ఈ ఏడాదైనా ప్రజాస్వామ్యయుతంగా పాలించండి

Spread the love

– జగన్‌కు వర్ల లేఖ

కనీసం ఈ ఏడాదయినా ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. లేఖ పాఠం ఇది.

గడచిన సంవత్సరం రాష్ట్రప్రజలకు ఒక పీడకల.
నీ అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు గడిచిన సంవత్సరం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
ఈ నూతన సంవత్సరమైనా ప్రజాస్వామికంగా పరిపాలించి రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి సహకరించండి.

అయ్యా!
గత సంవత్సరం రాష్ట్రప్రజలందరికీ ఒక పీడకలగా మిగిలింది. మీ అప్రజాస్వామిక పాలనతో రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రజలందరూ గడచిన సంవత్సరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా కాలం వెళ్లబుచ్చారు. శాంతిభద్రతలు గత సంవత్సరం పూర్తిగా క్షీణించాయి. అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా మారి అప్పుల రాష్ట్రంగా భారతదేశంలో పేరుగాంచింది. సాక్షాత్తు మీ ఆర్థిక శాఖామంత్రి సంవత్సరంలో తొమ్మిదినెలలు డిల్లీలోనే మకాంవేసి అప్పులకోసం కేంద్రాన్ని, ప్రపంచబ్యాంకును దేబరించడం మనం చూశాం. మీ అస్థవ్యస్థ పరిపాలనతో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖ తమ విధులు పూర్తిగా విస్మరించి అసాంఘిక వ్యవహారాలకు ఊతమిచ్చారు.

అందుకే గత సంవత్సరం మన రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళలపై నేరాలు 21.45శాతం, ఎస్సీ,ఎస్టీలపై నేరాలు 4.37శాతం, చోరీలు,దొంగతనాలు 15.37శాతం, భౌతిక దాడులు 5.81శాతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించి కేసులు 73శాతం పెరిగిపోయి మత్తుపదార్థాల కారణంగా 2021లో 385మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటాయనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి ముఖ్యమంత్రి గారూ?

2021లో రెండోదశ కరోనా కారణంగా 14,431 మంది అధికారికంగా మృతిచెందగా, కేంధ్ర హోంమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో దేశంలో మరెక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిహారం కోసం 28,468 దరఖాస్తులువచ్చాయని తెలిపింది, దీనికి ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారూ? కరోనా బాధితులకు వైద్యం అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వం… కరోనా మృతులకు కనీసం అంతిమసంస్కారాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులు వెలుగుచూశాయి. ఇదివరకెన్నడూ లేనివిధంగా మీ హయాంలో రాష్ట్రంలోని 145చోట్ల దేవాలయాలపై దాడులు జరిగినా, రామతీర్థంలో కోదండరాముని విగ్రహం తలనరికినా ముద్దాయిలను పట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకంటే కక్షసాధింపుకే అధిక ప్రాధాన్యత ఇచ్చి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి తెరతీశారు. సిబిఐ, ఈడి కేసులు కోర్టుల్లో విచారణ వేగవంతమైన నేపథ్యంలో మీరు ఎప్పడు జైలుకెళ్తారో, బయటపడతారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని కక్షసాధింపు కోసం కాకుండా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఉపయోగించాల్సిదిగా కోరుతున్నాను.

ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రప్రజలకు గత సంవత్సర చేదు అనుభవం, భయానక వాతావరణం, శాంతిభద్రతల లేమి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోండి. మీపై ఉన్న కేసుల విచారణ కూడా వేగవంతమవుతున్న నేపథ్యంలో పాపం మీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. అటు జైలా, ఇటు బయటా అన్న మీమాంస మీకు, రాష్ట్రప్రజలందరికీ ఉంది. ఈ నేపథ్యంలో మీరు పెద్దమనసుతో ఈ నూతన సంవత్సరం అయినా ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ స్పూర్తితో పరిపాలన చేయండి. కక్ష, కార్పణ్యాలు, పగ, ద్వేషాలు విడనాడండి. శాంతియుత వాతారణంలో నూతన సంవత్సరం గడిచేట్లుగా చూడండి. ప్రజలందరూ తమకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులు స్వేచ్చగా అనుభవించేటట్లుగా తగు పరిస్థితులు కల్పించండి. రాష్ట్రం అధఃపాతాళానికి వెళ్లకుండా కాపాడండి. ప్రజాసంక్షేమం పట్ల దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోడానికి ప్రయత్నించండి.

ఇట్లు
వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మరియు పొలిట్ బ్యూరో సభ్యులు

Leave a Reply