ఇంజినీరింగ్ విద్యార్థులకు రీయంబర్స్ మెంట్ ఫీజ్ చెల్లించాలి

– ప్రభుత్వం ఫీజ్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు నిరాకరిస్తున్న యాజమాన్యాలు
– ఒరిజినల్ సర్టిఫికెట్లు సకాలంలో అందక ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థులు
– ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్న తెరాస ప్రభుత్వం
– బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్
కన్వీనర్ కోటా ద్వారా చేరిన ఇంజినీరింగ్ విద్యార్థులకు కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు నేటివరకు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు నిరాకరించడంతో వారి ఉజ్వల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కన్వీనర్ కోటా క్రింద చేరిన ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫీజ్ రీయంబర్స్ మెంట్ నేరుగా కాలేజిలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలు వచ్చి నెలలు గడిచిన కూడా నేటివరకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధిత ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బేతి మహేందర్ రెడ్డి వాపోయారు. ఇదేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు మాకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు రాలేదు కనుక మీకు సర్టిఫికెట్లు ఇవ్వమని తెగేసి చెపుతున్నారు.
ఒకవేళ సర్టిఫికెట్లు కావాలంటే ఫీజ్ డబ్బులు మీరే చేల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్ళండని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారని మహేందర్ రెడ్డి తెలిపారు. ఒక దిక్కు కరోనా సమస్యతో, ఆర్ధిక ఇబ్బందులతో పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు చుక్కలు చూపెడుతున్నారని, అలాగే కరోనా కారణంగా అంతంతమాత్రంగానే ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠాలు చెప్పిన యాజమాన్యాలు తీరా సర్టిఫికెట్లు ఇవ్వడానికి ససేమిరా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు వచ్చినాకనే సర్టిఫికెట్లు ఇస్తామనడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీల యాజమాన్యాలు సమాధానం చెప్పాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సమస్య వల్ల రాష్ట్ర మంతట వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వారి భవిష్యత్ ప్రణాళికలకు ఫుల్ స్టాప్ పడే ప్రమాదం ఏర్పడ్డదని, అలాగే ఎంతో శ్రమకోర్చి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థులకు సకాలంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు అందకపోవడంతో వారి భవిష్యత్ చీకటిమయంలోకి వెళ్లి మానసిక వేదనకు గురవుతూన్నారని, అలాగే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో వారి కెరీర్ కూడా దెబ్బతింటున్నదని బేతి మహేందర్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులే కాలేజీలకు కట్టలేకపోతే ఉచిత విద్య ఎలా అందిస్తాడో కేసీఆర్ సమాధానం చెప్పాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు కాలేజీలకు వెంటనే చెల్లించాలని, ఒకవేళ ప్రభుత్వం కాలయాపన చేస్తే విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం పొంచి ఉన్నదని, గతంలో ఇంటర్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి తప్పుడు ఫలితాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అందుకే విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ డబ్బులు కాలేజీల యాజమాన్యాలకు తక్షణమే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా చూసి వారికి న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.