Suryaa.co.in

Andhra Pradesh

అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా

– రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేసిన బడ్జెట్
– పతనమైన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసే దిశగా బడ్జెట్
– ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అభినందనలు
– వైద్య ఆరోగ్య, వైద్య విద్యకు రూ.19,265 కోట్లు
– డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.4,000 కోట్లు
– మొత్తం బడ్జెట్ లో వైద్య ఆరోగ్యానికి దాదాపు 6 శాతం కేటాయింపులు
– 2023-24తో పోలిస్తే ఏకంగా రూ.1420 కోట్లు (29శాతం )అదనం
– 2025-26 బడ్జెట్ పై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

అమరావతి: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ముందడుగు వేయటం వంటిదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ పై మంత్రి స్పందించారు.

కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివ్రుద్ధి వంటి వాటిని సమతుల్యం చేసేందుకు జరిగిన ప్రయత్నమన్నారు. 2019-24లో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టి అభివ్రుద్ధి దిశగా, పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు వున్నాయన్నారు.

ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారనీ , ఈబడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించినందుకు ఎన్డీయే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాననీ మంత్రి తెలిపారు. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపులో దాదాపు 6% మేర ఉందన్నారు. ఇది 2024-25 కంటే దాదాపు 4% ఎక్కువ అని అన్నారు. 2025-26 సంవత్సరానికి ఆరోగ్య రంగానికి కేటాయింపు, 2023-24 కంటే 29% ఎక్కువగా వుందని మంత్రి పేర్కొన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమాను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి ప్రకటించడం హర్షణీయమన్నారు. అదే విధంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,000 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.2,299 కోట్లు, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం రూ.1,158 కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు.

2019-24లో మొత్తం ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ బడ్జెట్, ‘ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన’ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. వివిధ రంగాలకు వనరులను జాగ్రత్తగా కేటాయించడం ద్వారా అందుబాటులో ఉన్న వనరుల నుండి గరిష్ట ప్రయోజనం పొందేందుకు నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ బడ్జెట్ ప్రతిపాదనలని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో, ఆర్థిక, ఆదాయ లోటును అదుపులో ఉంచడానికి ఆర్థిక క్రమశిక్షణ సూత్రాలకు కట్టుబడి ఉండటానికి ఆర్థిక మంత్రి చేసిన ప్రయత్నాలను బడ్జెట్ ప్ర‌తిబింబించిందన్నారు.

ఇది 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాకారానికి మార్గాన్ని చూపుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల ఆశలు మరియు ఆకాంక్షల సాకారంలో కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందనే విశ్వాసాన్ని బడ్జెట్ కలిగిస్తోందన్నారు. వివిధ రంగాలకు అవసరమైన నిధుల కేటాయింపు ద్వారా బడ్జెట్ సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేసే విషయంలో కూటమి ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తోందని మంత్రి తెలిపారు.

వివిధ వర్గాల ప్రజల సంక్షేమం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పుణ్యాభివృద్ధి, మూలధన వ్యయం కోసం పెరిగిన కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల ప్రమోషన్ వంటి ప్రాధాన్యతా రంగాలకు బడ్జెట్ కేటాయింపులలో ఈ లక్ష్యం ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. 2025-26 బడ్జెట్‌లో మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఒక మంచి ఉద్దేశ్యంతో బాధ్యతాయుతమైన 2025-26 బడ్జెట్‌ను రూపొందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత‌ను తాను అభినందిస్తున్నానని మంత్రి స‌త్య‌కుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE