Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో పునరుత్పాదక ఇంధన

-రంగంలో 13,745 కోట్ల పెట్టుబడి
-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంపై 13745 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

2017-18 నుంచి ప్రారంభించిన ఈ పెట్టుబడులు 2022-23 వరకు కొనసాగుతాయి. గడచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక పునరుత్పాదక ఇంధన స్కీములు, కార్యక్రమాల అమలు కోసం కేంద్ర సాయం కింద 454 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో పవర్‌ గ్రిడ్‌తో అనుసంధానమైన సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో అత్యధికం ప్రైవేట్‌ డెవలపర్స్‌ అభివృద్ధి చేసినవేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు తమ మంత్రిత్వ శాఖ అయిదు సోలార్‌ పార్క్‌లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ అయిదు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి…
అనంతపురంలో 1500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ పార్క్‌ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట, కడప జిల్లాలోని గాలివీడులో 9592 ఎకరాలలో ఇప్పటికే 1400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. మరో 100 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌ డెవలపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల్లో 1000 మెగా వాట్ల సామర్ధ్యంతో 5568 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ పార్క్‌ ప్రారంభమైనట్లు చెప్పారు. కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్ధ్యంతో 5600 ఎకరాలలో ప్రారంభించిన సోలార్‌ పార్క్‌ పనులు పురోగతిలో ఉన్నాయి.

అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు, ఆలూరు గ్రామాల్లో 2751 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్క్‌కు సంబంధించి మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఇప్పటికే 400 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్స్‌లలో ఉత్పాదన ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని రామగిరి, ముత్తువకుంట్ల గ్రామాల్లో 200 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పుతున్న సోలార్‌, విండ్‌ హైబ్రీడ్‌ పార్క్‌కు సంబంధించి డీపీఆర్‌ను ఇంకా సమర్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 690 ఎకరాల భూసేకరణ జరిగింది. పార్క్‌లో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

జీఎస్టీ వసూళ్ళలో 37 శాతం వృద్ధి
ఇటీవల కాలంలో జీఎస్టీ వసూళ్ళలో గణనీయమైన వృద్ధి నమోదవుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2022-23 తొలి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్ళు సగటున నెలకు 1.51 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 37 శాతం వసూళ్ళు పెరిగాయని చెప్పారు.

జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు పొడింగించాలన్న వివిధ రాష్ట్రాల డిమాండ్‌పై ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఏం నిర్ణయించింది అన్న ప్రశ్నకు మంత్రి నేరుగా సమాధానం చెప్పకుండా జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని రాష్ట్రాలు కోరిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరిస్తూ జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి అయిదేళ్ళపాటు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించే రాజ్యాంగపరమైన హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ఏపీలో నాలుగు సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు
ప్రధానమంత్రి అభిమ్‌ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు (ఐపీహెచ్‌ఎల్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ పథకం కింద దేశంలోని 730 జిల్లాల్లో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు సమీకృత ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతున్నట్లు ఆమె చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఐపీహెచ్‌ఎల్‌ ఏర్పాటుకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో, మరో మూడు ల్యాబ్‌ల ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.

జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో అంటువ్యాధులపై కచ్చితమైన సమాచారాన్ని అందించే సర్వైలెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు ఐపీహెచ్‌ఎల్‌ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఈ లాబ్‌ల ద్వారా అందే సమాచారం, డేటా ఆధారంగా ప్రజారోగ్యానికి ఏర్పడే ముప్పును ముందుగానే గుర్తించడం, సమర్దంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. మైక్రోబయాలజీ, హెమటాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, క్లినికల్‌ పాథాలజీ, సైటాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ వంటి సేవలను సమీకృతంగా ఈ లాబ్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE