Suryaa.co.in

Telangana

నేనున్నా మీరు ధైర్యంగా ఉండండి

-షాద్ నగర్ లో సాత్విక్ తల్లిదండ్రులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా
-న్యాయ సహకారం అందిస్తానంటూ షాద్ నగర్ బాధితులకు హామీ
-కార్పొరేట్ విద్యాసంస్థల వెనుక ఉన్న పెద్ద మనుషులను భరతం పడతానంటూ హెచ్చరిక

‘‘మీ బాబు చనిపోయినందుకు చాలా బాధగా ఉంది.. మీరేం భయపడవద్దు మీకు న్యాయం జరిగేలా చూస్తా.. మీరు ధైర్యంగా ఉండండి.. నేనున్నాను. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బడా బాబుల భరతం పడతాం’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ నార్సింగిలోని చైతన్య కళాశాల ఘాతుకానికి బలైన విద్యార్థి సాత్విక్ నాగుల రాజు దంపతులకు భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రులు నాగుల రాజు దంపతులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి మాట్లాడారు.

తమ కుమారుడు సాత్విక్ ప్రాణాన్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వాపోయిన నాగులరాజు దంపతులు తన కుమారుడికి పట్టిన గతి మరో విద్యార్థి జరగకుండా కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ ను కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీ ఘాతుకంవల్ల కన్నకొడుకును కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ కేసును ఇంతటితో వదిలేది లేదని, అవసరమైతే సాత్విక్ కేసుకు సంబంధించి బిజెపి లీగల్ సెల్ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. సాత్విక్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని స్థానిక నేత ఏపీ మిథున్ రెడ్డిని ఆదేశించారు.

LEAVE A RESPONSE