సర్కారీ స్కూల్లో విందు.. చిందు!

-రికార్డింగ్‌ డ్యాన్సులా? హవ్వ!
-కుల (వన)భోజన కార్యక్రమంలో ఇదో మజా
-పెంటపాడు స్కూల్‌లో ఇదో పాడు పని

అదో సర్కారీ స్కూలు. అక్కడ చిన్నారుల చదువులు, ఆటపాటలు మాత్రమే కనిపించాలి. కానీ అక్కడ ఒక కులం వారు వనభోజనాల దుకాణం పెట్టేశారు. సరే పెడితే పెట్టారు. అది వచ్చామా? తిన్నామా? వెళ్లామా? అన్నట్లు కాకుండా.. ఏకంగా రికార్డింగ్‌ డాన్స్‌పార్టీ దుకాణమే పెట్టేశారు. డాన్సు భామలు బావలు సయ్యా.. అని ప్రశ్నిస్తే, అక్కడకొచ్చిన కులభోజనాల కుర్రాళ్లు సయ్‌.. సయ్‌ అని సయ్యాటలాడారు. ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన సీన్‌. అధికారులూ.. సర్కారీ స్కూళ్లలో ఏం జరుగుతోందో మీకు అర్ధమవుతోందా?

పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రమైన పెంటపాడు గ్రామంలో ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్ ఆవరణలో ఒక సామాజిక వర్గ వనభోజనాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో వనభోజనాల నిర్వహించడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చారా? సరస్వతి నిలయం గా ఉండే ప్రభుత్వ పాఠశాలలో రికార్డింగ్ డాన్సులు వేయడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు.

ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం దేనికి సంకేతంఅని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో రూరల్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో రికార్డింగ్ డాన్స్ వేశారని చర్యలు తీసుకున్న రూరల్ పోలీసులు ఇక్కడ చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply