Suryaa.co.in

Features

ఎగువ భద్ర నిర్మాణంతో ఎడారి కానున్న రాయలసీమ

బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా 29.5 టిఎంసి నీటిని వినియోగించుకోవడానికి  అప్పర్ భద్ర  ప్రాజెక్ట్ ద్వారా  కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుంది.  ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవు.కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించడం రాయలసీమ నీటి వనరులకు తీవ్ర ప్రమాదంగా మారింది. కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రెండు రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి కేంద్రం  సిద్ధమైంది. మతాల మధ్య, ప్రాంతాల మధ్య నిరంతరం ఘర్షణలు రాజేసి అందులోంచి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విధానం. నిత్యం కరువులకు గురవుతున్న రాయలసీమ జిల్లా ప్రజలకు కొంత మేరకైనా సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర ప్రాజెక్టు పైన నిర్మించే ‘ఎగువ భద్ర’ వల్ల రాయలసీమ ఎడారిగా మారనున్నది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బిజెపి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుంది. రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం రాయలసీమను బలిపెట్టడానికి సిద్ధమై అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నది. రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ హడావుడి చేసిన ఆంధ్ర బిజెపి నాయకులు మౌన ముద్రలో వున్నారు. మన రాష్ట్ర నీటి వాటాను, ప్రభుత్వ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ‘అప్పర్‌ భద్ర’కు అనుమతులు, నిధులు ఇస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ చర్యలపై పోరాడాల్సిన వైసిపి, టిడిపి తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయ పడుతున్నాయి. ప్రజలు ఇబ్బందికి గురైతే  ప్రశ్నించడంతో ముందుంటానని ప్రతి సమావేశంలో జనసేనాని  ‘అప్పర్‌ భద్ర’ పై ఎందుకని ప్రశ్నించరు? రాయలసీమ ఏమైతేనేమి! బిజెపితో దోస్తీ చెడకుండా వుంటే మహాభాగ్యం అని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

తుంగ, భద్ర నదుల ద్వారా వచ్చే నీటిని తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ చేసి అక్కడి నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం పంపిణీ జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతి నది పై భాగాన కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో ‘అప్పర్‌ భద్ర’ మేజర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్ర నదుల నుండి నీటిని తోడుకోవడం ద్వారా కర్ణాటక లోని వెనుకబడిన చిత్రదుర్గ, చిక్‌మగళూరు, దావణగెరె, తుముకూరు జిల్లాల్లో దాదాపు 2,25,515 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో నికరమైన నీటిని ఈ జిల్లాలకు అందించడం, భూగర్భ జలాలను అభివృద్ధి చేయడం, తాగునీటి కోసం 367 చేరువులను 50 శాతం సామర్థ్యంతో నింపడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా రూ.21,473.67 కోట్లు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం, కేంద్రం ఆమోదించడం జరిగింది. కృష్ణా బేసిన్‌లో భాగంగా వున్న తుంగభద్ర డ్యామ్‌పై దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రెండు దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 17.4 టీఎంసీలు, రెండవ దశలో 29.9 టిఎంసీల నీటిని కర్ణాటక తుంగభద్ర డ్యామ్‌ లోకి రాకుండా తోడేసుకుంటుంది. ఆ మేరకు దిగువనున్న హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ కింద వున్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు పెట్టాయి. చట్టాల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం లేని బిజెపి ఏకపక్షంగా ‘అప్పర్‌ భద్ర’ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కర్ణాటక లోని కరువు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కంటే ఈ ప్రాజెక్టు గురించి నాలుగు జిల్లాల్లో ప్రచారం చేసుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందడమే ప్రధాన అంశంగా ఉంది.

అతీగతీ లేని రాయలసీమ ప్రాజెక్టులు
పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగడం లేదు. కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు ఉన్నా ప్రతియేటా రాయలసీమకు కరువు తప్పడంలేదు. ప్రభుత్వాలు ప్రకటనలు, బూటకపు వాగ్దానాలకే పరిమితమయ్యారు.  రాయలసీమ లోని ఎనిమిది జిల్లాలలో సిద్దేశ్వరం అలుగు ఉద్యమం స్ఫూర్తితో చట్టబద్ద నీటిహక్కుల సాధనకు ప్రజా ఉద్యమం చేసి సిద్దేశ్వరం అలుగు  సాధించే వరకు పోరాడాల్సిన అవసరం ఉంది .  గ్రామ, మండల, జిల్లా స్థాయిలలోని అన్ని రైతుసంఘాలు మరియు ప్రజాసంఘాల సమన్వయంతో ఉద్యమస్ఫూర్తి  చాటి   పట్టణాలలోని ప్రజలను  కూడా త్రాగునీటి పరిష్కారానికి రాయలసీమ సాగునీటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ముందుకెళ్లాలి. సిద్దేశ్వరం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం. దాదాపు శతాబ్దం  పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. ఫలితంగా రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ నేడు కరువుసీమగా మారి ప్రపంచం ముందు సాయం కోసం దీనంగా నిలబడి దైన్యస్థితి. 1911-12 ప్రాంతములో ఆంగ్లేయుల కాలంలో మెకన్ జి సిఫార్సుల మేరకు సిద్దేశ్వరం సర్వే చేసి నిర్మాణానికి అంగీకారం తెలిపారు. తదనంతరం 1958 ప్రాంతములో భారత ప్లానింగ్ క‌మిష‌న్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.రాయలసీమకు 18 లక్షల ఎకరాలకు, నాటి తమిళనాడుకు 5 లక్షల ఎకరాలకు మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దాదాపు 250 టిఎంసి ల సామర్ద్యం తో ప్రాజెక్ట్ ను రూపొందించారు.

అదే జరిగి ఉంటే నేడు రాయలసీమకు 250 టిఎంసి ల నికరజలాలు హక్కుగా మారి ఉండేది. అంతేకాదు సీమ మొత్తం వ్యవసాయం వృద్ధి చెంది దానికి అనుబంధంగా పరిశ్రమలు, అపార ఖనిజ సంపద, వాతావరణ అనుకూల పరిస్థితుల నేపథ్యంలో గణనీయమైన అభివృద్ధి సాధించి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం గా  నేడు మన రాయలసీమ ఉండేది. అందుకే సిద్దేశ్వరం నిర్మాణం రాయలసీమ నీటి అవసరాలకు అత్యంత ముఖ్యం.నికర జలాలు ఉన్నా అనుభ‌వించలేని దుస్థితి….రాయలసీమకు నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అదే సందర్భంలో ఉన్న 133.7 టిఎంసి  లలో కనీసం సగం నీటిని వాడుకోలేక పోతున్నాము.

ప్రాజెక్ట్ లవారిగా పరిశీలిస్తే..
1.  తుంగభ‌ద్ర హైలెవల్ కెనాల్ కి ఉన్న 32.5 టిఎంసిలో 17,18 టిఎంసిలు మాత్రమే వాడుకుంటున్నాము.
2. ఎల్ఎల్సీ  29.5 టిఎంసిలలో 11 టిఎంసిలు మాత్రమే వాడుకుంటున్నాము.
3. కెసి  కెనాల్ కు 39.9 టిఎంసి లు ఉండగా ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి 50,60 టిఎంసి లు డ్రా అవుతున్నట్లు చూపిస్తున్నారు. కాని వాస్తవం లో 15 టిఎంసి లు మాత్రమే వాడుకుంటున్నాము.
4. బైరవాని తిప్ప  4.9 టిఎంసి లలో కేవలం 0.5 టిఎంసి లు వాడుకుంటున్నాము.
5. ఎస్ఆర్బీసీలో 19 టిఎంసిలు ఉన్నా అందులో ఉపయోగించుకుంటున్నది 7,8 టిఎంసిలు మాత్రమే. స్దూలంగా చెప్పాలంటే సీమకు అధికారికంగా, హక్కుగా ఉన్న 133.7 టిఎంసి లలో మనం దాదాపు సగం అంటే 65 టిఎంసి లను వాడుకోవడంలేదు. దీని ఖ‌రీదు వరి పంట అయితే కనీసం 5,6 లక్షల ఎకరాలు, అదే డ్రిప్ లాంటి వ్యవసాయం అయితే 13 లక్షల ఎకరాలు పంటనీటిని వాడుకోలేని పరిస్దితి. ఇవి కాక  శ్రీశైలం లోని క్యారి ఓవర్ క్రింద 60 టిఎంసి లు, పట్టిసీమ నిర్మాణం ద్వారా 45 టిఎంసి లు, పులిచింతల ద్వారా ఒప్పందం మేరకు 54 టిఎంసి లను మనం వాడుకోవాలి. అంటే దాదాపు 159  టిఎంసి ఇంకా రాయలసీమ వాడుకోవడానికి అవకాశం ఉంది. అధికారికంగా ఉన్న 133.7 టిఎంసి లనే వాడుకునే ఏర్పాట్లు లేనపుడు ఇంకా అవకాశం ఉన్న 159 టిఎంసి లను ఎలా వాడుకోవాలి. రెండు కారణాల వలన సీమ ప్రాంతం నీటిని వాడుకోలేక పోతుంది. 1 నీటి నిల్వ చేసుకునే ఏర్పాట్లు తగినంతగా సీమలో లేవు. 2 అవకాశం ఉన్న శ్రీశైలం లో 854 అడుగుల ఎత్తుకు నీటిని ఉంచకుండా 69 జీఓ ద్వారా 834 అడుగుల వరకు నీటిని క్రిష్ణా డెల్టాకు తీసుకు వెలుతుండటం వలన సీమకు నీటి కష్టాలు వచ్చాయి.

అందుకే
1. జీఓ నెం 69 ని రద్దు చేసి శ్రీశైలం నీటి మట్టాని 854 అడుగులు ఉండేలా చూడటం.
2. శ్రీశైలంకి 86 కీలోమీటర్ల పైన 860 అడుగల ఎత్తులో సిద్దేశ్వరం అలుగును నిర్మించాలి.
సిద్దేశ్వరం అలుగు ప్రయోజనం….సిద్దేశ్వరం అలుగును శ్రీశైలం కు పైన నిర్మిస్తాం కాబట్టి 50 టిఎంసి ల  నీటిని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సిద్దేశ్వరం అలుగు కాబట్టి కృష్ణా నీరు సిద్దేశ్వరం పొంగిన తర్వాతనే శ్రీశైలం కు వెలుతుంది. అంటే కచ్చితంగా 50 టిఎంసి లు నీరు నిల్వ ఉంటుంది.బ్యాక్ వాటర్ తో పనిచేసే పోతిరెడ్డి పాడు 842 అడుగులు కాబట్టి కనీసం 19 అడుగుల నీరు చేరి తెలుగు గంగా, గాలేరు-నగరి, ఎస్ఆర్బీసీ  లకు నీటి సమస్య పరిష్కారమవుతుంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథ‌కానికి నీటి సమస్య రాకుండా ఉండటంతో బాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ కు కూడా నీరు ఇవ్వవచ్చు. మారిన పరిస్థితులలో  సిద్దేశ్వరం ఆవశ్యకత..సీమ పైన తెలంగాణ తో సహ మిగిలిన రాష్ట్రాలు ప్రాజెక్ట్ లు కడుతున్నారు. అవి తర్వాత కాలంలో నికర జలాల ప్రాజెక్టు లుగా మారి పోతే సీమకు నీటి మీద కనీస హక్కును కోల్పోతాము.  అందుకే ఒక సారి సిద్దేశ్వరం ప్రాజెక్ట్ ను కోల్పోయి దాదాపు 250 టిఎంసి ల నికర జలాలను కోల్పోయాము. మళ్లీ ఇప్పుడు ఆ చిన్నపాటి ప్రాజెక్ట్ ను కూడా సాధించుకోక పోతే సీమ భ‌వితవ్యం ప్రమాదంలో పడక మానదు. శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పూడిక వల్ల 140 టిఎంసిలు  తగ్గింది.శ్రీశైలం భద్రత రీత్యా ఒత్తిడి తగ్గించాల్సిన అవసరాన్ని సిడబ్ల్యూసి  ఎప్పుడో గుర్తించింది. పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టా అవసరం తీరుతుంది కనుక రాయలసీమకు శ్రీశైలం నీటిని వినియోగించే అవకాశాలు తక్కువ. తెలంగాణకు నాగార్జున సాగర్ ద్వారా 99.5 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి నీరు తీసుకునే హక్కు ఉంది. ప్రారంభంలో ఆ నీటిని తీసుకుంటే కనీస నీటి మట్టం నిర్వహణ సాధ్యం కాదు.  అందువలన రాయలసీమ నీటి అవసరాలకు సిద్దేశ్వరం కచ్చితంగా కీలకం. దాన్ని సాధించుకోవడం రాయలసీమ ప్రజల కర్త‌వ్యం.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యం పెంపు , రిజర్వాయర్ ల నిర్మాణం వైపు ఆడుగులు వేస్తుంది. 40 వేల కోట్ల రూపాయల అంచనాతో ఎస్పీవీ ని  ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోకి సిద్దేశ్వరం , గుండ్రేవుల , సోమశిల – కండలేరు సామర్థ్యం 4 టిఎంసిలకు పెంచడం , చెరువుల పునరుద్ధరణ పనులను చేర్చాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి.  గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై రాయలసీమ సమాజం పోరాడింది. ఇప్పుడున్న  ప్రభుత్వం పరిష్కరించాలని ఆశిస్తోంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను , రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికిగాను సిద్దేశ్వరం నిర్మాణంపై అధికారిక నిర్ణయం తీసుకోవాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE