వడ్డేశ్వరం రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్
దాదాపు రెండునెలలకు పైగా రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యాను, క్షేత్రస్థాయిలో వారి సమస్యలన్నీ తెలుసుకోగలిగాను, యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరం రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… వడ్డేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంతో ఇప్పటివరకు నియోజకవర్గంలో 67రచ్చబండ సభలు నిర్వహించాను. ఎన్నికలప్పుడు చేతులూపడం, రోడ్ షోలు చేయడం కాదు. అనునిత్యం ప్రజల్లో ఉండేవాడే నిజమైన నాయకుడు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో ఘనవిజయం సాధించాక ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానని లోకేష్ చెప్పారు.
మైనార్టీ రిజర్వేషన్లపై జగన్ కి చిత్తశుద్ధి లేదు. మన ప్రభుత్వం రాగానే న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి 4శాతం రిజర్వేషన్ అమలుకు కృషిచేస్తాం. జగన్ కి తెలిసింది ప్రజలను కుల,మతాల వారీగా విడగొట్టడమే. సీఏఏకు అనుకూలంగా ఓటేసింది, మాట్లాడింది వైకాపా ఎంపీలే. మైనారిటీలను మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. జగన్ రెడ్డి పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయి. ఎన్నాళ్లు భయంతో బతుకుతారు?
కూటమి ప్రభుత్వం రాగానే మైనార్టీలు, దళితులకు జగన్ నిలిపివేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెన్నంటే ఉన్నా. అధికారంలోకి రాగానే దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేస్తాం. భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. రౌడీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లపై ఉక్కుపాదం మోపుతామని లోకేష్ చెప్పారు.