– తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానిపై టీడీపీ నేత డాక్టర్ రావ్ ఫిర్యాదు
– పార్టీ ఆఫీసులో బాబుకు వ్యతిరేకంగా కుట్రకు తెరలేపారు
– లోకేష్‌కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని ఉసిగొల్పారు
– పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని తీర్మానం చేయించారు
– నేను వ్యతిరేకిస్తే నన్ను తన అనుచరులతో కొట్టించారు
-బాబు, కంభంపాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
– కమ్మ వాళ్లు పార్టీని నాశనం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు
– పార్టీ గురించి చంద్రబాబు కంటే జ్ఞానేశ్వర్‌కు ఎక్కువ తెలుసా?
– గెలిచే పరిస్థితి లేదనే బాబు పోటీ వద్దన్నారు
– పార్టీ నేతు ఆర్ధికంగా నష్టపోకూడదన్నదే బాబు భావన
– బాబు బయటకు వస్తేనే కదా పార్టీకి భవిష్యత్తు
– బాబు కంటే ఎన్నికల్లో పోటీ ముఖ్యమా?
– నన్ను చంపేందుకు గతంలో కూడా ప్రయత్నించారు
– పార్టీని కొన్నానని కాసాని చెబుతున్నారు
– జ్ఞానేశ్వర్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోండి
– బంజార్‌హిల్స్‌లో కాసాని సహా పలువురిపై ఫిర్యాదు
– బీఆర్‌ఎస్‌కు టీడీపీని అమ్మాలని చూసిన జ్ఞానేశ్వర్
– కాసాని కుట్రలు బయటపెడతా
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావ్ సంచలన ఆరోపణలు
– పార్టీ ఆఫీసులో డాక్టర్ రావ్‌పై మూకుమ్మడి దాడి
– వైరల్ అవుతున్న దాడి వీడియోలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదన్న నాయకత్వ నిర్ణయంపై ఆ పార్టీలో దుమారం రేగుతోంది. రాజమండ్రి జైలులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పోటీకి సంబంధించి తనతో మాట్లాడిన అంశాలపై చర్చించేందుకు, తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సందర్భంలో పార్టీ అధికార ప్రతినిధి, గోషామహల్ ఇన్చార్జి డాక్టర్ ఏఎస్ రావుపై కాసాని అనుచరులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. దాడికి సంబంధించిన వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తనపై దాడికి పార్టీ అధ్యక్షుడు కాసాని సహా మరికొంతమంది కారణమంటూ డాక్టర్ రావు, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏఎస్ రావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదివారం కాసాని నిర్వహించిన సమావేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు వ్యతిరేకంగా నిర్వహించిందేనని డాక్టర్ రావు మీడియాకు వెల్లడించారు. తాను పోటీ చేయాలని చెప్పినా చంద్రబాబు వినలేదని, కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చకూడదని చెప్పి తనను సముదాయించారని కాసాని చెప్పారు.
పోటీ వద్దని చెప్పిన లోకేష్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని, ఆయన ఇంటివద్దకు వెళ్లాలని పార్టీ నేతలను ఉసిగొల్పారని, డాక్టర్ రావు మీడియాకు వెల్లడించారు. ‘ కాసాని పార్టీకి వ్యతిరేకంగా తీర్మానం చేయించే ప్రయత్నం చేశారు. నేను బీ ఫారం ఇస్తా. ఏ ఫారం చంద్రబాబు ఇవ్వాలన్నారు. నేను ఆ తీర్మానం కాపీపై పెన్నుతో అడ్డంగా గీసి బయటకు వెళ్లా. పార్టీ గురించి చంద్రబాబు కంటే మీకు ఎక్కువ తెలుసా అని ప్రశ్నించి బయటకు వెళ్లా. పార్టీ ఆఫీసు వెనుక కాసాని ఆదేశాలతో ఆయన గుండాలు నాపై దాడి చేశారు. నన్ను కిందపడేసి కొట్టారు. నేను 100కు ఫోన్ చేసి పొలీసులకు ఫిర్యాదు చేశా. నన్ను గతంలో కూడా చంపాలని కాసాని చూశారు. అధికార ప్రతినిధుల మీటింగులకు కూడా నన్ను రానివ్వలేదు. అది మీడియాలో కూడా వచ్చింది. నేను తెలంగాణలో పార్టీని వంద కోట్లకు కొనుక్కున్నా. చంద్రబాబు కూడా నన్నేమీ చేయలేరు. కమ్మవాళ్లే ఇంకా పార్టీలో పెత్తనం చేస్తున్నారని కాసాని అందిరకీ చెబుతున్నాడు. నాపై దాడిని ప్రోత్సహించిన కాసానిపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశా’నని డాక్టర్ రావు వెల్లడించారు. తనను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారని రావు వివరించారు.
తనపై కాసాని ప్రోద్బలంతో దాడి చేసిన కాసాని మామ భిక్షపతి ముదిరాజ్, ప్రకాష్ ముదిరాజ్, బంటు వెంకటేశం, ఐలయ్యయాదవ్, ప్రశాంత్‌యాదవ్, రవీంద్రాచారి సహా మరికొందరిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ రావు, పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
నిజానికి డాక్టర్ రావును, చాలాకాలం నుంచి పార్టీ సమావేశాలకు ఆహ్వానించడం లేదు. ఇటీవల కాసాని నిర్వహించిన సమావేశానికి ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్న వైనం మీడియాలో హాట్‌టాపిక్ అయింది.
తెలంగాణలో టీడీపీని బీఆర్‌ఎస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేందుకు కాసాని కేసీఆర్‌తో ఒప్పందం చేసుకున్నారని, డాక్టర్ రావు చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. టీడీపీని సమాధి చేసేందుకే కాసాని ఒక వ్యూహం ప్రకారం టీడీపీలో చేరారన్నారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు వ్యతిరేకంగా, గోషామహల్ నియోజకవర్గంలో మరొక నేతను కాసాని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు, కంభంపాటి రామ్మోహన్‌రావుకు వ్యతిరేకంగా పార్టీ నేతలతో మాట్లాడే జ్ఞానేశ్వర్ తీరును, తాను చాలాసార్లు తప్పు పట్టానని డాక్టర్ రావు చెప్పారు. కాసానికి తనపై కక్ష అదేనన్నారు. పార్టీ మీటింగులలో బూతులు మాట్లాడతారని వెల్లడించారు. కాసాని రహస్య అజెండాను బయటపెడతానన్నారు.
‘తెలంగాణ లో పార్టీ బలంగా లేదు. పైగా మా సార్ జైలులో ఉన్నారు. ఇది పోటీ చేసే సందర్భం కాదు. అందుకే పోటీకి పెట్టి నాయకులను ఆర్దికంగా నష్టపరచకూడదన్న ఉద్దేశంతోనే, బాబుగారు పోటీ చేయకూడదని నిర్ణయించారు. పైగా ప్రచారానికి తగిన సమయం లేదు. కానీ కాసాని నేతలను పార్టీపై ఉసిగొల్పడం క్రమశిక్షణా రాహిత్యం. అసలు పార్టీ గురించి చంద్రబాబు కంటే జ్ఞానేశ్వర్‌కు ఎక్కువ తెలుసా?’ అని డాక్టర్ రావు ప్రశ్నించారు.
కాసానికి నిజంగా టీడీపీపై చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లుగా ఉన్న తన కోడలు, కొడుకులతో రాజీనామా చేయించి, వారిని ఎందుకు టీడీపీలోకి ఎందుకు తీసుకురాలేదు. అంటే బీఆర్‌ఎస్‌తో కాసాని కుటుంబానికి ఇంకా అనుబంధం ఉందన్నమాటే కదా’ అని డాక్టర్ రావు ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు పార్టీ మీడియా చైర్మన్‌గా ప్రకాష్‌రెడ్డిని నియమిస్తే, ఆయనను పక్కనపెట్టి తన భూముల కేసులు చూసే వ్యక్తికి మీడియా బాధ్యతలు అప్పచెప్పారని డాక్టర్ రావు ఆరోపించారు. ఆ వ్యక్తి తాను నక్సలైట్లలో పనిచేశారని చెబుతూ అందరినీ బెదిరిస్తున్నారన్నారు.
కాసాని నియమించిన మీడియా ఇన్చార్జి సీనియర్లను అవమానిస్తున్నారని, చివరకు చంద్రబాబు నియమించిన ప్రకాష్‌రెడ్డిని కూడా పక్కనపెట్టారంటే, టీడీపీలో కాసాని పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ‘ఇవన్నీ నేను మీడియా ముందుకు వచ్చి చెబుతా. బీఆర్‌ఎస్‌తో కాసాని మ్యాచ్‌పిక్సింగ్‌ను బట్టబయలు చేస్తా’ అని డాక్టర్ రావు వెల్లడించారు.