Suryaa.co.in

National

రేవంత్.. బీఆర్‌ఎస్ ఉచ్చులో పడకండి!

– బనకచర్ల తో తెలంగాణ కు నష్టం లేదని మొదట ప్రకటించిన నాయకురాలు డీ.కే అరుణమ్మ
– జగన్ సీఎం గా ఉన్నపుడు గడీల బానిస బాడుగ మేథావులు నిద్ర పోయారా?
– నీళ్ల కోసం ఆంధ్ర తెలంగాణ కొట్లాట కు ముగింపు ఎన్నడు?
– బనకచర్ల పై బహిరంగ లేఖ

కుహానా మేధావులకు.. బాడుగ మేథావులకు, టీవీ చర్చల్లో సెంటి మంటలు రాజేసే వారికి బహిరంగ సవాల్

2022….4,210 TMC

1986…..3000 TMC

ఈ గణాంకాలు చూస్తే …..

ప్రతి ఏటా సముద్రంలో గోదావరి నీళ్ళు మూడు వేల టీ ఎం సీ లు యావరేజ్ గా కలుస్తాయని సెంట్రల్ వాటర్ కమిషన్ గణాంకాలు
78 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ….ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అయినా నేటికీ కేటాయించిన గోదావరి జలాలు ఇంతవరకు వాడే స్థితి తెలంగాణ లో లేదు..

సముద్రంలో కలిసే గోదావరి జలాలను చంద్రబాబు గారు బనకచర్ల ప్రాజెక్ట్ తో గోదావరి కృష్ణా కావేరి నదుల అనుసంధానంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా భగీరథ ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ కు ఎలా నష్టం?

సీఎం రేవంత్ చరిత్రలో నిలుస్తారా? కేసీఆర్ బాటలో సాగుతారా?

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీ కాంగ్రెస్ లో జాతీయ భావజాలంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం మేలు కోరే నిర్ణయం తీసుకోవాలి.

బనకచర్ల ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తే, రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు. దేశ చరిత్రలో ఆదర్శ రాజకీయాలకు బాటలు వేసిన రాజనీతిజ్ఞుడు గా చరిత్రలో నిలుస్తారు. అలా కాకుండా కొందరు కాంగ్రెస్ మంత్రులు మాదిరి బీ.అర్.ఎస్ ట్రాప్ లో పడితే చరిత్ర క్షమించదు.
రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయ కుట్రలను చేదించి, రెండు తెలుగు రాష్ట్రాల వారు మెచ్చేలా గోదావరి వరద జలాలపై అభ్యంతరం తెలపకూడదు.

సీఎం రేవంత్….కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి . బండి సంజయ్ జాతీయ పార్టీ నేతలుగా ఆలోచన చేస్తారా? కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయ ఉచ్చులో పడతారా? బనకచర్ల తో తెలంగాణ కు నష్టం లేదని మొదట ప్రకటించిన నాయకురాలు డీ.కే అరుణమ్మ.

యావత్ ఆంధ్ర ప్రదేశ్ రైతాంగం మాత్రమే కాదు. తెలంగాణ రైతాంగం బీజేపీ జాతీయ నాయకురాలు డీ.కే అరుణమ్మ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బీ.అర్.ఎస్ తాటాకు చప్పుళ్లకు బయపడకుండా, కుండ బద్దలు కొట్టినట్లు బనకచర్ల పై వాస్తవాలు మాట్లాడి జేజమ్మ లా అరుణమ్మ చరిత్రలో నిలిచారు.

నాటి కేసీఆర్ మాటలు నీటి మూటలేనా?

జగన్ సీఎం గా ఉన్నపుడు రోజా ఇంట్లో….తరువాత ప్రగతి భవన్ లో జగన్ తో అలాయ్ బలాయ్ చేసుకుని, రాయలసీమ ను రత్నాల సీమ చేస్తాన్నపుడు, గడీల బానిస బాడుగ మేథావులు నిద్ర పోయారా?

నాడు కేసీఆర్ చెప్పింది అక్షర సత్యం .ఏటా మూడు వేల టీ ఎం సీ గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని.. పోలవరం టూ ప్రకాశం బ్యారేజ్ అక్కడ నుంచి పులిచింతల.. అక్కడ నుంచి నాగార్జున సాగర్ అక్కడ నుంచి.. శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు గోదావరి వరద జలాలు తరలించి, రెండు తెలుగు రాష్ట్రాలు సస్య శ్యామలం చేయాలనే కేసీఆర్ గారి ఆదర్శం ఇపుడు ఏమైంది?

జగన్ అధికారం పోయేసరికి.. చంద్రబాబు పై ద్వేషం తో, గోదావరి నీళ్ళు దోచుకు పోతున్నారని, నీతి మాలిన రాజకీయం. ఇదేనా మీరు దేశ రాజకీయాల్లో తెస్తానన్న గుణాత్మక రాజకీయం? బీ.అర్.ఎస్ నీళ్ల రాజకీయం ట్రాప్ లో.. పాపం కాంగ్రెస్- బీ. జే పి లో కొందరు ఎందుకు ట్రాప్ లో పడ్డారు అనేది అంతుపట్టని విషాదం.

చంద్రబాబు భగీరథ ప్రయత్నం తెలంగాణ కు మేలు.

నీళ్ల మంటలు రాజేసే నేతలు దోసిట్లు అడ్డుపెట్టినా ఏటా మూడు వేల టీ. ఎం సీ ల గోదావరి వరద జలాలను ఆపలేరు.

తెలంగాణ కు ఎంత అవసరం?

కాళేశ్వరం కూలేశ్వరం గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసినట్లు ….కాళేశ్వరం లేకుండానే, తెలంగాణలో దేశంలో
ఎక్కడ లేని విధంగా ధాన్యం ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్నాం. భవిష్యత్ లో..500 ఏళ్ల వరకైనా వెయ్యి టీ. ఎం సీ లు వాడే పరిస్థితులు ఉంటాయా?

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం లో కోటిన్నర ఎకరాలు సాగు భూమి ఉంది.ఎంత సాగు నీరు అవసరం ..ఒక్క..టీ. ఎం సీ తో పది వేల ఎకరాలు సాగు చేయొచ్చు. వెయ్యి టీ. ఎం సీ లతో కోటి ఎకరాలు సాగు నీరు అందుతుంది. కానీ ఆ స్థాయిలో ప్రాజెక్ట్ లు లేవు. వర్షాధారం గా చెరువులు వాగులు వంకలు కింద ఇప్పటికే తెలంగాణ లో ఇరిగేషన్ పెరిగింది…..

బనకచర్ల వల్ల రాయలసీమ ప్రాజెక్ట్ లు ఆగస్ట్ నాటికి నింపుతారు.కృష్ణా నీళ్ల పై ఆధారపడకుండా వానాకాలం సాగు కు గోదావరి నీళ్ళు ఉండటంతో కృష్ణా బేసిన్ లో శ్రీశైలం నాగార్జున సాగర్ నీళ్ళు ఆంధ్రాకు వినియోగం తగ్గితే తెలంగాణ కు మేలే కదా?

ఒకవేళ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ లేకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ నీళ్ల కోసం ఆంధ్ర తెలంగాణ కొట్లాట కు ముగింపు ఎన్నడు? గోదావరి వరదల సమయంలో ఏటా మూడు వేల టీ ఎం సీ లు వృథాగా సముద్రం పాలవుతుంటే, అందులో 200 టీ. ఎం సీ లు బనకచర్ల ప్రాజెక్ట్ తో రాయలసీమ సాగు కష్టాలు తీర్చాలని చంద్రబాబు గారు చేసే భగీరథ ప్రయత్నం పై.. కళ్ళ మంటతో బీ.అర్.ఎస్ చేసే నీళ్ల రాజకీయం ఉచ్చులో సీఎం రేవంత్ రెడ్డి గారు పడకుండా, దేశ చరిత్రలో నిలిచేలా జాతీయ పార్టీ నాయకుడు గా రాజనీతిజ్ఞడు గా ఆలోచన చేసి బనకచర్ల కు స్వాగతం తెలిపి, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో వెళ్లేలా బాటలు వేయాలని రైతాంగం పక్షాన విన్నపం

ఇట్లు
మందడపు సుధాకర్
పీ. ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచుకొండ
ఖమ్మం

LEAVE A RESPONSE