– జగన్ భక్తుడు శశిధర్‌కు ఏపీపీఎస్సీలో కీలక పదవి
– మూడు రాజధానులపై శివమెత్తిన శశిధరుడు
– ఇప్పుడు అదే జగన్ భక్తుడికి పిలిచి పదవి ఇచ్చిన మంచి ప్రభుత్వం
– ఇదేనా మీ పనితమంటూ సోషల్‌మీడియా సైనికుల శివతాండవం
– ఇలాగైతే కార్యకర్త అలగరా బాబూ అంటూ పోస్టులు
– రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉందా అంటూ కన్నెర్ర
– అలాగైతే మళ్లీ జగన్‌కే సీఎం పదవి ఇవ్వండని వ్యంగ్యాస్త్రాలు
– నిఘా దళాలకు పంపకుండానే నిర్ణయాలా?
– ఆయనను సిఫార్సు చేసిన వారిపై చర్యల కొరడా ఝళిపించాల్సిందే
– సీఎంఓ, లోకేష్ ఆఫీసు ఏం చేస్తున్నట్లు అంటూ ఆగ్రహం
– రోజంతా టీడీపీ వర్గాలను బేజారెత్తించిన శశిధర్ నియామకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇది మంచి ప్రభుత్వం. యస్. అందులో సందేహమే లేదు. ఆ ట్యాగ్‌లైన్ ఏ మేధావి కూటమికి అంటగట్టాడో గానీ.. దాని ‘ముహుర్తబలం’ బాగా ఉన్నట్లుంది. అందుకే మంచి ప్రభుత్వంలో వైసీపీకి విశేష, విశిష్ట, వినమ్ర సేవలదించిన జగనాభిమానులకు పిలిచి పెద్ద పీటనే వేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అతి మంచితనం చూసి.. కరుణామయుడయిన ఆ ఏసుప్రభువు కూడా ఈర్ష్యపడుతున్నట్లు జెరూసెలం చర్చి వర్గాల సమాచారం. అంతలా జీసస్‌కు సైతం జలసీ తెప్పిస్తున్న మన మంచిప్రభుత్వానికి హారతిపట్టాల్సిందేనన్నది పసుపుదళాల పట్టుదల.
ఎంత మంచి ప్రభుత్వం కాకపోతే.. జగన్ జమానాలో ఆయన పాలనకు హారతి పట్టి.. మూడు రాజధానలు దండగ. లక్ష కోట్లు ఎక్కడినుంచి తెస్తారంటూ నిర్భయంగా ప్రశ్నించి, జగనన్న పట్ల తన ప్రేమను చాటుకున్న.. అనంతపురం జెఎన్‌టియు డైరక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ డాక్టర్ శశిధర్‌ను ఏపీపీఎస్సీ మెంబరుగా నియమిస్తారు చెప్పండి? తన ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన జగన్ ఇచ్చిన గౌరవాన్ని, మంచిప్రభుత్వం కూడా కొనసాగించినందుకు మంచిప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించకపోతే కళ్లు పేలిపోవూ?!
అవును. మంచి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది! తీసుకుంటుంది!! ఏడాది నుంచి అలాగే తీసుకుంటోంది కూడా!!! ఏపీపీస్సీలో పనిచేయగల అంతలావు సమర్ధుడి కోసం.. భూతద్దం వేసి వెతికినా మరెక్కడా. మరెవరూ కనిపించలేదట. పోనీ ఐదేళ్ల విపక్షంలో టీడీపీకి శ్రమదానం చేసిన మేధావులెవరన్నా ఉన్నారా అంటే వాళ్లూ కనిపించలేదట.
అప్పటికీ సీఎంఓ, లోకేష్ ఆఫీసు ఆ పోస్టు భర్తీ చేసేందుకు తగిన అర్హతలున్న వారి కోసం, భయంకరమైన కసరత్తు చేసినా.. శశిధర్ అంత సమర్ధుడు దొరకలేదట. పోనీ అటు బీజేపీలోగానీ, ఇటు జనసేనలో గానీ అలాంటి టాలెంట్ ఉన్న వాళ్లేమైనా ఉన్నారా అంటే.. అక్కడా అదే పరిస్థితి. అందుకే ‘మంచిప్రభుత్వం’, శశిధర్ గతానుభవం పరిగణనలోకి తీసుకుని ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఆగమేఘాలపై నియమించిందట. అయినా.. గత సీఎంకు విధేయత ప్రదర్శించినట్లే.. ఇప్పటి సీఎంకూ శశిధరుడు విధేయత ప్రదర్శిస్తారు పోనిద్దురూ!?
అయినా ఇప్పుడు సీఎస్ నుంచి సీఎంఓ వరకూ అలాంటి మాజీ-తాజా విధేయబృందమే పనిచేస్తున్నప్పుడు.. శశిధరుడిని ఏపీపీఎస్సీలో నియమిస్తే తెలుగుతమ్ముళ్లు తెగ గింజుకోవడం.. సోషల్‌మీడియా సైనికులు శివతాండవం చేయడం ఎందుకో అర్ధంకాదు. కొత్తగా వచ్చిన వ్రతభంగమేమిటో అర్ధం కాదు. పసుపు సైన్యం ఇంకా లోకజ్ఞానం-లౌక్య జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటుందో హేమిటో?! కొన్ని చూసీ చూడనట్లు వదిలేయాలి.
అన్నీ మడికట్టుకుని కూర్చుంటే, పనులు జరిగేదెట్లా? మళ్లీ నాలుగేళ్ల తర్వాత వచ్చే బండిని నడిపేదెట్లా?.. మీకు అర్ధమవుతోందా? అయినా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో.. అధికారులకు ఏమేమి పోస్టింగులు ఇవ్వాలో.. బాగా తెలిసిన తెలివితేటలున్న వాళ్ల కంటే ఈ సోషల్‌మీడియా సైన్యం తె లివిగల వాళ్లా ఏంటి? ఎన్నికల్లో పార్టీకోసం పనిచేశామా? కేసులు పెట్టించుకున్నామా? అని చూసుకోవాలే తప్ప, మిగిలిన యవ్వారం మీకెందుకన్న స్థితప్రజ్ఞుల హితోక్తి పట్టించుకోకపోతే ఎలా?
జగన్ సర్కారులో ఆయన ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తి, భుజం పుండ్లు పడేలా శ్రమదానం చేసిన డాక్టర్ శశిధర్‌కు ‘మంచి ప్రభుత్వం’.. ఏపీపీఎస్సీ పదవిని పువ్వుల్లో పెట్టి అప్పగించడంపై, సోషల్‌మీడియా సైనికులు ఉదయం నుంచి శివతాండవం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు శరపరంపరగా సోషల్‌మీడియా వేదికగా అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకంటే మంచి వాడు దొరకలేదా?.. అసలు ఇలాంటి వాళ్లను సిఫార్సు చేస్తున్న వాళ్ల సంగతి తేల్చాలి… సీఎంఓ నిద్రపోతోందా? అసలు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందా? టీడీపీ అధికారంలో ఉందా? మొన్ననే బాబుగారు కార్యకర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడిందన్నారు. మరి ఇలాంటివి చూస్తే కార్యకర్తలు అలగక ముద్దు పెట్టుకుంటారా?.. మొన్న పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు వందకోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించారు. ఇప్పుడు వైసీపీని భుజానికెత్తుకుని అమరావతిని ద్వేషించిన శశిధర్‌కు ఏపీపీఎస్సీలో నియమించారు. ఇంకా తెరచాటు బాగోతాలు వచ్చే నాలుగేళ్లలో ఇంకెన్ని చూడాలో… ఇలా వైసీపీ వాళ్లను అందలమెక్కించడం, వాళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, జగన్ బినామీ కంపెనీలకే కాంట్రాక్టులివ్వడం.. జగన్‌కు భజన చేసిన అధికారులనే తీసుకువచ్చి పోస్టింగులిచ్చే బదులు, అసలు జగన్‌నే పిలిచి సీఎంగా పనిచేయమంటే సరిపోతుంది కదా? ఈ బాధంతా ఎందుకు? అంటూ వ్యంగ్యాస్త్రాలు-విమర్శనాస్త్రాలు జమిలిగా సంధిస్తున్నారు.
నిజానికి గత ఏడాది నుంచి మంచి ప్రభుత్వ నియామకాల్లో తప్పులను సోషల్‌మీడియా మాత్రమే.. నిగ్గదీసి నిలదీసినందుకే వాటిని సరిదిద్దుకున్నారే తప్ప, అందులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. ఎన్నికల ముందు జగన్ సైన్యం నిర్వహించిన మేధావుల సదస్సులో జగన్ రావడం చారిత్రక అవసరమని సెలవిచ్చిన ఓ ఆర్టీసీ మాజీ అధికారిని, రవాణా శాఖ మంత్రి పేషీలో నియమించారన్న వార్తలొచ్చినా చర్యలు తీసుకున్న దిక్కులేదు.
ఏడాది ముగిసినా ఇంకా అలాంటి తప్పులే విజయవంతంగా కొనసాగుతున్నాయంటే.. తప్పెవరిది?.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారిదా? ప్రభుత్వానికి సూచనలిస్తున్న అధికారులదా? లేక ప్రత్యేకంగా సృష్టించుకున్న వ్యవస్థల వైఫల్యం-అనుభవ రాహిత్యమా? అన్నదే తమ్ముళ్ల ప్రశ్న.
అసలు ఎలాంటి నియామకాలయినా వాటి వివరాలను ఇంటలిజన్స్‌కు పంపించే సంప్రదాయం గతంలో ఉండేది. సీఎంఓ సహా మంత్రుల పేషీలో చేరబోయే వారి గుణగణాలపై, నిఘా విభాగం నివేదిక ఇచ్చిన తర్వాతనే నియామకాలు ఉండేవి. డీఎస్పీలు, సీఐలు, కార్పొరేషన్ చైర్మన్లు, పీఏలు, పీఆర్వోల వంటి నియామకాలన్నీ ఇదే పద్ధతిలో జరిగేవి.
ఇంటలిజన్స్ నివేదిక ఇచ్చిన తర్వాతనే నిర్ణయాలు ఉండేవి. ఇప్పుడు ఏ ఒక్కటీ ఇంటలిజన్స్‌కు వెళ్లడం లేదు. పాలకులు ఏర్పాటుచేసుకున్న తెరచాటు వ్యవస్థలకు వెళ్లి..అటుంచి అటే ఉత్తర్వులు వెళ్లి, వాటిని ఇంటలిజన్స్ అధికారులు కూడా పొద్దున్నే పేపర్లలో అందరిమాదిరిగా చూడాల్సిన వైచిత్రి. అందుకే ఇలాంటి వింతలూ, విడ్డూరాలు దర్శనమిస్తున్నాయి.
కానీ ఇప్పుడు కూటమిలో ‘కొత్త సిలబస్’ చేరిన నేపథ్యంలో.. పోలీసుల నుంచి పీఆర్వోల నియామకాల వరకూ, ‘తెరవెనక పనిచేసే ప్రత్యేక వ్యవస్థలే’ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఇలాంటి శశిధర్‌లు అన్ని రంగాల్లోనూ నియమితులవడంలో పెద్ద వింతేమీలేదన్నది సీనియర్ల ఉవాచ. సీఐ, డీఎస్పీ నియామకాలు కూడా ‘‘తెరవెనక ప్రత్యేక వ్యవస్థ’’ నిర్ణయిస్తున్న పరిస్థితిలో, నియామకాల్లో ఇంతకుమించి ఎక్కువ ఆశించటం అత్యాశే అవుతుందన్నది సీనియర్ల మనో‘వాదన’. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇంకా పాత కాంట్రాక్టర్లే కొత్త ముసుగేసుకుని, దర్జాగా కాంట్రాక్టులు చేస్తుంటే.. పాపం వాటికోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న తమ్ముళ్లను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేం.