సింగరేణి ప్రజల సంపద… ఆ సంపదను ప్రజలకే పంచుదాం

– సింగరేణి సంస్థ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
– ట్రాన్స్కో జెన్కో బకాయిలు 18 వేల కోట్లు పెరగడానికి కారణాలేంటి?

సింగరేణి కాలనీ సంస్థ ప్రజల సంపద అందులో సృష్టించే సంపదను ప్రజలకు పంచుదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలతో వారు మాత్రమే లాభపడతారన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు బుధవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో “ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్” ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సంస్థ C&MD ఎన్. శ్రీధర్ థర్మల్ పవర్, సోలార్ పవర్, బొగ్గు ఉత్పత్తి, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, సంస్థ ఆదాయం, వ్యయం, ఉద్యోగస్తుల కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు 1521 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించాల్సి ఉండగా, 2023 నాటికి 18,326 కోట్లు బకాయిలు ఎలా పెరిగాయని అధికారులను ప్రశ్నించారు.

ట్రాన్స్కో జెన్కో కంపెనీల నుంచి రావలసిన బకాయిలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థలో లక్షా ఐదు వేల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పుడు 42 వేల మందికి ఎలా కుదించారని అధికారులను ప్రశ్నించారు.

బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న క్రమంలో 18 ఓపెన్ కాస్ట్ మైనింగ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిందని, తద్వారా ఖర్చులు తగ్గి సంస్థను నష్టాల నుంచి అధిగమించామని అధికారులు చెప్పిన సమాధానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెటింగ్ కోణంలో ఇది మీకు కరెక్ట్ కావచ్చు కానీ సామాజిక బాధ్యత అనిపించుకోదన్నారు.

ఓపెన్ కాస్ట్ మైనింగ్ లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయంతో వాళ్లు బాగుపడుతారు, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా, మరోవైపు నిరుద్యోగ సమస్య కూడా పెరగడం వల్ల ఇది రాష్ట్రానికి కూడా ఒక భారంగా మారుతుందన్నారు. ప్రజల సంపద ప్రజలకే పంచాలి. ఇలాంటి ప్రైవేటీకరణకు చెక్ పెడితేనే బాగుంటుందన్నారు.

పాదయాత్రలో జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఓపెన్ కాస్ట్ మైనింగ్ పరిశీలించిన సందర్భంగా సింగరేణి కాలరీస్ సంస్థకు చెందిన ఉద్యోగి, ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగి పొందుతున్న వేతనం చాలా వ్యత్యాసం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. ఇలా వ్యత్యాసం ఉండడం సమాజానికి మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ని ప్రైవేటు పరం చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply