధికారాన్ని తల్లులకు కట్టబెట్టలేదని పేర్కొన్నారు. అమ్మబడి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 17వేల రూపాయలకు పెంచుతున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇచ్చేది మాత్రం 15 వేలేనని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనుందన్నారు . ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మ ఒడి పథకం కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది కేవలం 15 వేల రూపాయలు అయితే, చంద్రబాబు నాయుడు ఒక ఇంట్లో చదువుకొని ఇద్దరు పిల్లలు ఉంటే 30 వేల రూపాయలు, అదే నలుగురు ఉంటే 60 వేల రూపాయలు ఇవ్వనున్నారని తెలిపారు. మనసున్న జగన్మోహన్ రెడ్డి కంటే నారా చంద్రబాబు నాయుడు రెండింతల మొత్తాన్ని ఎక్కువగా తల్లికి వందనం పేరిట చదువుకునే విద్యార్థులకు అందజేయనున్నారన్నారు.

నాలుగేళ్లపాటు అంబేద్కర్ విదేశీ విద్యకు తిలోదకాలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యకు నాలుగేళ్ల పాటు తిలోద కాలు ఇచ్చారని, చివరి ఏడాదిలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును జగనన్న విదేశీ విద్య పథకం గా మార్చి అమలు చేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరిట గత ప్రభుత్వ హయాంలో దళితుల విద్యాభ్యున్నతికి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తే, అంబేద్కర్ వంటి మహానీయుడు పేరుని తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరును పెట్టుకుని, దళిత విద్యార్థులకు ఒరగబెట్టింది ఏమీ లేదు అన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలలోను ఒక విడత విద్యార్థులకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు.

జగనన్న ఆటో రిక్షా పథకం కింద ఐదేళ్లలో ఏడాదికి పదివేల చొప్పున 50వేల రూపాయలు ఇచ్చామని చెబుతూ, ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు. అధికారంలోకి వస్తే మరో ఐదేళ్లపాటు ఏడాదికి పదివేల చొప్పున 50,000 ఇచ్చి, ఈ పథకానికి లక్ష రూపాయలను ఇచ్చినట్లుగా పేర్కొంటారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ఇక, పదేళ్లలో లక్ష రూపాయల లబ్ధి చేకూర్చామని చెబుతారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

నా అక్కా చెల్లెమ్మలకు అంటోన్న జగన్ మోహన్ రెడ్డి, ఇద్దరు చెల్లెమ్మలను రోడ్డున పడేశారని, తల్లి ప్రాణభయంతో అమెరికాకు పారిపోయిందన్నారు. తల్లి, చెల్లి, ఏ గల్లీ లేని సిల్లీ జగన్మోహన్ రెడ్డి ని ఆడపడుచులు చేయి పట్టుకొని నడిపించాలట అని అపహాస్యం చేశారు. గతంలో చేయూత పథకం కింద మహిళలకు 75 వేల రూపాయలిచ్చామని, ఈసారి అధికారంలోకి వస్తే 1,50,000 ఇస్తామని ప్రకటించారన్నారు. ఇప్పటికే 75 వేల రూపాయలు ఈ పథకం కింద లబ్ధి పొందిన మహిళలకు, మరొక 75000 అందజేసి 1,50,000 ఇచ్చామంటారన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్జిన్ మనీ చెల్లించి వాటిని కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలనుఅమలు చేయలేదన్నారు. ఏ ఒక్క పథకానికి కూడా మార్జిన్ మనీ చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని వాపోయారు. అభివృద్ధి ఎజెండాగా వెళుతూ, సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా గాడిలో పెట్టేందుకు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2021 లో పూర్తి చేస్తామన్నారు.

ఆ తర్వాత 2022లో, మళ్లీ మాట మార్చి 2024 పూర్తి చేస్తామని చెప్పి, పోలవరం పనులను అటకెక్కించారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఇప్పుడు బ్యాండేడ్ బాయ్ ఐదేళ్ల తర్వాత పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే సత్తా కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు కు మాత్రమే ఉన్నదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . అమరావతి అభివృద్ధి గురించి తన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చెప్పలేదని, అమరావతి మోడల్ ను చితక్కొట్టినవాడు ఏమి చెబుతాడని ప్రశ్నించారు.

అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు అమరావతిలో వేసిన రోడ్లను తవ్వుకు పోయారన్న రఘురామ కృష్ణంరాజు, కొన్ని దారి దోపిడీ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చాయన్నారని, దారిన పోయే వ్యక్తులను దోచుకుంటారేమోననుకుంటే, రహదారులను దోచుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించినట్లు లేదన్న ఆయన, ఐదేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు . భోగాపురం ఎయిర్పోర్టును జిఎంఆర్ సంస్థ దక్కించుకుందని, నిర్మాణ పనులను ఆ సంస్థ చూసుకుంటుందన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం అని ప్రశ్నించారు. బహుశా నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఎటువంటి లిటిగేషన్ పెట్టకుండా ఉంటానని చెప్పడానికి కాబోలు ఐదేళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని చెప్పి ఉంటారని ఎద్దేవా చేశారు

సైకోలా మారిన జగన్మోహన్ రెడ్డి
సైకోలా జగన్మోహన్ రెడ్డి మారిపోయారని, శవాన్ని చూస్తే నవ్వుకోవడం, పెళ్లికి వెళితే ఏడుపు ముఖం పెట్టడం అతడికి అలవాటుగా మారిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత పనికిమాలిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిందని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని బదిలీ చేయడానికి ఎందుకు ఇంత తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.

జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూరే ఏ పని నైనా చేయడానికి సిద్ధం అన్నట్లుగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందజేయాల్సి ఉండగా, అందచేయలేమని సి ఎస్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఏప్రిల్ మాసంలోనే వృద్ధాప్య పింఛన్ల కోసం లైన్లో నిలబడి 32 మంది వృద్ధులు చనిపోయారని సాక్షి దినపత్రికలో రాశారని గుర్తు చేశారు. మరి మే మాసంలో లైన్లో నిలబెట్టి ఎంతమంది వృద్ధులను చంపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు . ఈ మారణకాండ ఇలాగే కొనసాగితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన వాలంటరీ వ్యవస్థను స్వచ్ఛంద సంఘాలు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ప్రచారం చేసుకోవడానికి వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తున్నారన్నారు.

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో పనిచేసే సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేయించాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. నా స్థాయిలో నేను కూడా అదే విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ప్రతిరోజు ఒక్కొక్క పోస్ట్ మెన్ 50 నుంచి 100 ఉత్తరాలను అవలీలగా ఇంటింటికి తిరిగి ఇస్తారని, అదే గ్రామ సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఒక్కొక్కరు 50 నుంచి 100 మంది వృద్ధులకు పింఛన్లను అందజేయలేరా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి లు ఇలాగే నరమేధాన్ని కొనసాగిస్తే ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా ఈ నరహంతకుల్ని ఇంటికి పంపుతారన్నారు.

చిన్నాన్నను ఎవరు లేపేశారో అందరికీ తెలుసు నన్న జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడని, వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో దేవుడికి తెలుసు నాకు తెలుసు అని నిజమే చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహార శైలిపై, రాష్ట్రంలో జరుగుతున్న నరమేధంపై ప్రధానమంత్రికి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖలు రాయనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఒకటి రెండు రోజుల వ్యవధిలో బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ఈ నర మేధాన్ని చూసి ఆయనకు మనసు మానవత్వం ఉందంటే ఎవరు నమ్మరు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి మారాలి. ప్రజలు ఆయన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేనంత సిగ్గుతో తల దించుకునే విధంగా ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించే సమయంలో నాకు మనసు ఉంది. మానవత్వం ఉంది అని పేర్కొనడం చూస్తే మాయాబజార్ సినిమాలో రేలంగి పోషించిన ఉత్తర కుమారుడి పాత్రే గుర్తుకు వచ్చిందన్నారు.

రెండవ, మూడవ స్థానం కోసం వైకాపా అధికార, అనధికారిక అభ్యర్థుల మధ్య పోటీ
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండవ, మూడవ స్థానాల కోసం వైకాపా అధికారిక, అనధికారిక అభ్యర్థి మధ్య పోటీ నెలకొందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సాక్షి దినపత్రికలో శివరామరాజు పన్నిన వ్యూహానికి రఘురామ కృష్ణంరాజు ఉక్కిరిబిక్కిరి అని, రఘురామది మూడవ స్థానమేనంటూ రాశారన్నారు. ఎమ్మెల్యే రామరాజు, ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు పై కనిపిస్తున్నప్పటికీ, ప్రచారం చేయడం లేదంటూ సాక్షి దినపత్రికలో ప్రజల్లో అపోహ కలిగించే విధంగా కథనాలను రాస్తోందని తెలిపారు.

ఎన్నికల్లో పోటీకి నరసింహారాజుకు వైకాపా నాయకత్వం ఎంత డబ్బులు ముట్ట చెప్పిందో నేను రివీల్ చేయను. శివరామరాజు ఎల్లో ముసుగు వేసే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక చేసినప్పటికీ ఆయన ఎల్లో ముసుగు తొలగిపోయింది. శివరామకృష్ణం రాజుకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరికీ అర్థమయింది. శివరామరాజు, వైకాపా మనిషి అని తెలిసిపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ పల్లె నిద్ర పేరిట చేపట్టిన కార్యక్రమంలో కూడా శివరామరాజు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలని అభ్యర్థించారు.

కావాలంటే వారి పేర్లు చెబుతాను వెళ్లి మీరు ఆరా తీయండి అంటూ మీడియా ప్రతినిధులకు రఘురామకృష్ణంరాజు సూచించారు. ఎన్నికల్లో పోటీ కోసం శివరామరాజుకు వైకాపా నాయకత్వం దశలవారీగా 20 కొట్టారట. గతంలో ఎంపీకి పోటీ చేయమని శివరామరాజుకు ఎవరు చెప్పారు. ఎంపీకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎలా ఇస్తారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కు టికెట్ కేటాయించారని, నా కర్మ కాలి నరసాపురం పార్లమెంట్ స్థానం పొత్తులో భాగంగా బిజెపి కి కేటాయించారని, పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి సీటు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఒక్క స్థానంలో వర్మకు కేటాయించారన్నారు . నేను పోటీలో ఉండాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు.

సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్న రామరాజు
రామరాజు నాకు అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈరోజు ఉదయం కూడా మూడు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం. సాయంత్రం మరో మూడు గ్రామాలను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున శివరామరాజు నామినేషన్ దాఖలు చేశారని, ఒక పార్టీలో కొనసాగుతూ, మరొక పార్టీ సభ్యుడనని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు.

ప్రత్యర్ధుల ఎత్తుగడలను చిత్తు చేయడానికి ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నానని చెబుతున్నారని ఒక మీడియా ప్రతినిధి రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురా, ఇప్పుడు ఆయన ఉన్నది 9వ స్థానంలోనే కదా అంటూ రఘురామకృష్ణం రాజు ఎదురు ప్రశ్నించారు. అఫీషియల్ గా ఒక పార్టీలో చేరి, అనఫీషియల్ గా మరొక పార్టీతో పొలిటికల్ సంబంధాన్ని కొనసాగిస్తున్న శివరామరాజు, జగన్మోహన్ రెడ్డిలు గోదావరి ప్రాంత ప్రజలను తింగరోళ్లని అనుకుంటున్నారా అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు . గోదావరి ప్రాంత ప్రజలు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకమని గుర్తు చేశారు.

గంగ చంద్రముఖి గా మారినట్లుగా శివరామరాజు పూర్తిగా వైకాపా మనిషిగా పరిణామం చెందారు . ఇప్పుడు ఆయనని టిడిపి రెబల్ అభ్యర్థి అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. నేను వైకాపా అభ్యర్థిని అని చెప్పుకుంటే నరసింహారాజు కంటే తోపు అనుకొని వైకాపా ఓటర్లైన ఆయనకు ఓటు వేస్తారన్నారు. శివరామరాజుకు ఇప్పటికే నరసింహారాజు డేరా బాబా అని పేరు పెట్టారట… ఎందుకో నాకు తెలియదు కానీ ఆ పేరు పాపులర్ అయ్యిందన్నారు.

ఎన్నికలకు ముందు ఎవరైనా అప్పులను తీరుస్తారా అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, యుగయుగాలుగా ఉన్న అప్పులను తీర్చేందుకు శివరామరాజు ఒక నలుగురికి ఫోన్ చేశారన్నారు. వైకాపా నాయకత్వం నాకు డబ్బులు ఇవ్వలేదని కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో శివరామరాజు ప్రమాణం చేయాలని, శివరామరాజుకు డబ్బులు ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి ఏదైనా చర్చిలో ప్రమాణం చేయాలన్నారు. ఫ్యాన్ గుర్తు ఓట్లు రెండుగా చీలిపోవడంతో, నా మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE