కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకుంటే రూ.2లక్షల బీమా: రేవంత్‌

రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్‌ సభ్యత్వాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమని అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న అగ్రనేత రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు.
కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని.. 14 నుంచి 21 వరకు గ్రామాల్లో ‘కాంగ్రెస్‌ జన జాగరణ’ యాత్రలు చేపట్టాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 9న పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాహుల్‌గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ సభ్యత్వం అంటే ఒక గౌరవమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి దేశాభివృద్ధికి పాటుపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.