– నియామక ఉత్తర్వులను జారీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 16 సంవత్సరాలకు పైగా జర్నలిస్టుగా గతంలో ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై సంపూర్ణ అవగాహన కలిగిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల పత్రికలో పొలిటికల్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
తనను అసెంబ్లీ మీడియా సలహా మండలి అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 15 మందితో ఏర్పాటు చేసిన మీడియా సలహా మండలి లో చైర్మన్ గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మన్ గా పోలోజు పరిపూర్ణాచారి, సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులైన అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచంద్రారావు, ఎల్.వెంకట్రాం రెడ్డి, పొలంపల్లి ఆంజనేయులు, ఎం.పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీమ్ వజాహత్, బసవ పున్నయ్య , ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బీహెచ్ఎంకే గాంధీ నియమితులయ్యారు.