-డా. బి.ఆర్. అంబెడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ లు దళితులకు రెండు కళ్లు..
-ఏపి స్టడీ సర్కిల్ ద్వారా విజయవాడలో గ్రూప్-1, 2 లకు, వైజాగ్ లో సివిల్స్ కు, తిరుపతిలో బ్యాంకు పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం..
-2023 ఏప్రిల్ నాటికి విజయవాడలో 225 అడుగుల డా. బి.ఆర్. అంబెడ్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించనున్నాం..
-గత మూడు సంవత్సరాల్లో విద్యా రంగానికి రూ. లక్ష కోట్లు కేటాయించాము..
-ఈ సంవత్సరం ఎస్.సి. కార్పొరేషన్ కు రూ. 7,350 కోట్లు కేటాయించాం ..
-రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్..
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాబూ జగజ్జీవన్ రామ్ 114వ రాష్ట్రస్థాయి జయంతి మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ… డా. బీఆర్ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వీరిద్దరి జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాలలో చేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు.
చిన్నతనం నుండే బాబూ జగ్జీవన్ రామ్ కి పోరాటతత్వం ఎక్కువని, సమాజంలోని సాంఘిక అసమానతలను తొలగించడానికి పోరాటాలు చేశారని మంత్రి విశ్వరూప్ అన్నారు. రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడని, 5 దశాబ్ధాల పాటు పార్లమెంటెరియన్ గా వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తూ ఆ శాఖలకే వన్నె తెచ్చిన మేరునగధీరుడు బాబూ జగ్జీవన్ రామ్ అని ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు.
సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేలా చర్యలు తీసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వేలాది కోట్లు నేరుగా (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్) వారి బ్యాంకు ఖాతాలకు అందిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ లో ఎస్సీ కార్పోరేషన్ కు నిధులు కేటాయించలేదని చాలామంది అపోహ పడుతున్నారని.. అది పూర్తిగా అవాస్తవమని, ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది కాబట్టి విడిగా చూపించలేదన్నారు. ఎస్సీ కార్పోరేషన్ కు రూ.7214.81 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో ఎస్సీ కార్పోరేషన్ పేరు మీద రుణాలు మంజూరు కేవలం సబ్సిడీ మాత్రమే ఇచ్చేవారని చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద మొత్తం రూ.8,518.29 కోట్లు బడ్జెట్ కేటాయించామని తెలిపారు. 2022-23 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ అండ్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లకి మొత్తం కలిపి రూ.9,225.27 కోట్లు కేటాయించమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం ఎనలేని కృషిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో జగనన్న ప్రభుత్వాన్ని వెలెత్తిచూపే అవకాశం ఏ ఒక్కరికీ లేదన్నారు. గత ప్రభుత్వం 634 హాస్టల్స్ ను మూసివేస్తే.. వాటిలో చాలావరకు ఈ ప్రభుత్వం పునరుద్దరించామన్నారు. హాస్టల్స్ ను సచివాలయాలుగా మారుస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా హాస్టల్ ను సచివాలయాలుగా మార్చలేదన్నారు. వైఎస్సార్ పెన్షన్లలో 10లక్షల 20 వేల మంది ఎస్సీలు లబ్ధి పొందుతున్నారని.. వృద్ధులు, వితంతవులు, కళాకారులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, మత్స్యకారులు, కళ్లు గీత కార్మికులు, పక్షవాత రోగులు, డప్పు కళాకారులు, తలసేమియా బాధితులు, కుష్టు రోగులు.. భారతదేశ చరిత్రలో ఇన్ని రకాల పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ 100 శాతం సంతృప్తి స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 14 లక్షల నుంచి 63 లక్షల మందికి పెన్షన్లు తీసుకెళ్లిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అయితే.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 63 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు. దళితుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. విశాఖలో సివిల్స్ కోచింగ్ సెంటరు, తిరుపతిలో బ్యాంకింగ్ కోచింగ్ సర్వీస్ సెంటరు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో విజయవాడలో గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తామని తెలిపారు.
ఏపీ స్డడీ కోచింగ్ సెంటర్ల ద్వారా నాణ్యమైన కోచింగ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో రూ.268 కోట్లతో 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 2023, ఏప్రిల్ 14వ తేదీ నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్య పథకంలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నివేదికలు ఇచ్చారని.. కాపు కార్పోరేషన్ లో అవకతవకలు జరిగాయని.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విషయంలో ఒక్క రిమార్క్ కూడా లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాల్లోనూ కోతలు పెట్టలేదని.. అవినీతిని రూపుమాపి మరింత పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో మండలానికి 30 చొప్పున దాదాపు 30 వేల ఎస్సీ కార్పోరేషన్ రుణాలు ఇచ్చేవారని.. ఈ ప్రభుత్వం 3.5 లక్షల మందికి నేరుగా లబ్ధి అందజేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ముఖ్యమంత్రి రాజీలేని పోరాటం చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను గత రెండు సంవత్సరాలలో కరోనా మహమ్మారి ప్రబలిన కారణంగా నేరుగా
జరుపుకోలేకపోయామని, ఈ రోజున ఇంత ఘనంగా జయంతి మహోత్సవాన్ని నిర్వహించడం మదావహం అన్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ది జరగుతుందనే డా. బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా దళితుల అభ్యున్నతికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యరంగంలో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు-నేడు వంటి పథకాల ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో లక్ష కోట్లు విద్యాభివృద్ధి కేటాయించిందని తెలిపారు.
విద్యారంగానికి పెద్ద పీట వేశామన్నారు. నాయకులను కులాల వారీగా విభజించడం సరికాదన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్లు అని తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగల వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారికి రావాల్సిన వాటా వారికే చెందాలనే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వారి భవిష్యత్ కోసం దళిత ఉప కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని, వాటిని అందరూ గమనించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమతావాదాన్ని అమలు చేసిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమీషన్ ఛైర్మన్ యం. విక్టర్ ప్రసాద్, ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ మాల కార్పోరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజి, ఎస్సీ రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ వడ్డాది మధుసూధనరావు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, డైరెక్టర్ కె. హర్షవర్థన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్. డిల్లి రావు, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, డీఆర్వో కె. మోహన్ కుమార్, న్యాయవాది డా. పి.వి. రత్నం, నాయకులు మాల్యాద్రి, వివిధ దళిత సంక్షేమ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.