Suryaa.co.in

Telangana

తక్కువ వ్యవధిలో 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం

– ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాల్లో
– మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు
– డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు
– రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్ మెంట్ ప్రతిపాదనల కు కేబినెట్ ఆమోదం
– బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం
– క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం రైతు భరోసాను విజయవంతంగా రికార్డు వేగంతో అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9వేల కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది.

ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన ఘనత మా ప్రభుత్వానిది.
ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

రేపు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తుంది.
అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తెలంగాణలో ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయం

హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్ మెంట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా కేబినేట్ పరిశీలించింది.

చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల పొడవు ఉండే అలైన్ మెంట్ కు తుది ఆమోదం తెలిపింది.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారు..
చట్టపరంగా, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను ఈ నెల 30 లోగా కమిషన్ కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత ను అప్పగించింది.

రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ని కేబినెట్ ఆమోదించింది. ఈ పాలసీ లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేస్తారు.

తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధి (TSDF)ని ఏర్పాటు చేస్తుంది.

జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ (CBF) లో పది శాతం కేటాయించాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ ను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలనేది లక్ష్యం.

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది

అన్ని శాఖలు, అన్ని విభాగాలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశించిన వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్ తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్ గా వ్యవహరిస్తారు.

కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రం లో మౌలిక సదుపాయల వృద్ధి తో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

దేశ ఎకానమీలో పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యం తో ఈ విజన్ రూప కల్పన చేయాలని కేబినెట్ అధికారులకు దిశా నిర్దేశం చేసింది.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయం. ఆ మూడు నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను ఈ ప్రత్యేక భేటీ లో సమర్పించి చర్చిస్తారు.

ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గం తో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశం లో పాల్గొంటారు.
సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.

వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్ల తో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

LEAVE A RESPONSE