తిరుపతి : జిల్లా నూతన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నగరంలోని ఎస్వీయూ క్యాంపస్, వెస్ట్, అలిపిరి పోలీస్ స్టేషన్లు, శాంతి భద్రతల అదనపు ఎస్పీ కార్యాలయము, ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి డిఎస్పి కార్యాలయము, జిల్లా సాయుధ దళ ప్రధాన కార్యాలయాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కౌంటర్, సెక్షన్ ఇన్చార్జ్ కౌంటర్, కంప్యూటర్ రూమ్, ఎన్‌హెచ్‌ఓ రూమ్, ఇతర గదులను మరియు చుట్టూ పరిసరాలను పరిశీలించి ఎన్‌హెచ్‌ఓ లకు తగిన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ల యొక్క క్రైమ్ చార్ట్ లను పరిశీలించి, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు ప్రస్తుతం అవలంబిస్తున్న ప్రణాళికను ఎన్‌హెచ్‌ఓ ల ద్వారా తెలుసుకొని, లోటుపాట్లను సరి చేస్తూ భవిష్యత్ కార్యాచరణను జిల్లా ఎస్పీ వివరించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ల యందు పనిచేస్తున్న పోలీస్ సిబ్బందితో ముచ్చటిస్తూ.. సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి, విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సాధక బాధలను అడిగి తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
అలాగే విధినిర్వహణలో ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా పోలీస్ స్టేషన్ లోని పోలీసులు తమ యొక్క విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, ప్రజలకు నిత్యం పోలీస్ స్టేషన్ అండగా ఉండాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశించారు.