– కనీస వేతనాల లేక అల్లాడిపోతున్నాం
– ఆర్టిజన్స్ గుర్తించాలంటూ సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదు
– బండి సంజయ్ ను కలిసి మొర పెట్టుకున్న తెలంగాణ విద్యుత్ బిల్ కలెక్టర్లు
– ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తానని బండి సంజయ్ హామీ
’’సార్… నెలలో 30 రోజులు పనిచేస్తూనే ఉన్నాం… కానీ రెండు పూటలా మా పిల్లలకు తిండికూడా పెట్టలేక అల్లాడుతున్నం. నెలంతా పనిచేసినా రూ.3,500లు కూడా రావడం లేదు. బతకడమే కష్టమైంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న మమ్ముల్ని ఆర్టిజన్లుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు… మీరే మాకు దిక్కు. న్యాయం జరిగేలా చూడండి’’అంటూ తెలంగాణ విద్యుత్ బిల్ కలెక్టర్లు పలువురు ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ ను కలిసి మొర పెట్టుకున్నారు.
అనంతరం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది బిల్ కలెక్టర్లు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు కావడం లేదని వాపోయారు. కోవిడ్ టైంల ప్రాణాలకు తెగించి పనిచేశామని, కొందరు సహోద్యోగులు ప్రాణాలు కూడా కోల్పోయినా ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయంలో బిల్ కలెక్టర్లకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.