– కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?
– కేంద్రం ఆమోదం లేకుండానే రిజర్వేషన్లు అమలు చేయొచ్చు
– మరి కాంగ్రెస్ ఎందుకు ఆలస్యం చేస్తోంది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు హామీలిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. కానీ, ఇవన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలే.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. దాదాపు 1.65 కోట్ల మంది బీసీలకు సంబంధించిన అనేక హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై విసిగిపోయిన ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. కానీ, బీసీలకు హామీల విషయంలో ఏదీ చేయలేదు. గతంలో 50 శాతం ఉన్న బీసీలకు గాను 12 శాతం రిజర్వేషన్లు ఉంటే.. అందులో 10 శాతం ముస్లింలను చేర్చారు.
ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ఎంఐఎం నాయకులకు మేలు చేయాలని చేస్తోంది. ఇదే రేవంత్ ప్రభుత్వం కుట్ర.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టారు. ప్రజలను అనేక హామీలతో ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అప్పుపుట్టడం లేదని మోసం చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం ఖాయం. 42% రిజర్వేషన్లు అమలైతే దాదాపు 23,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ, కేంద్రంపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరువుల పరిరక్షణ, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టడం, మూసీ సుందరీకరణ పేరుతో కాలం గడిపి, ప్రజలను ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కోటి 65 లక్షల మంది బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్రంగా నష్టపోయి ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రానికి బిల్లు తీర్మానం పంపకుండానే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది.
రాష్ట్రంలో రిజర్వేషన్లు శాస్త్రీయంగా ఉంటే కోర్టు కూడా అంగీకరిస్తుంది. కానీ, బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా రిజర్వేషన్ల పేరుతో మభ్యపెడుతున్నారు. పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో బీసీలకు అనేక రకాలుగా మేలు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో బీసీలకు అన్యాయం చేసి, బీసీ కేటగిరిలో ముస్లింలకు టికెట్లు ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు? బీసీలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, బీసీలను బీజేపీకి దూరం చేయాలనే కుట్ర కాంగ్రెస్ చేస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు – రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ఏడాదికి రూ. 20,000 కోట్లు, ఐదేళ్లలో రూ. 1 లక్ష కోట్లు, 50 ఏళ్లు దాటిన పద్మశాలీలకు పింఛన్ సౌకర్యం, గజ్వేల్, సిరిసిల్లలో పవర్ లూమ్‌ల ఏర్పాటు, జ్యోతిబాపూలే సబ్ ప్లాన్ కింద రూ. 20,000 కోట్లు, బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖతో పాటు ఎంబీసీలకు ప్రత్యేక శాఖ, బీసీలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు,.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, కేవలం కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. 9వ షెడ్యూల్లో తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని చేర్చడమంటే దీన్ని సాగదీయడమంటే బీసీలను మోసం చేయడమే.
వాస్తవానికి 2007లో IR COELHO Vs STATE OF TAMILNADU కేసులో.. 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన వాటిపై సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేరిస్తే బీసీల రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని, కోర్టులు ప్రశ్నించలేవని మభ్యపెడుతున్నారు.
రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బిల్లును కేంద్రానికి పంపి, 9వ షెడ్యూల్ పేరుతో కాలయాపన చేస్తోంది. కేంద్రం ఆమోదం లేకుండానే రిజర్వేషన్లు అమలు చేయొచ్చు – మరి కాంగ్రెస్ ఎందుకు ఆలస్యం చేస్తోంది. దాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి ఎందుకు బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తోంది..?
నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. దేశంలో ఎంతమంది బీసీలను రాష్ట్ర అధ్యక్షులుగా, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా, కేబినెట్ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిందో సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో పరిస్థితి దయనీయంగా తరయారైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం కాదు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తుల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను అమలు చేసింది. ముఖ్యంగా, వృత్తిపరమైన ఉపాధి, వృత్తికారులకు ఆర్థిక సహాయం, స్కిల్స్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి), మార్కెటింగ్ మద్దతు తదితర రంగాల్లో పలు చర్యలు తీసుకుంది.
దివాళా తీసిన తెలంగాణ అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఐపీ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయనుకుని హామీలు ఇచ్చామని, ఖాళీ బిందెలు ఉన్నాయంటూ హేళనగా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి బిజెపి యే సరైన దారి చూపిస్తుంది, అభివృద్ధి బిజెపితోనే జరుగుతుంది. అందుకే బిజెపి ని,కేంద్రాన్ని బద్నాం చేయాలని రేంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాజకీయ నాటకాలాడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేసింది.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే పారదర్శకంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి. పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ వంటి బీసీ నాయకులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను మర్చిపోయారా ? ఇంకెంతకాలం బీసీలను మోసం చేస్తారు?
దేశంలో మొదటిసారిగా బీసీ ప్రధానమంత్రి అయ్యారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన బీసీ వర్గాలకు చెందిన కులవృత్తులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రంపై నెపం నెట్టేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను బహిర్గతం చేసి మండల స్థాయిలో ప్రజల ముందుకు వెళ్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్రలను ఎండగడతాం.