Suryaa.co.in

Features

సనాతన ధర్మం: మతం – మతోన్మాదం!

సనాతన ధర్మం”పై మాట్లాడే స్వేచ్ఛను హరించే రీతిలో కొన్ని మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. మత విశ్వాసం వేరు. మతోన్మాదం వేరు. ప్రజల్లో బలంగా వెళ్ళూనికొని ఉన్న మతాన్ని ధ్వంసం చేయడం సమకాలీన ప్రపంచంలో అసాధ్యం.

ఏ ధర్మమైనా సమాజ ప్రగతికి అవరోధంగా నిలిస్తే ఆ ధర్మం కాలగర్భంలో కలిసిపోతుంది. అది మత ధర్మమైనా, రాజ్యాంగ ధర్మమైనా.

అమానుషమైన అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, దేవాలయాల్లో ప్రవేశానికి కొందరిని అనర్హులుగా పరిగణించబడే వివక్షత, ఇవన్నీ నేడు రాజ్యాంగపరంగా, చట్టపరంగా నేరాలు.

శవాలను పూడ్చి పెట్టాలని కొందరి విశ్వాసం. కట్టెలతో కాల్చాలని కొందరి విశ్వాసం. పూడ్చాలంటే నేడు స్మశానవాటికలకు భూమిలేని దుస్థితి, కాల్చాలంటే కట్టెలు లభించని దుస్థితి నెలకొన్నది. నగరాలలో విద్యుత్ శ్మశానవాటికలు వినియోగంలోకి వచ్చాయి. కర్మకాండలు నిర్వహించడానికి మంత్రాలు జపించే బ్రాహ్మణుల కొరత జఠిలంగా మారుతున్నది.

పురాణాల్లో ప్రబోధించిన మరియు పాత తరం విశ్వాసించిన సనాతన ధర్మం మేరకు వివాహం, కర్మకాండ, పూజలు – పునస్కారాలు, యాగాలు – యజ్ఞాలు నిర్వహించే పండితులకు కరవే. పర్యవసానంగా వివాహ వ్యవస్థలో, కర్మకాండ వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి.

సముద్రం దాటడం అరిష్టమని విశ్వసించే వారు. ప్రపంచీకరణ ప్రక్రియ ఆ విశ్వాసాన్ని కనుమరుగు చేస్తున్నది. ఇప్పటికీ ఆ మూఢనమ్మకంతో కొందరు ఉండవచ్చు.

బ్రాహ్మణ భావజాలాన్ని పెంచి పోషించాలని కొందరు ఉబలాటపడుతుండవచ్చు! కానీ, నేటి ఆధునిక సమాజం దానికి అంగీకరిస్తుందా! వర్ణ వ్యవస్థ పునాదులపై నిర్మించబడిన కుల వ్యవస్థ సమాజాభివృద్ధికి పెద్ద అవరోధంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సమాజమే దానికి ప్రబల నిదర్శనం. ఈ దుస్థితి ఇలాగే కొనసాగాలా?

మాట్లాడే వారు లేక కొన్ని భాషలే అంతరించి పోయాయి. శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి – విస్తరణ జరిగే కొద్దీ సనాతన ధర్మంగా పేర్కొనబడే అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఆచరించే వారు లేకపోతే అవి కాలం చెల్లిపోకతప్పదు. హేతుబద్ధమైన చర్చలో నిలబడలేని, ప్రశ్నలకు సమాధానం చెప్పి, సత్యాన్ని రుజువు చేయలేని మూఢ నమ్మకాలు – విశ్వాసాల మనుగడ ప్రశ్నార్థకమే కదా!

చంద్రుడు దేవుడని నిన్న, మొన్నటి వరకు నమ్మారు. శాస్త్ర సాంకేతిక విప్లవంతో మానవుడు చంద్ర మండలంపై అడుగు పెట్టాడు. సూర్యుడి వైపు దృష్టి సారించి ప్రయోగాలు చేస్తున్నాడు. సైన్స్ ను నమ్మని వాళ్ళు, శాస్త్ర – సాంకేతిక ఫలాలను మాత్రం సొంతం చేసుకొంటున్నారు, లబ్ధి పొందుతున్నారు, సంపదను పోగేసుకొంటున్నారు, అనుభవిస్తున్నారు.

సనాతన ధర్మం ముసుగులో మతాన్ని ఆయుధంగా చేసుకొని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలనే దుష్టశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శాస్త్రీయ విజ్ఞానం ప్రగతికి బాటలు వేస్తుంది, మనిషిని ముందుకు నడిపిస్తుంది. సనాతన ధర్మం ఆలోచనలకు, ఆచరణకు కళ్ళెం వేస్తుంది. ఆలోచించండి.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE