Suryaa.co.in

Telangana

పోలవరం మార్పులను తిరస్కరించండి

– ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
– అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విస్తరణ
– ఆమోదం పొందిన సామర్ధ్యం కేవలము 8,123 క్యూసెక్కులే
-కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు మంత్రి ఉత్తమ్ లేఖ

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర పర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపేంద్ర యాదవ్ కు బహిరంగ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో పాటు ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని,ఇది ముమ్మాటికి పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్ల చేస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విస్తరణకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.

గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తో పాటు సాంకేతిక సలహా మండలి సూచనలకు విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖా నుండి 2005 అక్టోబరు 25 న జె-12011/74/2005-I A -1 ద్వారా అనుమతి లభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండానే భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు
ఇదే విషయమై 2011 ఫిబ్రవరి 8 న కేంద్రం పనులను నిలిపి వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన చెప్పారు. అయితే 2026 జులై 2 వరకు ఈ ఉత్తర్వులు పొడగించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తెలంగాణా రాష్ట్రంతో పాటు ఛత్తీస్ ఘడ్ ,ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ పనులు కొనసాగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ ప్రాధమికంగా ఆమోదించిన భాగాలకు మాత్రమే నిధులు రీఎంబర్స్మెంట్ కొనసాగుతుందన్నారు.అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి, భారీ మార్పుల చేపట్టిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు

ప్రాజెక్టు విస్తరణ పై 2022 సెప్టెంబర్ 6 న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాజెక్టు విస్తరణ పై, సాంకేతిక నివేదికలు అవసరం అవుతాయని పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో ప్రస్తావించారు. పైగా పర్యావరణ అనుమతులు అవసరం ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో ఉటంకించారు.

ఇటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రితో పాటు యం.ఓ.ఇ. ఎఫ్./సి.సి అన్ని పక్షాలతో సమావేశం కావాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట ఆమోదించిన ప్రమాణాల ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన ఆరోపించారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా, కుడి కాలువ హెడ్ స్లూయిస్ నుండి 20 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం నుండి, 40 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యానికి పెంచుతూ డిజైన్ లో మార్పులు చేసిందన్నారు. వాస్తవానికి రెండు టన్నేళ్ళు కూడా 20 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యం తో నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు. పైగా హెడ్ వర్క్స్కు అవసరమైన మౌళిక సదుపాయాలు ఇప్పటికే నిర్మించ బడ్డాయన్నారు.

పి.ఐ.పి.ఆర్.యం.సి ని 11,654 క్యూసెక్కులకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ లో ఆమోదించినప్పటికి 17,560 క్యూసెక్కుల సామర్థ్యం తో నిర్మాణం జరుగు తుందన్నారు. అంతే గాకుండా పోలవరం ఎడమ కెనాల్ ను కూడా అంతే సామర్ధ్యంతో నిర్మిస్తున్నారన్నారు

ఆమోదం పొందిన సామర్ధ్యం కేవలము 8,123 క్యూసెక్కులేనని,అందుకు భిన్నంగా ప్రాజెక్టు డిజైన్ మార్చి ఎటువంటి అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ(ఇ. ఏ.సి) పరిగణనలోకి తీసుకోరాదని ఆయన డిమాండ్ చేశారు.

పై విషయాలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఇటువంటి ప్రతిపాదనలను ఇ. ఏ.సి సమావేశంలో తిరస్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను డిమాండ్ చేశారు.

 

LEAVE A RESPONSE