Suryaa.co.in

Telangana

ఫోన్ ట్యాపింగ్ వల్లే రేవంత్‌ ఓడారు

– కామారెడ్డిలో రేవంత్ ఓటమికి కారణాలు వెల్లడించిన సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యూహాలను పసిగట్టడం వల్లే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

గత ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్లను ట్యాప్ చేసి, తాము ఎవరితో సంభాషిస్తున్నామో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామో తెలుసుకున్నారని.. ఎన్నికల సమయంలో పోలీసులు అడుగడుగునా తమ వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారని, అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు పద్ధతులను అవలంబించి, గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్లను ట్యాప్ చేసి, తాము ఎవరితో సంభాషిస్తున్నామో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామో తెలుసుకున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతో పాటు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులను కూడా వదల్లేదని ఆయన ఆరోపించారు. టెలిగ్రాఫ్ చట్టం కింద ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులను కోరినట్లు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.

కామారెడ్డిలో ఉన్నప్పుడు తన ఫోన్‌ను 16 రోజుల పాటు ట్యాప్ చేశారని.. మఫ్టీలో ఉన్న పోలీసులు తమను నిరంతరం అనుసరించారని, తమ ఎన్నికల వ్యూహాలను పూర్తిగా తెలుసుకున్నారని తెలిపారు. కేంద్ర స్థాయి సంస్థలు చేపట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియను, తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించి స్థానిక పోలీసులతో చేయించారని అన్నారు.

 

LEAVE A RESPONSE