Suryaa.co.in

Telangana

కేంద్రం నుంచి ప్రత్యేక సహాయసహకారాలు

– పాశమైలారం ప్రమాద స్థలిని సందర్శించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పాశమైలారం: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదస్థలిని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల వివరాలు, బాధిత కుటుంబాలకు అందుతున్న సహాయ సహకారాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిగాచి పరిశ్రమలో బాయిలర్ భారీ బ్లాస్ట్ జరిగి 36 మంది చనిపోవడం బాధాకరం. నిజానికి ఇవాళ ఉదయమే ఈ ప్రమాదస్థలాన్ని చూడాలని అనుకున్నాం.. రాష్ట్ర సీఎం వస్తున్నారని, బీజేపీ స్టేట్ ఆఫీసులో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చూసుకొని నేరుగా ఇక్కడికే వచ్చాం.

చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజానికి హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద పేలుడు ఘటన మునుపు ఎన్నడూ జరగలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించిన రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ సిగాచి. బాయిలర్ బ్లాస్ట్ జరిగి ఇంత పెను ప్రమాదం సంభవించింది. ఇంత ముందు రాంచందర్ రావు చెప్పినట్టు ఇప్పటి వరకు 46 మంది మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరో 13 మంది ఆచూకి ఇప్పటికే దొరకలేదని, మిగిలినవారు చికిత్స పొందుతున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.

గత నెలలో చార్మినార్ దగ్గర ఏసీ కంప్రెషర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి 17 మంది చనిపోయారు. ఇలాంటి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు.. కాబట్టి నేను అధికారులను, ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే.. ఇలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న అన్ని కంపెనీలను ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్నది.

కంపెనీస్ యాక్ట్ ప్రకారం.. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయి.. తనిఖీలు లంచాల కోసం జరుగుతున్నాయా? ఇన్ స్పెక్షన్స్ తూతూ మంత్రంగా జరుగుతున్నాయా? లేదా ప్రమాదాలు జరగకుండా, ప్రమాదాలను అరికట్టేవిధంగా జరుగుతున్నాయా? అనే అంశాలను ప్రభుత్వం చూడాలి. ఇలాంటి బ్లాస్టింగ్ దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.

పొట్టకూటి కోసం సొంత గ్రామాలను, బంధువులను, అయినవారిని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తూ ఈ రకంగా 46 మంది చనిపోవడం ఏదైతే ఉన్నదో.. చాలా దురదృష్టకరం. ప్రాణం అందరికీ ఒక్కటే.. పేదవారు అయినంత మాత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా.. వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని సంబంధిత కంపెనీని కోరుతున్నాను. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీ యాజమాన్యంపై ఉంది.

ప్రభుత్వం కూడా.. కంపెనీతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. బీజేపీ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించడంతోపాటు వారికి అండగా ఉంటుంది. మృతుల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఎంత మంది ఉన్నారనే వివరాలు తీసుకొని.. మా పార్టీ ఆయా రాష్ట్రాల శాఖల తరఫున వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం.

ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్న కంపెనీలు అన్ని కలిసి ఆయా ప్రాంతంలో ఓ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి, ఆంబులెన్స్ లను ఏర్పాటు చేసి కార్మికుల వైద్య సౌకర్యాల కోసం కృషి చేయాలి. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు.. ఆయా కంపెనీల్లో ఇప్పటి వరకు జరిగిన తనిఖీల వివరాలు బయటకు తీసి ఎంక్వైరీ చేయాలి.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి కూడా సేఫ్టీ ఆఫీసర్లు సింగరేణి నుంచి వచ్చి ఈ పరిశ్రమలో సహాయకచర్యలు అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా నిన్న ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వెలికితీతకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ప్రత్యేక సహాయసహకారాలు ఉంటాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన, అంగవైకల్యం పొందిన వారిని కూడా కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.

హాస్పిటల్ సందర్శన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించడం జరిగింది. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడాను. పాపం చాలా మంది పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నది. హైదరాబాద్ లో సిగాచి లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. కాబట్టి ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసి అన్ని ఫ్యాక్టరీలను తనిఖీ చేయించి.. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.

పాశమైలారంలో ప్రమాదం జరిగిందన్న సంఘటన తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను, మైన్స్ సేఫ్టీ అధికారులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.. మృతిచెందిన కుటుంబాలతోపాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

మృతుల్లో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతాం. బీజేపీ తరఫున కూడా ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో సమన్వయం చేసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం.

LEAVE A RESPONSE