-మతి భ్రమించిన చంద్రబాబు. ఇష్టానుసారం మాటలు
-నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు
-అందుకే తనకు తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట
-దుర్గమ్మ అమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు
-మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి
-కానీ చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయి
-నిన్నటి నుంచి ఆయన మాటలే అందుకు నిదర్శనం
-ఒక ఉన్మాదిలా మారి బరితెగించి వ్యవహరిస్తున్నాడు
-ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సీఎంగారిని నిందిస్తున్నారు
-రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్
తాడేపల్లి: ప్రెస్‌మీట్‌కు ముందు, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన వీడియో చూపిన సజ్జల రామకృష్ణారెడ్డి.ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..:
ఇన్నాళ్లూ అవి లేవా? లేక కోల్పోయాడా?:
నిన్న 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు మనసులో నుంచి వచ్చిన మాట ఇది. ఇప్పుడు మీరు విన్నారు చంద్రబాబు నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి దర్శించుకుని ఆయన ఏం చెప్పారన్నది. తనకు శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. మరి అవి ఇన్నాళ్లూ లేవా? లేక కోల్పోయాడా? గత 40 ఏళ్లుగా తనకు తెలివిలేదు. ఇప్పుడు కొత్తగా కావాలని దుర్గమ్మను కోరినట్లు ఆయన మాటల ద్వారానే తెలుస్తుంది.
ఆయనింకా రాజకీయాల్లో ఉండాలా?:
నిజానికి ఆయనకు మంచి మనసు, మంచి ఆలోచనలు ఉంటే కచ్చితంగా ఆ దుర్గమ్మ కరుణ ఉంటుంది. దానికి తగినట్లు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే ఆయనకు లేని తెలివితేటలు అర్జెంటుగా రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా, సుబిక్షంగా ఉండాలన్నా, కుట్రలు, కుతంత్రాలకు ప్రజలంతా దూరంగా ఉండాలన్నా ఇలాంటి వారు రాకూడదు. వారిపై ఏ దేవుడి అనుగ్రహం ఉండకూడదని అనుకుంటున్నాం.
ఆయనకు నిజంగా మంచి ఆలోచనలు ఉంటే, నిన్న అమ్మవారి గుడికి పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, వ్యవహారశైలి, ప్రజల గురించి అవహేళన మాటలు చూస్తుంటే, ఆయన రాజకీయాల్లో ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉందా? అనిపిస్తుంది.
విషం కక్కడమే చంద్రబాబు పని:
ఒక అబద్ధాన్ని నిజంగా చూపాలని, అది ప్రజల్లోకి వెళ్తుందా లేదా అన్నది కూడా ఆయన పట్టించుకోవడం లేదు. అదే పనిగా విషం కక్కుతున్నాడు. నిన్న ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే..
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందని, తద్వారా ప్రభుత్వంపై రూ.800 కోట్ల భారం వేశారని సీఎం శ్రీ వైయస్ జగన్‌గారిని చంద్రబాబు నిందిస్తున్నారు. సంధి ప్రేలాపనలా, మతి భ్రమించి ఆయన మాట్లాడుతున్నాడు. తన హయాంలో చేసిన అక్రమాల ఫలితమే ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోవడం.
స్పిల్‌వే పూర్తి చేయకుండానే కుడి, ఎడమ కాఫర్‌డ్యామ్‌లు మధ్యలో వదిలేసి కట్టి, కొన్ని నీళ్లు నిల్వ చేసి, పంటలకు నీళ్లిచ్చినట్లు చూపి, 2019 ఎన్నికల్లో లాభం పొందాలని చేసిన కుతంత్రం వల్లనే ఇవాళ డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. దీనికి 100 శాతం బాధ్యత తనదే అయినా, చంద్రబాబు కావాలని సీఎంగారిపై నిందలు వేస్తున్నారు. యథావిథిగా అబద్ధాలు చెబుతున్నారు.
మళ్లీ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే మళ్లీ నీళ్లు తోడాలి. ఎలా కట్టాలో కూడా నిపుణులకు అర్ధం కావడం లేదు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఆ పనులను అస్తవ్యస్తం చేశారు. అంతకు ముందు పట్టిసీమ దగ్గర కూడా అదే చేశారు. మెఘా సంస్థ నుంచి మోటర్లు తెచ్చి తోడి, విజయవాడకు తరలించి, కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేశానని ప్రచారం చేసుకున్నాడు.
ఇప్పుడు మరీ దారుణంగా..:
అంతకు మించిన మరో మాటలు. ఏ సీనియర్ నాయకుడు మాట్లాడకూడని విధంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.
ఒంగోలులో ఆర్టీఏ అధికారులు ఒక వాహనాన్ని, సీఎం కాన్వాయి కోసం స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారం. ఆ వి«షయం తెలియగానే సీఎం స్పందించారు. ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. కానీ చంద్రబాబు నోటికి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు.
‘ఎవరైనా అమ్మాయిని తీసుకు రమ్మంటే ఇంట్లో నుంచి లాక్కుని వస్తారా? అని పోలుస్తూ మాట్లాడడం అతి దారుణం. ఎవరో కింద ఉద్యోగి చేసిన తప్పిదాన్ని, పెద్దగా చూపి, రాష్ట్రంలో ఏదో జరిగినట్లు చెప్పడం అత్యంత దారుణం. తాను ఒక మాజీ సీఎం అన్న విషయం కూడా చంద్రబాబు మర్చిపోతున్నారు.
ఉన్మాదిలా వ్యవహారం:
ఉన్మాదిలా మారిన చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడు. ఆయనకు ఏదీ పట్టదు. ఆనాడు అత్యధిక మెజారిటీతో గెల్చిన తన మామకు వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో సీఎం పీఠంపై కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్మాదస్థాయి కూడా దాటి పోయాడు.
నువ్వు ప్రభుత్వాధినేతగా 14 ఏళ్లలో చేసిన అరాచకాలు ఒక్కసారి గుర్తు చేసుకో. నవనిర్మాఱ దీక్షలు, ధర్మ పోరాట దీక్షల పేరుతో చేసిన దారుణాలను జనం ఇంకా మర్చిపోలేదు. ఒక వైపు వందల కోట్లు వ్యయం. మరోవైపు ఎక్కడ దీక్ష జరిగితే, ఆరోజు అక్కడ స్కూళ్లన్నీ మూతే. బస్సులు, ఆటోలు బలవంతంగా మళ్లించారు. చివరకు విజయవాడ బెంజి సర్కిల్‌లో దీక్ష చేస్తే, జాతీయ రహదారి పూర్తిగా జామ్ అయింది.
అప్పుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వం సొమ్ము వందల కోట్లు వ్యయం. ఉన్మాదం అంటే అది. లెక్కలేనితనం, బరితెగింపు అంటే అది. అందుకే 2019 ఎన్నికల్లో నిన్ను జనం ఎత్తి చెత్తబుట్టలో పడేశారు.
ఇది బాధ్యత కలిగిన ప్రయత్నం:
కానీ ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే, ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు రోజూ విషం కక్కుతున్నారు. అదేపనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోతున్నారు. విధానాల పరంగానూ, తప్పులు సవరించడంలోనూ, వ్యవస్థలను చక్కదిద్దడంలోనూ జగన్‌గారు చిత్తశుద్దితో పని చేస్తున్నారు. రాజకీయ పదవులు, మంత్రి పదవుల్లో పూర్తి సామాజిక న్యాయం పాటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేశారు.
అడ్డూ అదుపూ లేని మాటలు:
ఇవన్నీ వాస్తవాలు కాగా, చంద్రబాబు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. రైతులు ఉరి వేసుకోవద్దు. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలని పిలుపునిస్తున్నాడు.
నిజానికి ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తోంది. పెట్టుబడి సాయం చేస్తోంది. మూడేళ్లు కూడా పూర్తి కాకముందే పెట్టుబడి సాయంగా రూ.20 వేలకు పైగా కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. అలాగే కౌలు రైతులకు కూడా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, అన్ని ప్రయోజనాలు కల్పించడం జరుగుతోంది.
విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు అడుగడుగునా అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి.
కానీ అదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పారు. 2019 ఎన్నికలు వచ్చే సరికి ఎక్కడెక్కడి నిధులో మళ్లించి పసుపు కుంకుమ పేరుతో డబ్బు పంచారు.
ఏదో జరిగిపోతున్నట్లు విమర్శలు:
అలాంటి వ్యక్తి రోజూ ఏదో ఒకటి మాట్లాడడం. ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా విరుచుకుపడడం. ఎక్కడ, ఏం జరిగినా, రాష్ట్రంలో ఏదో జరిగి పోతోందని చెప్పడం, తన అనుకూల మీడియాలో ప్రచారం చేయడం. కార్యక్రమాలు నిర్వహించడం అలవాటుగా మారింది.
తాజాగా రేషన్ బియ్యంపైనా అదే విమర్శ. బియ్యం వద్దనుకుంటున్న వారికి నగదు ఇవ్వాలన్న ఆలోచనపై, ప్రయోత్మాకంగా మొదలు పెట్టకముందే చంద్రబాబు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. అదే బాటలో బీజేపీ నేతలూ నడుస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే అసలు చంద్రబాబుకు మతి స్థిమితం పోయినట్లుంది. కాబట్టి, అది ఇప్పించమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దుర్గమ్మను కోరుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.