షిట్‌.. ఇదేం ‘సిట్‌’?

– ఆరోపణ చేసిన వారికి నోటీసులిస్తారా?
– విచారణలో ఇదేం కొత్త సంప్రదాయం?
– బీజేపీ బంధ ంపై ఆరోపణలు చేసిన వారికి నోటీసులేవీ?
– సీబీఐ, సీఐడీ, ఈడీ కేసుల్లో నేతలకు కనిపించని నోటీసుల సంప్రదాయం
– నయూం, డ్రగ్స్‌ కేసుల్లో ఆరోపించిన వారికీ నోటీసులు లేవు
– వివేకా, పరిటాల హత్య కేసులోనూ కనిపించని నోటీసులు
– బోఫోర్స్‌, యూరియా, 2జీ, దాణా కేసులోనూ విపక్షాలకు నోటీసులివ్వని వైనం
– పరీక్ష లీకుల ఆరోపణల్లో మాత్రమే నోటీసులు ఎందుకు?
– విరుచుకుపడుతున్న విపక్షాలు
– సీనియర్‌ పోలీసు అధికారుల విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

నేర విచారణ ప్రక్రియ కొత్త పుంతలు తొక్కడంపై అటు రాజకీయ వర్గాలు, ఇటు సీనియర్‌ పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 36 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపాలు చేసిన.. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల లీకేజీ వ్యవహారం లొసుగులను తేల్చేందుకు, కేసీఆర్‌ సర్కారు సిట్‌ను నియమించింది. ఆ మేరకు 9 మందిని అరెస్టు చేసింది. సంతోషం. ప్రభుత్వ ప్రయత్నాన్ని మెచ్చుకోవలసిందే.

అయితే ఈ ఎపిసోడ్‌ తెరచాటు హస్తాలపై ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీలకు సైతం, సిట్‌ నోటీసులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి అయితే సిట్‌లో ఉన్న అధికారులకు, మంత్రి కేటీఆర్‌తో ఉన్న బంధాన్ని బహిరంగంగానే వెల్లడించారు.

విచారణ సంస్థలు తమ పరిశోధనలో లభించిన ఆధారాలు, సేకరించిన వస్తువుల ఆధారంగా వ్యవహరించాలే తప్ప.. ఆ అంశంపై ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చిన వైనం, నేరపరిశోధన చరిత్రలో ఎప్పుడూ లేదని.. అటు సీనియర్‌ పోలీసు అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వారికి నోటీసులిచ్చే సంప్రదాయాన్ని ఇప్పుడే చూస్తున్నామని, తమ సర్వీసులో ఇలాంటి అనుభవం తమకు ఎదురుకాలేదని సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులు చెబుతున్నారు.

వాటిని తాము సహజంగా రాజకీయ ఆరోపణలుగానే పరిగణించామే తప్ప, మీ వద్ద ఉన్న ఆధారాలేమిటో మాకు చెప్పాలని, ఏనాడూ వారికి నోటీసులు ఇవ్వలేదంటున్నారు. ఈవిధంగా ఆరోపణలు చేసినవారందరికీ నోటీసులిచ్చి, వారిని విచారణకు పిలిపించుకుంటూ పోతే, ఇక దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది? నివేదిక ఎప్పుడు ఇస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సంచలనం సృష్టించిన నూం వ్యవహారంలో, విపక్షాలు ఇలాగే పాలకపార్టీపై ఆరోపణలు గుప్పించాయి. అధికార టీఆర్‌ఎస్‌ నేతలు అతనితో అంటకాగారని కొందరు, నూం డైరీని ఎందుకు బయటపెట్టడం లేదని ఇంకొందరు, నూంను అధికార పార్టీ నేతలే ప్రోత్సహించారని మరికొందరు విపక్ష నేతలు ఆరోపించారు. కానీ నూం అక్రమాలపై వేసిన సిట్‌ అధికారులు, ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ నోటీసులు ఇవ్వని వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

నగరంలో డ్రగ్స్‌, పబ్‌లకు అవి సరఫరా అవుతున్న తీరుతోపాటు.. సినిమా నటులకు డ్రగ్స్‌తో ఉన్న సంబంధం ఉన్న వైనంపైనా సిట్‌ను నియమించారు. ఆ సందర్భంలో సినీ తారలతో అధికార పార్టీ నేతలు, మంత్రులకు సంబంధాలు ఉన్నందునే, విచారణ సక్రమంగా జరగడం లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. మరో సందర్భంలో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పించిన వైనం సంచలనం సృష్టించాయి. దానిపై కేటీఆర్‌ స్పందించి, ఎదురుదాడి కూడా చేశారు. అప్పుడు కూడా సిట్‌ అధికారులు.. మీ వద్ద ఉన్న ఆధారాలు మాకు చూపండి అని అటు రేవంత్‌రెడ్డికి గానీ, ఇటు అర్వింద్‌కు గానీ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.

అసలు దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్‌, 2జీ, యూరియా, దాణా కేసుల్లో నూ ఆరోపణలు కురిపించిన విపక్ష నేతలెవరికీ.. నోటీసులివ్వని వైనాన్ని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతున్న సమయంలోనూ, అంతకుముందు సీబీఐ దర్యాపు సమయంలోనూ, విపక్షాలు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆరోపణలు చేశాయి. అయితే అటు సీబీఐ గానీ, ఇటు కేంద్రం గానీ.. ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వని వైనాన్ని, బీజేపీ-కాంగ్రెస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఇక మాజీ మంత్రి పరిటాల రవి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుల వెనుక ఉన్న వ్యక్తులు-పార్టీల గురించి, ప్రత్యర్ధి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానంగా మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సిట్‌ వేసినప్పటికీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని విచారణకు పిలిచిన దాఖలాలు లేవు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన బాబాయ్‌ను హత్య చేశారని జగన్‌ సహా, వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ సిట్‌ అధికారులు మాత్రం వారిని విచారణకు హాజరుకావాలని, నోటీసులు ఇవ్వని వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

కాగా పరీక్ష పేపర్‌ లీకు కేసులో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి నోటీసులిచ్చిన సిట్‌.. ఆ కేసులో ఇద్దరే నిందితులని ప్రెస్‌మీట్‌ పెట్టిన, మంత్రి కేటీఆర్‌కు ఎందుకు నోటీసులివ్వలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ప్రశ్నించారు.

‘విచారణ జరుగుతున్న దశలో మంత్రులు ఆయా అంశాలపై మాట్లాడ కూడదు. ఎందుకంటే అది విచారణపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి. ఇది పదో తరగతి పిల్లాడికీ తెలిసిన విషయం. అసలు ఇంకా విచారణే ప్రారంభం కాకుండా, సిట్‌ అధికారులు ప్రాధమిక నివేదిక కూడా రూపొందించకుండా, బాధ్యతగల మంత్రి కేటీఆర్‌ లీకేజీ కేసులో ఇద్దరే నిందితులని ఎలా తేల్చేస్తారు? మరి ఆ ప్రకారంగా కేటీఆర్‌ వద్ద ఆ మేరకు ఏం ఆధారాలున్నాయని సిట్‌ అధికారులు, రేవంత్‌రెడ్డికి ఇచ్చినట్లే నోటీసులు ఇవ్వాలి కదా? మరి మీడియా, సోషల్‌మీడియాలో కేసీఆర్‌ సర్కారు అవినీతిపై కథనాలు వస్తున్నాయి. వాటిపైనా సిట్‌ వేసి, మీడియాకూ నోటీసులిస్తారా’’? అని అయోధ్య రెడ్డి ప్రశ్నించారు. అసలు తెలంగాణలో శాంతిభద్రతలకు సంబంధించిన ఏ అంశంపైనయినా, ఇప్పటిదాకా హోం శాఖ మంత్రి ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో కూడా హోంమంత్రి మహమూద్‌ అలీ, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడకుండా, కేటీఆర్‌ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని అయోధ్యరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

ఇక సిట్‌ విచారణ పద్ధతులు విచిత్రంగా, విస్మయకరంగా ఉన్నాయని సీనియర్‌ న్యాయవాది, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, సిట్‌ నోటీసులివ్వడంపై రామచందర్‌రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒకరికి బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపించిన, మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులివ్వకపోవడం అన్యాయమన్నారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు దర్యాప్తు చేయాలే గానీ, ఆరోపణలు చేసిన వారినుంచి ఆధారాలు ఇవ్వాలని కోరితే, ఇక ఆ విచారణ ఎందుకు? పోలీసులు ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో వివిధ సందర్భాల్లో సిట్‌ వేసినప్పుడు, ఈవిధంగా ఆరోపణలు చేసిన వారికి ఎందుకు నోటీసులివ్వలేదని ఆయన ప్రశ్నించారు.

‘పరీక్ష లీకు కేసుకు సంబంధం లేని కేటీఆర్‌ ఎలా ప్రెస్‌మీట్‌ పెడతారు? హోం, విద్యాశాఖ మంత్రి ఏమయ్యారు? సిట్‌ నివేదిక రాకముందే తీర్పులిస్తే, ఇక అధికారులు మంత్రి మనోగతానికి విరుద్ధంగా ఎలా నివేదిక ఇవ్వగలరు? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా సీఎం కేసీఆర్‌ ఇలాగే ముందుగా ప్రెస్‌మీట్‌ పెట్టి ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఆయన కొడుకు పరీక్ష లీకు వ్యవహారంలో దర్యాప్తు పూర్తికాకముందే ప్రెస్‌మీట్‌ పెట్టి, ముందస్తు తీర్పు ఇచ్చారు. అది అధర్మమే కాదు. అనైతికం కూడా’ అని రామచందర్‌రావు స్పష్టం చేశారు. అయినా తాము సిట్‌ను విశ్వసించమని స్పష్టం చేశారు. నిజానిజాలు తేలాలంటే సీబీఐ గానీ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ గానీ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply