ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ

-తెలంగాణలో వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ
-ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న రేవంత్
-సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని విజ్ఞప్తి
-తక్షణ సాయంగా రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్
-11 లక్షల ఎకరాల్లో పంట మునిగిందని లేఖలో పేర్కొన్న టీపీసీసీ అధ్యక్షుడు

తెలంగాణలో వరదల పరిస్థితిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించి, తక్షణమే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను రాష్ట్రంలో మోహరించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ. రెండు వేల కోట్లు అందించాలని విజ్క్షప్తి చేశారు.

వరదలతో తెలంగాణ అతలాకుతలమైందని, రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. వరద పరిస్థితిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రేవంత్ విమర్శించారు. తెలంగాణలో ఎకరం పంట కూడా మునగలేదని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, ఈ విషయం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ నష్టం వాటిల్లిందని రుజువు చేస్తే కేటీఆర్‌ ముక్కు నేలకు రాసి, తెలంగాణ రైతులకు క్షమాపణ చెబుతారా? అని రేవంత్ సవాల్ విసిరారు.

భారీ వర్షాలకు 857 గ్రామాల్లో వరద నీరు చేరిందన్న రేవంత్.. రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతి స్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలన్నారు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనాలు, సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave a Reply